న్యూఢిల్లీ: చైనా తరహాలోనే భారత్‌ కూడా మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, ఉపకరణాలు, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విభాగంలోని కంపెనీలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే మూడు ప్రత్యేక పథకాలు ప్రకటించింది. 

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ), ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, సెమీకండక్టర్ల ప్రోత్సాహక పథకం (ఎస్‌పీఈసీఎస్‌), సవరించిన ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ క్లస్టర్‌ పథకం (ఎంఈఎంసీఎస్‌) పేరుతో ఈ మూడు పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. 

చైనాకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్న అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాలు ప్రవేశ పెట్టింది. ఈ మూడు పథకాల కింద ఈ రంగంలోని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తమ యూనిట్లు ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహిస్తారు.

ఈ కంపెనీల వార్షిక అదనపు అమ్మకాల వృద్ధి ఆధారంగా ఐదేళ్ల వరకు నాలుగు నుంచి ఆరు శాతం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇందుకు ఈ కంపెనీలు తొలి ఐదేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి, అయిదో సంవత్సరానికల్లా రూ.3,000 కోట్ల అదనపు అమ్మకాలు సాధించి ఉండాలి.

వీటికి తోడు రూ.5 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలకు కొన్ని పరిమితులకు లోబడి 25 శాతం పెట్టుబడి సబ్సిడీగా అందిస్తారు. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీ క్లస్టర్ల ప్రాజెక్టులకూ ప్రతి 100 ఎకరాలకు రూ.70 కోట్లకు లోబడి ప్రతి ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వరకు ఆర్థిక సాయం అందిస్తారు. 

also read కరోనా ఎఫెక్ట్: క్రెడిట్ కార్డులు చెల్లింపులు కష్టమయ్యాయా? చేయండిలా!!

ఆపిల్‌తోపాటు పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలేవీ తమ వస్తువులను నేరుగా ఉత్పత్తి చేయడం లేదు. చైనాలోని పలు కంపెనీల్లో వీటిని తయారు చేయించి తమ బ్రాండ్‌ పేర్లతో మార్కెట్‌ చేస్తుంటాయి.

ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఉపకరణాలు, సెమీకండక్టర్లు, మొబైల్‌ ఫోన్లన్నీ ఈ పద్దతిలోనే తయారవుతాయి. దీన్నే అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ (ఏటీఎంపీ) అంటారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 3,000 కోట్ల డాలర్ల వరకు ఉంటుంది. 2026 నాటికి ఇది 4,400 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకుల అంచనా. కోవిడ్‌-19 తర్వాత ఏటీఎంపీ రంగంలో ఉన్న కంపెనీలు చైనా ఒక్కదాన్నే నమ్ముకుంటే లాభం లేదని భావిస్తున్నాయి. 

భారత్‌లో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే మూడు తైవాన్‌ కంపెనీలు, ఒక అమెరికా దిగ్గజ కంపెనీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక కూడా ఈ యూనిట్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణ ప్రభుత్వం మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీసిటీ, దాని పరిసర ప్రాంతాల్లో ఎటీఎంపీ ప్రాజెక్టులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.