టెస్టు మ్యాచులను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారాన్నే లేపుతుంది. క్రికెట్ దిగ్గజాలందరూ ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకిస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి మొదలుకొని వివిధ దేశాల సారథులు, ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన క్రికెట్ కే తలమానికంగా భావించేది టెస్టు క్రికెట్. అందులో వున్డేల్లోలాగా, టి 20ల్లోలాగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ ఆటలో మజాయే వేరు. "క్రికెట్ ఆట అందు టెస్టు క్రికెట్ గ్రేటయా" అనే సామెత ఊరికే వచ్చింది కాదు. 

టెస్టుల్లో ఒక్కో పరుగుకు కూడా శ్రమించాల్సి వస్తుంది. క్రీడాకారుల ఫిట్నెస్ కి, వారి స్థైర్యానికి, ఏకాగ్రతకు, స్థైర్యానికి పరీక్షగా నిలుస్తుంది. రోజు రోజుకీ పిచ్ స్వభావం మారుతుంటే...దానికి అనుగుణంగా ఆటతీరును మార్చుకుంటూ ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. అందుకే వన్డే, టి 20లోకి ప్లేయర్స్ వచ్చినంత తొందరగా ఆటగాళ్లు టెస్టు జట్టులోకి ప్రవేశించలేరు. అది టెస్టు ప్లేయర్ కి ఉండే క్రేజ్. 

ఇలాంటి ఆట నిడివిని 5 రోజుల నుండి నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ యోచిస్తోంది. ఈ నిర్ణయంపట్ల ఇంతలా వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో...అసలు ఎందుకు ఐసీసీ ఇలాంటి యోచన చేస్తుంది? ఎందుకు దిగ్గజాలు, పండితులు దీనిని ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? దీనివెనకున్న కథా కమామిషు మీకోసం. 

ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. కాసులు కురిపించే ఫార్మాట్‌లకు వీలైనన్ని ఎక్కువ రోజులు కేటాయించాలి. ప్రేక్షకుల ఆదరణ లేని ఫార్మాట్‌ను వీలైనంతగా కుదించాలి. వ్యయం తగ్గించుకోవటం, ఆదాయం పెంచుకోవటం. ఇదే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రధాన ధ్యేయంగా కనిపిస్తోంది. 

వ్యాపారమయంగా మారిన క్రికెట్‌లో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌ క్యాలెండర్‌ను శాసించే స్థాయికి గ్లోబల్‌ టీ20 లీగ్‌లు ఇప్పటికే చేరుకున్నాయి!. మన ఐపీఎల్ దీనికొక చక్కటి ఉదాహరణ. 

టీ20 లీగ్‌లకు ఎక్కువ సమయం లభించేందుకు వీలుగా ఐసీసీ చేస్తోన్న వింత ఆలోచనకు క్రికెట్‌ దిగ్గజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్పోరేటీకరణ జరిగిన క్రీడల్లో ఇప్పటికే సంప్రదాయ పద్దతులను విడిచి పెట్టడం చూస్తున్నాం. 

అభిమానులను అలరించటమే ప్రథమ కర్తవ్యంగా క్రీడా నిబంధనలను స్పాన్సర్లు వారి ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు, క్రీడా సంఘాలపై ఆ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మార్కెట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన క్రీడా సంఘాలు ఇప్పటికే చాలా వరకు సంప్రదాయ పద్దతులకు మంగళం పాడేశాయి. 

Also read: టెస్ట్ క్రికెట్ కి వరల్డ్ కప్:పూర్వ వైభవం వచ్చేనా?

ఆ ప్రభావం ఇప్పుడు క్రికెట్‌పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సంప్రదాయ ఐదు రోజుల టెస్టుల స్థానంలో నాలుగు రోజుల టెస్టులను ప్రవేశపెట్టాలని ఐసీసీ అనుకుంటోంది. 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను నాలుగు రోజుల ఫార్మాట్‌లోనే నిర్వహించేందుకు పావులు కదుపుతోంది. 

