గంగూలీని అడ్డం పెట్టి లోథా కమిటీ సిఫార్సులకు తూట్లు

బీసీసీఐలో సంస్కరణల పర్వాన్ని అడ్డుకునేందుకు విభేదాలను పక్కనపెట్టి మరీ క్రికెట్‌ పరిపాలన కురు వృద్దులు ఏకతాటిపైకి వచ్చారు. సంస్కరణలపై సుప్రీంకోర్టు సంకల్పంతో  మొదలుపెట్టిన సంస్కరణల పర్వం విజయవంతంగా ముగిసింది. 

BCCI attempts to dilute lodha committee reforms...masquerading in the name of development and ganguly

శ్రీనివాసన్‌, నిరంజన్‌ షా, అనురాగ్‌ ఠాకూర్‌, అజరు షిర్కే.. వీరంతా ఎవరు అనుకుంటున్నారా? జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిన బీసీసీఐ మాజీ పెద్దలు. 

బీసీసీఐలో సంస్కరణల పర్వాన్ని అడ్డుకునేందుకు విభేదాలను పక్కనపెట్టి మరీ క్రికెట్‌ పరిపాలన కురు వృద్దులు ఏకతాటిపైకి వచ్చారు. సంస్కరణలపై సుప్రీంకోర్టు సంకల్పంతో  మొదలుపెట్టిన సంస్కరణల పర్వం విజయవంతంగా ముగిసింది. 

అభిమానులు, జస్టిస్‌ లోధా కమిటీ ఆశించిన మేరకు ఓ మాజీ క్రికెటర్‌ చేతికి బీసీసీఐ పగ్గాలు అందాయి. సౌరభ్‌ గంగూలీ సారథ్యంలోని యంగ్ టీం బీసీసీఐలో కొలువుదీరింది. జస్టిస్‌ లోధా సిఫారసుల స్ఫూర్తితో ముందుకు సాగుతారని అందరూ ఆశించారు. 

కానీ, అందుకు భిన్నంగా దాదా అధ్యక్షతన జరిగిన తొలి సర్వ సభ్య సమావేశంలోనే జస్టిస్‌ లోధా కీలక సిఫారసుల స్ఫూర్తిని నీరు గార్చేందుకు గట్టి స్కెచ్చే వేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 

Also read: India vs West Indies:టి20 వరల్డ్ కప్ బెర్తుల కోసం ఉత్కంఠ... పోటీ భారత ఆటగాళ్ల మధ్యే

దీన్ని బట్టి చూస్తుంటే, భారత క్రికెట్‌ బోర్డులో తరం మారింది, కానీ లోధా సిఫారసుల వ్యతిరేక స్వరంలో ఎటువంటి మార్పు లేదు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతున్న విషయం. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. నూతన అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సారథ్యంలో ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏజీఎం విజయవంతంగా ముగిసింది. 

మూడేండ్ల నుంచీ పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఏజీఎం ఆమోదం తెలిపింది. ఇటీవల కాలంలో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 

ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ ప్యానల్‌ను కొనసాగించేందుకు ఆసక్తి చూపెట్టలేదని, మార్చేందుకే తీర్మానించారని తెలియవస్తుంది. విరుద్ధ ప్రయోజనాల విషయంలో ఓ స్పష్టత ఏర్పడిన తర్వాత సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల వంటి దిగ్గజ క్రికెటర్ల సేవలను వినియోగించుకోవాలనే ధోరణిని వీరు కనబరిచారు. 

రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు ఇతరాత్రాలు అన్నింటిపైనా చర్చించారు. ఏజీఎంలో ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. జస్టిస్‌ లోధా సిఫారసుల స్ఫూర్తికి విఘాతం కలిగించే రీతిలో ఏజీఎం ఆమోదించిన తీర్మానం మాత్రం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. 

కొన్ని సిఫారసుల్లో నిబంధనలను సడలించేందుకు ఏజీఎం కచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆఫీస్‌ బేరర్లు బాహాటంగానే వెల్లడించారు. సంస్కరణల పర్వం ముగిసిన తర్వాత సమావేశమైన తొలి ఏజీఎంలోనే సంస్కరణల స్ఫూర్తికి తూట్టు పొడుస్తూ తీర్మానం ఆమోదించటం అందునా దాదా అధ్యక్షతన ఇలా అవడం విమర్శలకు తావిస్తోంది. 

