Asianet News TeluguAsianet News Telugu

India vs West Indies:టి20 వరల్డ్ కప్ బెర్తుల కోసం ఉత్కంఠ... పోటీ భారత ఆటగాళ్ల మధ్యే

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచుల టీ20 పోరుకు టీం ఇండియా సిద్ధమయ్యింది. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్‌పై కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుండగా, మరికొందరేమో తాము కూడా వరల్డ్‌కప్‌ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో సత్త చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. 

all set for the first t20 in hyderabad: Team India players sweating for the spot in t20 world cup
Author
Hyderabad, First Published Dec 5, 2019, 11:20 AM IST

2019 వరల్డ్ కప్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తేరుకున్న టీమ్‌ ఇండియా, మరో వరల్డ్‌కప్‌ వేటకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న 2020 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ తన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉంది. 

బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌ ఎలా ఉండాలి, మిడిల్‌ ఆర్డర్‌ పాత్ర ఎలా ఉండాలి అనే అంశాలపై జట్టు మేనేజ్‌మెంట్‌ ఓ స్పష్టతతో ఉంది. టి20, ధనాధన్‌ వరల్డ్‌కప్‌ కావటంతో బౌలింగ్‌ లైనప్‌ సైతం బ్యాట్‌తో సత్తా చాటాల్సిన అవసరం ఉంటుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.  

గత 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే భారత్ నిష్క్రమించింది. 2016 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత 20 ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా ఏకంగా 45 మంది ఆటగాళ్లను టెస్ట్ చేసింది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ప్రపంచకప్‌ జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పుడు టీం మానేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచుల టీ20 పోరుకు టీం ఇండియా సిద్ధమయ్యింది. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్‌పై కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుండగా, మరికొందరేమో తాము కూడా వరల్డ్‌కప్‌ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో సత్త చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. 

టి 20 ఫార్మాట్లో వెస్టిండీస్ చాలా ప్రమాదకర జట్టు. 20 ఓవర్ల ఆటలో విండీస్‌కు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. బౌలింగ్‌లోనూ కరీబియన్లది పదునైన ఎటాకే. వారిపాలయేర్లలో టెయిల్ ఎండర్లు సైతం బ్యాటును ఝుళిపించగలరు. 

Also read: నిత్యానంద కొత్త దేశం... వీసా ఎలా పొందాలంటూ అశ్విన్ ట్వీట్

వెస్టిండీస్‌తో టీ20 పోరులో సిరీస్‌ ఫలితంపై ఎవరికీ అనుమానం లేదు. కానీ వ్యక్తిగత ప్రదర్శనలతో ఎవరు వరల్డ్‌కప్‌ జట్టులో నిలిచేందుకు సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తారనేది కీలకంగా మారింది.

2020 ప్రపంచకప్‌ జట్టులో సుమారు 8 మంది ఆటగాళ్లు తమ స్థానాలను దాదాపుగా ఖాయం చేసుకున్నారని చెప్పవచ్చు. 15 మందితో కూడిన వరల్డ్‌కప్‌ జట్టులో ఇంకో ఏడు స్థానాలపైనే పీట ముడి కొనసాగుతోంది. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌లు బ్యాటింగ్‌ లైనప్‌లో స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు అసలు పోటీ లేదు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, దీపక్‌ చాహర్‌ సహా స్పిన్నర్‌ చహల్‌లు ఆల్రెడీ ఆస్ట్రేలియా విమానానికి టిక్కెట్లు ఖరారు చేసుకున్నారు. 

జట్టు కీలక ఆటగాళ్లను మినహాయిస్తే శ్రేయస్ అయ్యర్‌ ఒక్కడే ఇటీవల నిలకడగా రాణిస్తూ ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు!. ఏడు టీ20ల్లో మాత్రమే ఆడిన శ్రేయస్ అయ్యర్‌ తన నైపుణ్యంతో టి20 జట్టులో కీలకంగా ఎదిగాడు. 

