Asianet News TeluguAsianet News Telugu

'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.
 

share chats  tik tok rival moj sees massive surge in downloads
Author
Hyderabad, First Published Jul 6, 2020, 11:00 AM IST

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతతో ’డిజిటల్ స్ట్రైక్‘లో భాగంగా 59 చైనా యాప్స్‌ను భారత్ నిషేధించడంతో దేశీయ వినోద యాప్స్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌కు టిక్‌టాక్ లాంటి చైనా యాప్‌ల బెడద వదిలిపోయింది. దీంతో అటువంటి యాప్‌లను భారత్‌లోనే తయారు చేయాలనే ఆలోచనకు మద్దతు పెరుగుతోంది. 

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నయంగా షేర్‌చాట్ తీసుకొచ్చిన ‘మోజ్’కు యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 4.2 రేటింగ్‌తో అత్యధిక డౌన్ లోడ్లతో దూసుకుపోతోంది. ఈ యాప్ తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది.

బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళంతో పాటు మొత్తం 15 భారతీయ భాషలతో మోజ్ యాప్‌ను రూపొందించారు. ఆంగ్ల భాష ఈ యాప్‌లో ఉండదు. టిక్‌టాక్‌లో మాదిరే ఈ యాప్‌లో సొంతంగా వీడియోలు 15 సెకన్ల నిడివితో సృష్టించవచ్చు. ఫిల్టర్లు, స్టిక్కర్లు, ఎమోటికన్లు వంటి ఎఫెక్ట్‍లు కూడా ఉన్నాయి. లిప్‌సింకింగ్ అనే ఆప్షన్‌తో సినిమా డైలాగ్స్‌ను టిక్‌టాక్‌లో మాదిరే అనుకరించవచ్చు.

అయితే టిక్ టాక్ మీద నిషేధంపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పందిస్తూ.. టిక్‌టాక్ లాంటి యాప్‌లు భారత్‌లో తయారు చేయడం తేలికేనని, వాటి ద్వారా లాభదాయక వ్యాపారం నెలకొల్పడమే అతిపెద్ద సవాలని వ్యాఖ్యానించారు.

also read  టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ ...

‘మనం కూడా టిక్‌టాక్‌లను తయారు చేసుకోగలం. అయితే ఇక్కడ మనకు ఎదురవుతున్న సవాలు కొంచెం సంక్లిష్టమైనది. అసలు ఈ వ్యాపారం వెనకున్న బిజినెస్ మోడల్స్‌‌ను ముందుగా అర్థం చేసుకోవాలి’ అని నందన్ నిలేకని పేర్కొన్నారు.

‘ఫేస్‌బుక్, గూగుల్ లాగా టిక్‌టాక్‌కూ ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలే. గత ఏడాది టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ 17 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. తద్వారా 3 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందింది. ఇందులో అధికభాగం చైనా, అమెరికా నుంచి వచ్చిందే’ అని నిలేకని తెలిపారు. 

‘భారత్‌లో డిజిటల్ యాడ్‌ల మార్కెట్ చైనా, అమెరికా అంతటి స్థాయిలో లేదు. భారత టీవీ, ప్రింట్, డిజిటల్ వేదికల్లో వచ్చే మొత్తం ప్రకటనల విలువ 12 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చు. ఇందులో డిజిటల్ వేదికల్లోని యాడ్‌ల వాటా 3 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది’ అని నందన్ నిలేకని స్పష్టం చేశారు.

’టిక్ టాక్ లాంటి ఉత్పత్తులు మన దేశంలో ఎక్కువగా లాభాలను ఆర్జించడం లేదని అర్థం. కేవలం వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతోనే ఆయా సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి’ అని నందన్ నీలేకని చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో వినియోగదారులను పెంచుకుని భవిష్యత్‌లో లాభాలను గడించడమే బైట్‌డ్యాన్స్ లాంటి సంస్థల వ్యూహమని ఆయన తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios