టి20 వరల్డ్ కప్ ఫైనల్: ఆస్ట్రేలియా ఓడించిందా? భారత్ ఓడిపోయిందా?
ఒక్క క్రికెటర్ ప్రదర్శనపై ఆధారపడితే మ్యాచులే నెగ్గగలం కానీ, ప్రపంచకప్‌లు కాదని మరోసారి రుజువైంది. మెల్‌బోర్న్ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ను తన బలంతో కొట్టిందనే కంటే, భారత్ తన బలహీనతతో తానే దెబ్బజోట్టించుకుందంటే బాగుంటుందేమో!
2020 మహిళల ప్రపంచ కప్ మొదలయ్యే ముందు భారత టీం సెలక్షన్ ని చూసి అందరూ ఒకటే ప్రశ్నను అడిగారు. ఆస్ట్రేలియా లాంటి ఫ్లాట్ పిచ్ లపైనా నలుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేసారు అని. దానికి టీం మానేజ్మెంట్ స్పిన్నర్లే మా బలం స్పిన్ బౌలింగే మా ఆయుధం అని అన్నారు.
పేస్ కి బాగా అనుకూలించే పిచ్ లపై స్పిన్నర్లను ఎందుకు ఆడిస్తున్నారు అని చాలా ప్రశ్నలే తలెత్తాయి. ఇక బౌలింగ్ ని అటుంచితే... భారత బ్యాటింగ్ లైన్ అప్ చూడడానికి ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ.... స్టార్ బ్యాట్స్ మెన్లు మాత్రం ప్రదర్శన చేయలేకపోయారు.
స్మృతీ మంధాన కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ కానీ ఏ ఒక్కరు కూడా ఈ వరల్డ్‌కప్‌లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ మెరువలేదు. అయినా, భారత జట్టు టైటిల్ పోరుకు చేరుకుంది. అందరూ కూడా మరోసారి లక్ మీదనే డిపెండ్ అయ్యారు తప్ప స్టార్స్ పెర్ఫార్మన్స్ మాత్రం కనబడలేదు.
Also read: ఇండియాతో ఆడాలంటే ఆసహ్యం, వారిద్దరికీ బౌలింగ్ చేయను: ఆసీస్ బౌలర్
ఒక్క క్రికెటర్ ప్రదర్శనపై ఆధారపడితే మ్యాచులే నెగ్గగలం కానీ, ప్రపంచకప్‌లు కాదని మరోసారి రుజువైంది. మెల్‌బోర్న్ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ను తన బలంతో కొట్టిందనే కంటే, భారత్ తన బలహీనతతో తానే దెబ్బజోట్టించుకుందంటే బాగుంటుందేమో!
డిఫెండింగ్ చాంపియన్‌గా సొంతగడ్డపై టైటిల్ నిలుపుకునే ఆరాటంలో ఉంది ఆసీస్. గతంలోనే నాలుగుసార్లు టీ20 ప్రపంచకప్‌లు సాధించిన ఘనత ఆస్ట్రేలియా సొంతమైనా.. భారత్ అవకాశాలను ఎవరూ తక్కువ చేయలేదు.
శక్తిమంతమైన జట్టుగా ఫైనల్లోకి ప్రవేశించింది భారత్. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన ఆత్మవిశ్వాసం టైటిల్ పోరులో అక్కరకు వస్తుందని అనుకున్నారు. గెలుపోటముల సంగతి పక్కనపెడితే, 85 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడుతుందని ఆస్ట్రేలియా సైతం ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు!.
కప్పు కోసం కసిగా పోరాడుతారని అనుకున్న అమ్మాయిలు ఆఖరు పోరులో ఎందుకిలా చేతులెత్తేశారనే ప్రశ్న సగటు అభిమాని మనసులో ఉద్భవించటం ఖాయం. గెలుపోటములు దైవాధీనాలు. అది వాస్తవం కూడా!
