జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Jio: ప్రస్తుతం మనం మొబైల్‌లో నెట్‌వర్క్ ఉందా లేదా అని చూసేందుకు సిగ్నల్ బార్లను చూస్తాం. సిగ్నల్ ఎక్కువగా ఉంటే ఇంటర్నెట్ వేగంగా వస్తుందని, తక్కువగా ఉంటే నెట్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తాం. కానీ భవిష్యత్ టెలికాం ప్రపంచం పూర్తిగా మారబోతోంది.

నెట్‌వర్క్ సమస్యలను స్వయంగా గుర్తించే టవర్లు
ప్రస్తుతం ఒక ప్రాంతంలో నెట్‌వర్క్ సమస్య వస్తే వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడం, ఆ తర్వాత టెక్నికల్ టీమ్ సమస్యను పరిశీలించడం సాధారణం. భవిష్యత్తులో ఈ విధానం మారే అవకాశం ఉంది. జియో పరిశోధనల్లో నెట్‌వర్క్‌కు సంబంధించిన వివిధ వివరాలను నిరంతరం విశ్లేషించి, సమస్య ఎక్కడ ఉందో గుర్తించే టెక్నాలజీలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో సిగ్నల్ బలహీనంగా ఉంటే లేదా అకస్మాత్తుగా నెట్‌వర్క్ వేగం తగ్గితే.. సిస్టమ్ స్వయంగా ఆ మార్పును గుర్తించేలా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా సిగ్నల్ అందని ప్రాంతాలను గుర్తించి, బేస్ స్టేషన్ సెట్టింగ్స్‌ను అవసరానికి అనుగుణంగా మార్చే అవకాశంపైనా పరిశోధనలు సాగుతున్నాయి. అంటే భవిష్యత్తులో నెట్‌వర్క్ సమస్య వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, సమస్య రాకముందే గుర్తించి పరిష్కరించే స్థాయికి టెక్నాలజీ చేరవచ్చు. కోట్లాది మొబైల్ వినియోగదారులు ఉన్న భారత్ వంటి దేశంలో ఇలాంటి టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది.
భారీ జనసందోహం ఉన్నా నెట్‌వర్క్ స్లో కాకుండా..
ఒక పెద్ద క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియాన్ని ఊహించండి. వేలాది మంది ఒకేసారి మొబైల్‌లో వీడియోలు చూస్తారు. కొందరు లైవ్ చేస్తారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో డేటా వినియోగం పెరిగితే నెట్‌వర్క్‌పై ఒత్తిడి పడుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ముందుగానే నెట్‌వర్క్ అవసరాన్ని అంచనా వేయగల టెక్నాలజీలపై జియో పనిచేస్తోంది. ఒక ప్రాంతంలో ఎంత మంది కనెక్ట్ అయ్యారు? ఎంత డేటా వినియోగిస్తున్నారు? నెట్‌వర్క్ సామర్థ్యం ఎంత వరకు ఉంది? వంటి వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసే విధానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక ప్రతి యాప్‌కు ఒకే విధంగా నెట్‌వర్క్ వనరులను కేటాయించే పద్ధతికి బదులుగా.. అవసరాన్ని బట్టి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలు కూడా భవిష్యత్తులో రావచ్చు. ఉదాహరణకు అత్యవసర సేవలకు అవసరమైన డేటాకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, సాధారణ వినోద సేవలకు వేర్వేరు స్థాయిలో నెట్‌వర్క్ వనరులను కేటాయించడం సాధ్యమయ్యే అవకాశం ఉంది.
ఒకే నెట్‌వర్క్‌లో ఎన్నో ప్రత్యేక నెట్‌వర్క్‌లు
భవిష్యత్ టెలికాం రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న టెక్నాలజీల్లో నెట్‌వర్క్ స్లైసింగ్ ఒకటి. దీని అర్థం చాలా సులభం. ఒకే భౌతిక నెట్‌వర్క్‌ను వేర్వేరు అవసరాల కోసం ప్రత్యేక భాగాలుగా విభజించడం. ఉదాహరణకు ఒకే 5G లేదా భవిష్యత్ 6G నెట్‌వర్క్‌లో సాధారణ మొబైల్ వినియోగదారులకు ఒక విభాగం ఉండవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే ఆటోమేటెడ్ యంత్రాలకు మరో ప్రత్యేక విభాగం ఉండవచ్చు. అత్యవసర సేవలు, ఆసుపత్రులు, ప్రభుత్వ వ్యవస్థలకు మరో ప్రత్యేక నెట్‌వర్క్ వనరులను కేటాయించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒకే ప్రాంతంలో వేలాది మంది వీడియోలు చూస్తున్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్‌పై ప్రభావం పడకుండా చూడవచ్చు. ఉదాహరణకు ఆసుపత్రిలో రిమోట్‌గా పనిచేసే అత్యవసర వైద్య పరికరాలకు నిరంతర నెట్‌వర్క్ అవసరం ఉంటుంది. అదే సమయంలో పక్కనే భారీగా మొబైల్ డేటా వినియోగం జరిగినా కీలక సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కేటాయించడం సాధ్యమవుతుంది.