లోధా సిఫారసుకు పొడవబోతున్న తూట్లు ఇవే... 

బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి వరుసగా ఆరేండ్లకు మించి పదవిలో కొనసాగరాదు. అది రాష్ట్ర సంఘం, బీసీసీఐలో ఎక్కడైనా లేదా రెండింటా కలిపి ఆరు సంవత్సరాలకు మించి పదవిలో ఉండకూడదు. 

గరిష్ట పదవీ కాలపరిమితిని 18 ఏండ్లుగా నిర్దేశించినా, ఏకఛత్రాధిపత్య ధోరణికి చెక్‌ పెట్టేందుకు ఈ నిబంధన జోడించారు. బీసీసీఐ పాలకులకు అసలు కాల పరిమితిపైనే తీవ్ర అభ్యంతరం. 

18 ఏండ్ల కాలమైనా వరుసగా కొనసాగే అవకాశం ఇవ్వాలని సైతం ఆరంభంలో బీసీసీఐ పెద్దలు వాదించారు . బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిబంధనల ప్రకారం మరో 9 నెలలు మాత్రమే పదవిలో ఉండగలడు. 

జగ్‌మోహన్‌ దాల్మియా హఠాన్మరణంతో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)లోకి ప్రవేశించిన గంగూలీ.. ఇప్పటికే ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. తండ్రి చాటు బిడ్డగా గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)లోకి అడుగుపెట్టిన జై షా సైతం మరో పది నెలల్లోనే బీసీసీఐ కార్యదర్శిగా వైదొలగాల్సి ఉంది.

భారత మాజీ కెప్టెన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా రావటంలో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ పాలనను గాడిలో పెట్టగలడని దాదాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిబంధనల కారణంగా అతడి పదవీ కాలం 9 నెలల్లోనే ముగియనుందనే సానుభూతి ప్రచారంలోకి తీసుకొచ్చారు. 

గంగూలీ వంటి నిజాయితీ కలిగిన పాలకుడు నిబంధనల కారణంగా పదవి నుంచీ తప్పుకోవాల్సి వస్తుందని సహజంగానే అభిమానుల్లో రూల్స్‌పై ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. 

కోర్టు ఏమంటుంది మరి...?

ఎన్నో అవాంతరాలను అధిగమించి బీసీసీఐలో సంస్కరణలు అమలు చేసింది సుప్రీంకోర్టు. క్రికెట్‌ బోర్డుకు పూర్వ అధికారాలు లభించిన మరు క్షణం సంస్కరణల స్పూర్తికి తూట్లు పొడుస్తారని న్యాయస్థానం ముందే ఊహించింది. 

అందుకు నూతన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సవరణకు కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది. దీంతో పదవీ కాల నిబంధన సడలింపు నిబంధన మార్పు కోసం బీసీసీఐ సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. 

Also read: ధోనీ అంటూ అరవకండి: పంత్ పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవటంలో అడ్డంకులకు కారణం అవుతోన్న విరుద్ధ ప్రయోజనాల నిబంధనపై న్యాయస్థానంలో సానుకూల స్పందన లభించే అవకాశం ఉన్నప్పటికీ, పదవీ కాలం నిబంధన సడలింపుపై న్యాయస్థానం వైఖరి అంచనా వేయటం కష్టమవుతోంది. 

గరిష్ట 18 ఏండ్లు ఉన్నందున, వరుసగా కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానంలో బీసీసీఐ వాదించే అవకాశం ఉంది. అభివృద్ది పనుల కొనసాగింపును ఇందుకు సాకుగా చూపే అవకాశం కూడా లేకపోలేదు.

కళంకిత పాలకులు అనర్హులు కావటంతో నూతన రాజ్యాంగం ప్రకారం వారి వారసులు క్రికెట్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. గంగూలీని అధ్యక్షుడిగా ఎన్నుకున్న సమయంలో చుట్టూ అందరూ అనర్హులు ఉన్న ఫోటోనే పరిస్థితికి అద్దం పట్టింది. 

వారసత్వ రాజకీయాలతో జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులకు దొడ్డి దారి ఎంచుకున్న కళంకితులు.. తాజాగా సంస్కరణలను నెమ్మదిగా ఎత్తివేయటంపై దృష్టి సారించటం ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఈ విషయంలో బీసీసీఐ దూకుడుకు బ్రేక్‌ వేస్తుందని ఆశిద్దాం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios