హైదరాబాద్: ఫామ్ కోల్పోయి వరుసగా విఫలమవుతున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. శుక్రవారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో వెస్టిండీస్ తో జరిగే తొలి టీ20 నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రిషబ్ పంత్ మీద వస్తున్న విమర్శలపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు. 

జట్టు యాజమాన్యానికి పంత్ మీద పూర్తి నమ్మకం ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. మ్యాచ్ లో పంత్ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలోని ప్రేక్షకులు ధోనీ అంటూ అరుస్తున్నారని, ముందుగా అలా అరవడం మానుకోవాలని ఆయన అన్నాడు.

పంత్ సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అతను మ్యాచ్ విన్నర్ అని, అయితే అతను విఫలమైన సందర్భంలో మనం అండగా నిలవాల్సి ఉందని కోహ్లీ అన్నారు. పంత్ విఫలమైన ప్రతిసారీ ధోనీ అని అరవడం సరైన పద్ధతి కాదని అన్నాడు. దేశం కోసం ఆడే ప్రతీ క్రికెటర్ ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో ఆడుతాడదని, మంచిగా ఆడదాలనీ దేశానికి విజయాలు అందించాలనే ఆలోచిస్తాడని ఆయన అన్నారు. 

అలాంటి పరిస్థితి ఏ ఆటగాడు కూడా కావాలని తెచ్చుకోడని అన్నారు. ఇలాంటి సందర్భంలో అతని అండగా నిలవాలని, రోహిత్ శర్మ చెప్పినట్లు అతన్ని స్వేచ్ఛగా వదిలేయాలని కోహ్లీ అన్నారు. పంత్ ను ఓపెనర్ గా పంపిస్తారా అనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పాడు. 

ప్రస్తుతం జట్టులోని ఏ బ్యాట్స్ మన్ అయినా ఏ స్థానంలోనైనా అడగలడని, అందుకే పంత్ విషయంలో ఆ ప్రశ్నకు నత వద్ద సమాధానం లేదని అన్నారు. చెప్పాలంటే వృద్ధిమాన్ సాహాను తీసుకుంటే.. ఐపిఎల్ ల అన్ని స్థానాల్లో బ్యాటింగ్ కు దిగాడని ఆయన అన్నారు. కోల్ కతా టెస్టుకు ముందు సాహాతో తాను ముందు అదే చెప్పానని, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పానని ఆయన అన్నారు. 

వెస్టిండీస్ తో సిరీస్ కు తమ జట్టు పూర్తిగా సిద్ధమైందని, పొట్టి ఫార్మాట్ లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని కోహ్లీ అన్నాడు.