టవర్ నుంచి ఫోన్ వరకు AI పాత్ర పెరుగుతుంది
కృత్రిమ మేథస్సు ఇప్పుడు మొబైల్ యాప్‌లకే పరిమితం కావడం లేదు. టెలికాం నెట్‌వర్క్‌ల నిర్వహణలోనూ AI కీలక పాత్ర పోషించే రోజులు రానున్నాయి. జియో పరిశోధనల్లో AI, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా నెట్‌వర్క్ సమాచారాన్ని విశ్లేషించే విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లౌడ్‌లో మాత్రమే AI పనిచేయకుండా.. నెట్‌వర్క్‌కు దగ్గరగా ఉన్న ఎడ్జ్ కంప్యూటింగ్ వ్యవస్థల్లోనూ AI నిర్ణయాలు తీసుకునే విధానంపై దృష్టి పెడుతున్నారు.
దీని ప్రధాన ప్రయోజనం వేగం. ఒక యంత్రం లేదా స్మార్ట్ పరికరం ప్రతిసారీ డేటాను దూరంలో ఉన్న డేటా సెంటర్‌కు పంపించి సమాధానం కోసం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ఉదాహరణకు భవిష్యత్తులో పరిశ్రమల్లో పనిచేసే రోబోలు లేదా ఆటోమేటెడ్ యంత్రాలు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. నెట్‌వర్క్ ఎడ్జ్ వద్దే AI సహాయంతో వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆలస్యం తగ్గి, రియల్‌టైమ్ సేవలు మరింత సమర్థంగా పనిచేయవచ్చు.
5G తర్వాత అసలైన లక్ష్యం 6G.. నెట్‌వర్క్‌కు ‘మెదడు’ తయారీ
జియో ప్రస్తుత 5G సేవలతోనే ఆగిపోవాలని భావించడం లేదు. 5G అడ్వాన్స్‌డ్, 6G, AI ఆధారిత నెట్‌వర్క్‌లు, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆధారిత టెలికాం వ్యవస్థలపై కంపెనీ పరిశోధనలు కొనసాగిస్తోంది. రిలయన్స్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్, దాని అనుబంధ సంస్థలు 2026 మార్చి 31 నాటికి వేల సంఖ్యలో పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేశాయి. వీటిలో భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.
6G అంటే కేవలం ప్రస్తుతం ఉన్న 5G కంటే ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే కాదు. భవిష్యత్ నెట్‌వర్క్ స్వయంగా పరిస్థితులను అర్థం చేసుకుని పనిచేసే స్థాయికి చేరడమే అసలు లక్ష్యం. ఎక్కడ డేటా వినియోగం పెరగబోతోందో ముందే అంచనా వేయడం, సిగ్నల్ సమస్యలను ఆటోమేటిక్‌గా గుర్తించడం, అవసరాన్ని బట్టి నెట్‌వర్క్ వనరులను పంపిణీ చేయడం, AI సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలు పెరగవచ్చు.
సింపుల్‌గా చెప్పాలంటే.. ఇప్పటి వరకు నెట్‌వర్క్‌ను కేవలం డేటా రహదారిగా భావిస్తే, రాబోయే రోజుల్లో అది ట్రాఫిక్‌ను నియంత్రించే తెలివైన వ్యవస్థగా మారనుంది. రోడ్డుపై ట్రాఫిక్ పెరిగితే పోలీసులు పరిస్థితిని బట్టి వాహనాలను నియంత్రించినట్లే.. భవిష్యత్ నెట్‌వర్క్ కూడా డేటా ట్రాఫిక్‌ను గుర్తించి అవసరానికి అనుగుణంగా నిర్వహించే అవకాశం ఉంది. అందుకే జియో భవిష్యత్ టెక్నాలజీ ప్రయత్నాల్లో అసలు విషయం కేవలం ఇంటర్నెట్ వేగం పెంచడం కాదు.. భారత డిజిటల్ నెట్‌వర్క్‌కు ఒక తెలివైన మెదడును అందించడం అని చెప్పవచ్చు. ఆ మెదడు ఎంత సమర్థంగా పనిచేస్తే.. AI, స్మార్ట్ సిటీలు, ఆన్‌లైన్ వైద్యం, డిజిటల్ విద్య, పరిశ్రమలు, వినోదం వంటి భవిష్యత్ సేవలు అంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