దాదాపు 90 వేల మంది అభిమానుల నడుమ వరల్డ్‌కప్ వేటలో ఒత్తిడికి లోనయ్యారా? లేదా తొలి కప్పు నెగ్గాలనే లక్ష్యం వారిపై మానసికంగా అధిక ఒత్తిడిని సృష్టించిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
బలహీనతలున్నప్పటికీ, ఎవరో ఒకరు ఆడటం మూలంగా ఫైనల్స్ వరకూ చేరుకున్న టీమ్ ఇండియా.. అంతిమ సమరంలో ఆ పని చేయలేకపోయింది. ఫలితమే మరోసారి వరల్డ్‌కప్ వేటలో భారత్ చరిత్రకు చేరువలోనే ఆగిపోయింది.
స్పిన్ మ్యాజిక్ ప్రభావం చూపలేకపోయింది....
పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు భారత స్పిన్ విభాగాన్ని మ్యాజికల్ చేశారు. వరల్డ్‌కప్‌లో స్పిన్నర్లే భారత్‌కు కీలకం అయ్యారు. బలాన్ని నమ్ముకోవటంలో తప్పులేదు. కానీ బలహీనతను బలహీనతగానే వదిలేయటం చారిత్రక తప్పిదం.
హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చేసింది అదే! పేస్ విభాగంలో నాణ్యమైన పేసర్లే లేరు. శిఖా పాండే సైతం ఫైనల్లో 52 పరుగులు ఇచ్చి, చేయాల్సిన నష్టం చేసింది. లీగ్ దశలో భారత్ మ్యాజిక్ గొప్పగా పని చేసింది.
వరల్డ్‌కప్ పిచ్‌లు సైతం భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని వేద కృష్ణమూర్తి ఫైనల్స్‌కు ముందు వ్యాఖ్యానించింది. భారత్ తన లీగ్ దశ మ్యాచులను సిడ్నీ షోగ్రౌండ్ స్టేడియం, వాకా, మెల్‌బోర్న్ జంక్షన్ ఓవల్‌లో ఆడింది. అక్కడ బలమైన ప్రభావాన్నే చూపింది.
Also read: తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి
ఇవి అన్ని స్లో పిచ్‌లు. స్పిన్ బలమున్న భారత్‌కు ఈ పిచ్‌లు గొప్పగా ఉపకరించాయి. కానీ ఫైనల్లో మెల్‌బోర్న్ పిచ్ పేస్‌కు స్వర్గధామం. పేస్, బౌన్స్‌తో కూడిన పిచ్‌పై నాణ్యత లేని భారత పేసర్లను ఆసీస్ ఉతికారేసింది.
17.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా తన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనే ( మెన్స్, ఉమెన్స్) అత్యధిక స్కోరు 154ను నమోదు చేసేసింది. 184/4తో మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో రికార్డు స్కోరు నమోదు చేసింది.
ఫైనల్లో భారత నలుగురు స్పిన్నర్లు ఓవర్‌కు కనీసం 7.25 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అలిసా హీలే, బెత్ మూని విశ్వరూపానికి శిఖా పాండే కెరీర్ లోనే చెత్త రికార్డును మూటగట్టుకుంది.
సూపర్ స్టార్స్ మెరవాణే లేదు....
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చేరటం కంటే భారత్ సంతోషించదగిన మరో విషయం షెఫాలి వర్మ. అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ఆరు నెలల్లోనే తొలి వరల్డ్‌కప్ ఆడేసిన షెఫాలి, 2020 వరల్డ్‌కప్‌లో తనదైన ముద్ర వేసింది.
ఐదు ఇన్నింగ్స్‌ల్లో 163 పరుగులు చేసింది. పవర్ ప్లేలో పవర్‌ఫుల్ హిట్టర్‌గా పేరు పొందిన షెఫాలి.. ప్రత్యర్థిలకు సింహస్వప్నంగా మారింది. లీగ్ దశ మ్యాచుల్లో బౌలింగ్ విభాగంలో నలుగురు స్పిన్నర్ల మ్యాజిక్ గెలిపించగా, బ్యాటింగ్ విభాగంలో ఒక్క షెఫాలి వర్మ మెరుపులే విజయాన్ని అందించిపెట్టాయి.