గాయంతో కొంత కాలంగా ఆటకు దూరమైన హార్దిక్‌ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌ సాధించగానే నేరుగా జట్టులోకి రానున్నాడు. హార్దిక్‌ పాండ్యకు పోటీనిచ్చే ఆల్‌రౌండర్‌ భారత జట్టులో సమీప కాలంలో కనపడడం లేడు. 

ఏడు స్థానాల కోసం పోటీపడుతున్న అభ్యర్థుల లిస్ట్ కొంత పెద్దగానే కనిపిస్తోంది. విభాగాలవారీగా ఎవరెవరు అని పరిశీలిస్తే.. బ్యాటింగ్‌ లో శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ సహా ఎం.ఎస్‌ ధోని రేసులో ఉన్నారు. 

ఆల్‌రౌండర్ల కోటాలో శివం దూబె, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు తీవ్రంగా స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌ కు అవకాశం దక్కే ఛాన్స్ అధికంగా కనబడుతుంది. రాహుల్‌ చాహర్‌ సైతం ఇదే కోటాలో పోటీ పడుతున్నాడు. 

ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం జాబితాలో, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, రవీంద్ర జడేజాలు ప్రపంచకప్‌ జట్టులో స్థానం ఖరారు చేసుకోవడానికి ఓ మంచి పెర్ఫార్మన్స్ దూరంలో మాత్రమే ఉన్నారు. 

రిషబ్‌ పంత్‌కు సంజూ శాంసన్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. అయితే, ముందుగా తనను తాను నిరూపించుకునేందుకు సంజూ శాంసన్‌కు కనీసం ఒక అవకాశం అయినా దక్కాలి. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ను జట్టు మేనేజ్‌మెంట్‌ ఓపెనర్‌గా పరిగణనలోకి తీసుకుంటేనే అతడు వెస్టిండీస్‌తో తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. 

Also read; విరాట్ ని ఇలా ఔట్ చేయాలి... విండీస్ కోచ్ సిమ్మన్స్

మనీశ్‌ పాండే ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా మెరుగైన మనీశ్‌ పాండే సైతం ఒక మంచి ప్రదర్శనతో గనుక ఆకట్టుకుంటే అతనికి కూడా టి 20 వరల్డ్ కప్ టికెట్ దక్కినట్టే. 

వెస్టిండీస్‌తో తాజా సిరీస్‌లో రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, మనీశ్‌ పాండేలు ప్రపంచకప్‌ జట్టు ఎంపికను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌ సిరీస్‌తో పాటు రానున్న న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు టీ20ల్లోనూ నిలకడ సాధిస్తే ఈ ముగ్గురికీ వరల్డ్‌కప్‌ బెర్త్‌ లభించే అవకాశం ఉంది. 

పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి సైతం టీ20ల్లోనూ ప్రభావశీల బౌలర్లుగా నిరూపించుకునేందుకు వెస్టిండీస్‌తో సిరీస్‌ ఓ మంచి అవకాశం. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నిరాశపరిచిన శివం దుబేకు సైతం విండీస్‌పై పోరులో మరోసారి తనను తాను నిరూపించుకునే మంచి అవకాశం లభించనుంది. ధనాధన్‌ హిట్టర్‌గా శివం తనేంటో క్రికెట్‌ ప్రపంచానికి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 

ఉప్పల్ స్టేడియం లో ప్రాక్టీస్ షురూ... 

భారత్‌, వెస్టిండీస్‌ జట్లు ఉప్పల్‌ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 పోరులో తలపడనున్నాయి. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న టీమ్‌ ఇండియా బుధవారం ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. వెస్టిండీస్‌ టీం ఇండియా కన్నా ఒక రోజు ముందుగానే సాధన ఆరంభించింది. మ్యాచ్‌కు ముందు రోజైన నేడు కూడా ఇరు జట్లు ఉప్పల్‌ మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొననున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios