హీరోగా నితిన్ 20 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలుపుతూ... ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.
నితిన్ మొదటి చిత్రం జయం విడుదలై నేటికి 20 ఏళ్లు. జూన్ 14, 2022న విడుదలైన జయం(Jayam) అప్పట్లో ఓ సంచలనం. చిత్రం, నువ్వు నేను విజయాలతో ఊపుమీదున్న దర్శకుడు తేజా జయం మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆయన గత రెండు చిత్రాలకు మించి జయం అతిపెద్ద విజయం నమోదు చేసింది. సదాను (Sadaa) కూడా ఈ చిత్రంతోనే వెండితెరకు తేజా పరిచయం చేశారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా జయం తెరకెక్కింది.
తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ మూవీ పరాజయం నేపథ్యంలో... రెండో చిత్రానికే విలన్ గా మారాడు. హీరోయిన్ సదా బావగా, రూత్ లెస్ విలన్ గా గోపిచంద్ నటన అద్భుతం. ఇక ఆర్పీ పట్నాయక్ పాటలు ఓ సంచలనం. రాను రాను అంటూనే చిన్నదో, ప్రియతమా తెలుసునా వంటి సాంగ్స్ యువతను ఊపేశాయి. నెలల తరబడి థియేటర్స్ లో సందడి చేసిన జయం అనేక నయా రికార్డ్స్ నమోదు చేసింది.
మొదటి చిత్రంతోనే నితిన్ (Nithin)ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. తర్వాత ఆయన నటించిన దిల్ మరో సూపర్ హిట్. ఐదవ చిత్రం దర్శకుడు రాజమౌళితో 'సై' చేశారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అద్భుతమైన ఆరంభం అందుకున్న నితిన్... దాన్ని కొనసాగించలేకపోయారు. సై మూవీ తర్వాత ఏకంగా 13 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2012లో విడుదలైన ఇష్క్ వరకు నితిన్ కి హిట్ లేదు.
ఈ 20 ఏళ్ల ప్రయాణంలో నితిన్ అనేక ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో నితిన్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు, ఫ్యాన్స్, దర్శక నిర్మాతలు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసిన దర్శకుడు తేజాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నితిన్ ఎమోషనల్ నోట్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం అనే చిత్రం తెరకెక్కుతుంది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