ఇటీవల ముంబయిలో ముగిసిన ఐసీసీ క్రికెట్‌ కమిటీ సమావేశంలో నాలుగు రోజుల టెస్టులపై విలువైన చర్చ జరిగింది. అన్ని వైపులా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజుల టెస్టుపై ముందుకు వెళ్లాలని ఐసీసీ భావించింది. 

నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో ఆసక్తి చూపగా.. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ జాబితాలోకి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌ కూడా చేరారు.

టెస్టు క్రికెట్ అంటేనే మెరుపు కోల్పోయి, పాతబడిన బంతితో మాయ చేయడానికి స్పిన్నర్లు వెయిట్ చేస్తారు.  పిచ్‌పై అప్పటికే ఏర్పడిన క్రాక్స్ పై బంతులేసి వికెట్లు నేలకూల్చడానికి వారి సర్వ శక్తులను ఒడ్డుతారు. ఇదంతా టెస్టు క్రికెట్‌లో అంతర్భాగం. 

ఐదో రోజు ఆటను తీసేసి స్పిన్నర్ల అవకాశాలకు గండి కొట్టటం అన్యాయమే అవుతుంది. అభిమానుల వినోదానికి టీ20లు, వన్డేలు, టీ20 లీగ్‌లు, టీ10 లీగ్‌లు, 100 బాల్స్‌ లీగ్‌ లు ఇప్పటికే చాలానే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేశాయి. 

క్రికెట్‌కు స్వచ్ఛమైన రూపం టెస్టులు. ఆ అద్భుత కావ్యం జోలికి ఐసీసీ వెళ్లకుండా ఉంటేనే మంచిది. వన్డే క్రికెట్‌లో రెండు కొత్త బంతుల నిబంధన వచ్చిన తర్వాత, రివర్స్‌ స్వింగ్‌ పూర్తిగా కనుమరుగయిపోయింది. ఎందుకంటే బాల్ రివర్స్ స్వింగ్ కావాలంటే అది పాతబడాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. 

పరిమిత ఓవుర్ల ఫార్మాట్‌లో రివర్స్‌ స్వింగ్ కనుమరుగయ్యే జాబితాలోకి చేరిపోయింది. రివర్స్‌ స్వింగ్‌ లభించేందుకు ముందు బంతి మెత్తబడాలి. టీ20, వన్డేల్లో ఆ అవకాశం లేదు. నాలుగు రోజుల టెస్టులను ప్రవేశపెడితే స్పిన్‌ పరిస్థితి కూడా అదే విధంగా మారుతుంది. 

Also read: ఐసీసీ ప్రతిపాదనను ఒప్పుకునే సవాలే లేదు...తేల్చి చెప్పిన కోహ్లీ

స్పిన్నర్ల నుంచి ఐదో రోజు ఆటను లాగేసుకోవటం అంటే సీమర్ల నుంచి తొలిరోజు ఆటను లాగేసుకోవడం ఒక్కటే. ప్రత్యేకించి భారత్ సహా ఇతర ఉపఖండపు జట్లకు నాలుగు రోజుల టెస్టుతో ఎక్కువ నష్టం. 

ఈ జట్లలో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉంటారు. ఐదో రోజు లేకుంటే ఉపఖండపు జట్లకు చాలా ప్రతికూలతలు ఏర్పడతాయి. ఆటలో అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది. ఆట స్వరూపం మార్చేందుకు ప్రయత్నాలు ఆపి నాణ్యమైన పిచ్‌లు అందించటంపై ఐసీసీ తొలుత దృష్టి సారించడం చెప్పదగిన సూచన. 

స్పిన్‌, సీమ్‌, స్వింగ్‌, బౌన్స్‌ అన్నీ సమపాళ్లలో ఉంటేనే ఆట బ్రతుకుతుంది. ఫలితాలు కూడా బాగుంటాయి.  దిగ్గజ స్పిన్నర్లు అందరూ కూర్చొని చర్చించి వారి నిర్ణయాన్ని సైతం ఐసీసీకి తెలిపితే మరింత ఉపయుక్తకరంగా ఉంటుంది.

ఇక ఐసీసీ చెప్పిన మరో వాదన ఏంటంటే...చాలా మ్యాచులు నాలుగు రోజుల్లోపే ముగుస్తున్నాయి అని వ్యాఖ్యానించింది. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 

గత దశాబ్ద కాలంలో నాలుగు రోజుల్లో చాల మ్యాచులే ముగిసాయి, కానీ వాటికన్నా ఎక్కువగా...నిస్సారంగా డ్రా గా ముగిసిన టెస్టులు అనేకం. ఒకవేళ నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌ అమల్లోకి వస్తే రానున్న కాలంలో టెస్టు క్రికెట్‌ మరింత ఎక్కువగా డ్రా మ్యాచులు చూడాల్సి వస్తుందనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

నాలుగు రోజుల టెస్టు ఆలోచన వెనుక ఖచ్చితంగా వ్యాపార కోణం ఉందనేధీ సుస్పష్టం. క్రికెట్ కి స్పాన్సర్షిప్ అవసరం. కానీ కేవలం వాటికోసమే అన్నట్టుగా ఆటను ఒక్క కమర్షియల్‌ కోణంలోనే చూడటం మంచిది కాదు కదా.  కేవలం కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ పద్దతిలో ఆటను నిర్ణయించటం భావ్యం కాదు. 

ఐదు రోజుల ఆట ప్రస్తుతం చాలా మంచి స్థితిలోనే ఉంది. పిచ్ లను గనుక మరింత లయబద్ధంగా తయారుచేస్తే ఆటకు మరింత జీవం పోసినట్టవుతుంది.  గతంలో ఎంసీసీ కూడా దీనిపై చర్చించి, చివరకు 5 రోజుల ఆటకే మొగ్గు చూపింది. 

Also read: హర్డిక్ పాండ్య, నటాషాల లవ్ స్టోరీ ఇదే: అచ్చం ఫిదా సినిమా మాదిరిగా...

టెస్టు క్రికెట్ కి జీవం పోయాలి అని ఐసీసీ నిజంగా భావిస్తే... డే నైట్ టెస్టులను మరింత ప్రాచుర్యంలోకి తేవడం, టెస్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ని మరింత ఆకర్షణీయంగా తయారుచేయడం, వన్డేలు, టి 20ల మధ్యలో గ్యాప్ ఫిల్లర్లు లాగా కాకుండా పూర్తి స్థాయిలో టెస్టు క్రికెట్ నే అన్ని జట్లతో ఆడిస్తే అప్పుడు టెస్టు క్రికెట్ మరింత వృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఇలా నాలుగు రోజులకు కుదిస్తే మాత్రం టెస్టు క్రికెట్ బ్రతకడం కష్టతరమైపోతుంది. 

మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌, ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, స్పిన్నర్‌ నాథన్‌ లయన్, పేస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లు నాలుగు రోజుల ప్రతిపాదనపై మండిపడుతున్నారు. వ్యాపార కోణంలో సంప్రదాయ క్రికెట్‌ రూపాన్ని మార్చే ప్రయత్నానికి ఆరంభంలోనే ఐసీసీకి ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

నాలుగు రోజుల ఫార్మాట్‌ ప్రతిపాదన ఇంకా ఐసీసీ క్రికెట్‌ కమిటీ పరిశీలనలోనే ఉంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ నాలుగు రోజుల ఆలోచనను పక్కకుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతలా వ్యతిరేకత ఎదురైనా, మొండిగా ఐసీసీ పిచ్చి ప్రయోగాలకు వెళ్తుందేమో చూడాలి!.