185 పరుగుల రికార్డు ఛేదనలో ఇన్నింగ్స్ మూడో బంతికే షెఫాలి వర్మ నిష్క్రమించింది. 16 ఏండ్ల అమ్మాయి డగౌట్‌కు చేరటంతోనే భారత్ వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి అని అందరూ భావించారు అంటేనే ఈ టీనేజర్ పైన్నే భారత్ ఎంతలా డిపెండ్ అయ్యారో అర్థమవుతుంది.
భారత జట్టులోని స్టార్, సీనియర్ బ్యాటర్లు వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4, 15, 1, 8, 2 పరుగులతో పూర్తి వరల్డ్ కప్ లో వైఫల్యం చెందింది. షెఫాలి వర్మ జట్టులోకి రాకముందు ఒంటిచేత్తో విజయాల్ని అందించిన స్మృతీ మంధాన వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్ చేయటం మరిచిపోయింది.
మిశ్రమ ప్రదర్శనలు చేసిన జెమీమా రొడ్రిగ్స్ ఫైనల్లో డకౌట్‌గా నిష్క్రమించింది. భారత్ టీ20 వరల్డ్‌కప్ వేటలో స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రొడ్రిగ్స్ అత్యంత కీలకం. కానీ ఈ ముగ్గురు విఫలమయ్యారు. యువ సంచలనం మెరుపులతో లీగ్ దశను నెట్టుకొచ్చినా, ఫైనల్లో ఆమె వెనుదిరగగా వీరూ చేతులెత్తేశారు.
ఫీల్డింగ్ తప్పిదాలు...
క్యాచులు మ్యాచులనే కాదు టోర్నీలనూ గెలిపిస్తాయి. ఈ మౌళిక సూత్రాన్ని మహిళల జట్టు మరిచింది. ఫలితంగా వరల్డ్‌కప్ ఫైనల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు అలిసా హీలే, బెత్ మూనీ భారీ అర్థ సెంచరీలు నమోదు చేశారు. ఈ ఇద్దరినీ పది పరుగుల లోపే అవుట్ చేసే అవకాశం భారత్‌కు లభించింది. కానీ పేలవ క్యాచింగ్‌తో హర్మన్‌సేన ఆసీస్ ఓపెనర్లకు కొండంత ఆత్మవిశ్వాసం అందించింది.
అలిసా హీలే 9 పరుగుల వద్ద ఉండగా కవర్స్‌లో షెఫాలి వర్మ సులువైన క్యాచ్ నేలపాలు చేసింది. బెత్ మూనీ 8 పరుగుల వద్ద ఉండగా రాజేశ్వరి గైక్వాడ్ తక్కువ ఎత్తులో వచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేక పోయింది.
వచ్చిన లైఫ్ లను సద్వినియోగం చేసుకున్న హీలే (75), మూనీ (78) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ గొప్ప పురోగతి సాధిస్తోంది. కానీ ఫీల్డింగ్‌లో కనీస స్థాయిలో సైతం రాణించటం లేదు.
భారత జట్టు ఫిట్నెస్ కూడా చాలా పేలవంగా ఉంది. ఒకరిద్దరు ఆటగాళ్లను మినహాయిస్తే మిగిలిన ఎవ్వరూ కూడా మైదానంలో మెరికెల్లా కదలలేకపోతున్నారు. మెరికల్లా అటుంచితే చాలా మందకొడిగా ఉంటున్నారు.
ఇప్పటికైనా భారత్ ఈ వరల్డ్ కప్ నుండి బలమైన పాఠాలను నేర్చుకొని... బౌలింగ్ విభాగంలో పదునైన ఫాస్ట్ బౌలర్లను తయారు చేసి, ఫీల్డింగ్ పై మరింత దృష్టి పెట్టి మంచి ఫిట్నెస్ సాధిస్తే భవిష్యత్తులోనైనా ఇలా మెగా టోర్నీల ఫైనల్స్ లో అభిమానానుల ఆశలు ఆవిరవకుండా ఉంటాయి.
సాధ్యమైనంత తొందరగా ఈ ఘట్టాన్ని ఒక పీడకలగా మర్చిపోయి, భవిష్యత్తులో దీని నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా భారత జట్టు ముందుకెళ్లాలని అందరం ఆశిద్దాం.