యువరాజ్, ధోని స్థానాలకు రీప్లేస్మెంట్ దొరికేశారోచ్!

2019 ప్రపంచ కప్ నుండి పాఠాలు నేర్చుకున్న కోహ్లి నాలుగేండ్ల ముందు నుంచే మిడిల్‌ ఆర్డర్ పై దృష్టి సారిస్తున్నాడు. యువరాజ్‌ సింగ్‌, ఎం.ఎస్‌ ధోనిలు ఖాళీ చేసిన 4, 5 స్థానాల్లో సరైన వారసులు ఇప్పటికీ దొరకలేదు. ఆ ఇద్దరు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. 

KL rahul, shreyas Iyer the new replacements for MS Dhoni and yuvraj singh

2020లో టీమ్‌ ఇండియా పెద్దగా పట్టించుకోని ఫార్మటు ఏదన్నా ఉందంటే... అది వన్డే ఫార్మటు అని చెప్పక తప్పదు. టీ20 ప్రపంచకప్‌ ఈ సెప్టెంబర్‌లో జరుగనున్నా విషయం తెలిసిందే! అందుకే ఈ ఏడాది కోహ్లిసేన తొలి ప్రాధాన్యం టి 20 కి ఇచ్చింది. 

ఇక టెస్టుల ప్రపంచ కప్ కూడా ఇప్పటికే ప్రారంభమయిపోయింది. 2021 ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో బెర్త్‌ ఖాయం చేసుకునేందుకు భారత్‌ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే నిలిచింది. 

చారిత్రక లార్డ్స్‌ టెస్టు ఫైనల్లోకి ప్రవేశించేందుకు కసిగా దూసుకెళ్తోన్న కోహ్లిసేన టెస్టు ఫార్మాట్‌పై ప్రాధాన్యతను అలాగే ఉంచింది. ఇక వన్డే విషయానికొస్తే, 2019లోనే వరల్డ్‌కప్‌ ముగిసింది. 

2023 వరల్డ్‌కప్‌ ప్రారంభమవడానికి ఇంకా సమయం ఉంది. దీంతో వన్డేలనూ టీ20 జట్టు కూర్పు కోసం వినియోగించుకునే పనిలో పడింది భారత్. చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సైతం వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా ప్రాధాన్యతపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చాడు. 

న్యూజిలాండ్‌ చేతిలో 0-3 తో సిరీస్ వైట్‌వాష్‌ ఓటమి కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి చరిత్రలో ఎప్పటికీ ఒక మాయని మచ్చగానే ఉండిపోతుందనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

స్వదేశంలో ఆసీస్‌ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లి సేన, ఇప్పుడు విదేశీ గడ్డపై కివీస్‌ చేతిలో సైతం వైట్‌వాష్‌ పరాజయం పాలయ్యింది. నాయకుడిగా విరాట్‌ కోహ్లి ప్రతిష్టపై ఖచ్చితమైన ప్రభావం చూపెడుతుంది. 

మిడిల్ ఆర్డర్ స్టార్స్ దొరికేశారోచ్... 

వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ లు గాయాల కారణంగా దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో తానున్నానంటూ ముందుకొచ్చే రాహుల్ ఓపెనర్ గా దిగాలి. కానీ అలా జరగలేదు. భారత్‌ ఈ సిరీస్‌ను పూర్తిగా ప్రయోగాల కోసమే వినియోగించింది. 

రాహుల్‌ను టాప్‌ ఆర్డర్‌లో ఆడించే ఆలోచనకు చెక్‌ పెట్టింది. కోహ్లీ తరువాత శ్రేయాస్ అయ్యర్, ఆతరువాత ఫినిషర్ గా రాహుల్ ఈ కాంబినేషన్ నే ఉపయోగిస్తూ... నూతన ఓపెనర్లను కూడా వెతికే పనిలో పడింది. పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ రూపంలో ఇద్దరు కొత్త ఓపెనర్లతోనే ముందుకు సాగింది. 

తొలి రెండు వన్డేల్లో కొత్త జంట నిరాశపరిచినా, మూడో వన్డేలోనూ వారికి అవకాశం ఇచ్చింది తప్ప రాహుల్‌ను మాత్రం టాప్‌ ఆర్డర్‌లోకి తీసుకురాలేదు. 2019 వరల్డ్‌కప్‌ ఓటమికి ప్రధాన కారణం బలహీనమైన మిడిల్‌ ఆర్డర్‌ అనేది జగమెరిగిన వాస్తవం. 

2019 ప్రపంచ కప్ నుండి పాఠాలు నేర్చుకున్న కోహ్లి నాలుగేండ్ల ముందు నుంచే మిడిల్‌ ఆర్డర్ పై దృష్టి సారిస్తున్నాడు. యువరాజ్‌ సింగ్‌, ఎం.ఎస్‌ ధోనిలు ఖాళీ చేసిన 4, 5 స్థానాల్లో సరైన వారసులు ఇప్పటికీ దొరకలేదు. ఆ ఇద్దరు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. 

న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఆ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. నం.4లో శ్రేయస్ అయ్యర్‌, ఐదో స్థానంలో కెఎల్‌ రాహుల్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనలు చేశారు. తొలి వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ శతకం సాధించాడు. 

తరువాత మ్యాచ్ జరిగిన మౌంట్ మంగనుయిలోనూ 62 పరుగులతో కూడిన ఒక బాధ్యతాయుతమైన అర్ధ సెంచరీతో రాణించాడు. నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ క్లాస్‌తో పాటు తనలోని మాస్‌ కోణాన్ని సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. 

లోయర్‌ ఆర్డర్‌లో ఎం.ఎస్‌ ధోని తర్వాత మరో ఆటగాడు ఆ స్థాయిలో మెప్పించిన దాఖలాలు లేవు.  గత ఐదారేండ్లలో ధోని తర్వాత అంతటి ఇన్నింగ్స్‌ ఆ స్థానంలో ఆడిన ఆటగాడు కెఎల్‌ రాహుల్‌ మాత్రమే. హామిల్టన్‌ వన్డేలో అజేయంగా 88 పరుగులు చేసిన రాహుల్‌, మౌంట్‌ మాంగనుయిలోనూ శతకం బాదాడు. 

టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించటం, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా గేర్లు మారుస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం, ప్రతికూల సమయంలో వికెట్‌ కాపాడుకుంటూ జట్టును రేసులో నిలుపటం ఇలా ఫినిషర్ స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆటగాడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. 

రాహుల్‌... ఈ వన్డే సిరీస్‌లో ఇవన్నీ తనలో ఉన్నాయని బ్యాట్‌తో చెప్పకనే చెప్పాడు. బలమైన టాప్‌ ఆర్డర్‌ ఉండడం, వారిలో ఎవరో ఒకరు సమయానికి ఆదుకుంటుండడం వల్ల వాస్తవానికి గత కొద్దీ కాలంగా మిడిల్‌ ఆర్డర్‌కు సరైన అవకాశాలు లభించలేదు. 

రోహిత్‌, ధావన్‌ లు అందుబాటులో లేకపోవటం, కోహ్లి కూడా నిరాశపరటంతో ఈ సిరీస్‌లో మిడిల్‌ ఆర్డర్‌కు సత్తా చాటే సమయం చిక్కింది. శ్రేయస్ అయ్యర్‌, రాహుల్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 

భారత్‌కు ఇక మిడిల్‌ ఆర్డర్‌ బెంగ లేదని, మిడిల్ ఆర్డర్ స్టార్స్ గా తాము వచేశామని చెప్పకనే చెప్పారు. మిడిల్‌ ఆర్డర్‌ మెరుపులు భారత్‌కు ఆనందాన్ని మిగల్చగా.. బౌలింగ్‌ విభాగ వైఫల్యం మాత్రం ఆందోళనను మిగిల్చింది. 

ప్రపంచ జట్లలో మేటి బ్యాట్స్‌మెన్‌ సైతం భయపడే బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు చెలాయించాడు. కానీ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం బుమ్రా మిస్టరీని ఛేదించారు. 

మూడు వన్డేల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దాదాపుగా ఓవర్ కు 5 పరుగులకన్నా ఎక్కువగానే సమర్పించుకున్నాడు. 0/53,0/64, 0/50 గణాంకాలతో బుమ్రా దారుణంగా నిరాశపరిచాడు. 

గాయం నుంచి కోలుకుని నేరుగా న్యూజిలాండ్‌కు వచ్చిన బుమ్రా ఇంకా పూర్తి స్థాయి లయ అందుకోలేదని సరిపెట్టుకోవాలా లేదా... బుమ్రాలో మునుపటి వాడి వేడీ తగ్గిపోయిందని ఆందోళన చెందాలా అనేది తెలియటం లేదు. 

స్పిన్నర్లు రవీంద్ర జడేజా, చాహల్‌ రాణించినా.. శార్దుల్‌ ఠాకూర్‌ మాత్రం ఇంకా జాతీయ జట్టు ప్రమాణాలను ఇంకా అందుకున్నట్టు కనబడడం లేదు. మౌంట్ ముంగనూయిలో పది ఓవర్ల కోటా గనుక పూర్తిచేసి ఉంటె.... రాహుల్‌ కంటే ఎక్వువ పరుగులు కొట్టేవాడు (కొట్టించేవాడు) అని ట్వీటర్‌లో ఠాకూర్‌పై సెటైర్లు పేలుతున్నాయి. 

వన్డే ఓటమి భారాన్ని దిగమింగి... ఆ జ్ఞాపకాలను మరిచిపోయి టెస్టు సవాల్‌కు సిద్ధపడింది. తాజగా న్యూజిలాండ్ ఎలెవన్ తో జరుగుతున్న మ్యాచులో ఆ సంకేతాలు కూడా కనబడ్డాయి. ఇక వేచి చూడాలి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫినాలే బెర్త్ కోసం భారత్ ఎలా ఆడుతుందో!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios