సికింద్రాబాద్ ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. ఇంతకా వెపన్స్ ఏమయ్యాయంటే.?
Secunderabad: సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.?
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఆగస్టు 31న ఆయుధాల చోరీ వెలుగులోకి వచ్చింది. అంతకుముందు రోజు వరకు నిర్వహించిన తనిఖీల్లో ఆయుధాలన్నీ ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత ఆయుధాగారంలోని తాళాలు ధ్వంసమైనట్లు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు నిర్వహించగా పిస్టల్స్, రైఫిళ్లు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ వంటి సామగ్రి కనిపించకుండా పోయినట్లు నిర్ధారించారు. అత్యంత భద్రత ఉండే సైనిక ప్రాంతం నుంచి ఆయుధాలు ఎలా బయటకు వెళ్లాయన్నది మొదట పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దీంతో బయట వ్యక్తుల ప్రమేయంతో పాటు ఆర్మీ ప్రాంగణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేపట్టారు. ఆయుధాగారం నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూసే సిబ్బందిని విచారించినప్పటికీ, వారి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించలేదని డీజీపీ తెలిపారు.
టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు
విచారణ ముందుకు సాగుతున్న సమయంలో గతంలో హవల్దార్‌గా పనిచేసిన మల్లేష్, మరో మాజీ హవల్దార్ టీపీఎస్ రావుపై పోలీసులు దృష్టి సారించారు. మల్లేష్ కదలికలకు సంబంధించిన సమాచారం, ఫోన్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అధికారులు అతడిని ప్రశ్నించారు. అయితే తొలుత విచారణకు రావడానికి కూడా మల్లేష్ ఆసక్తి చూపలేదని డీజీపీ తెలిపారు. అతడి ఫోన్ కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్స్ తొలగించబడినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. విచారణ సమయంలో మల్లేష్ ప్రవర్తనలో ఆందోళన స్పష్టంగా కనిపించిందని, ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయంలో అతడి ముఖంలో భయం కనిపించిందని డీజీపీ వివరించారు. చివరకు కేసు తీవ్రతను అతడి భార్యకు పోలీసులు వివరించగా, ఆమె మల్లేష్‌ను గట్టిగా ప్రశ్నించింది. దీంతో అతడు చోరీకి సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
రెక్కీ చేసి.. కార్గిల్ గేట్ నుంచి లోపలికి వెళ్లి చోరీ
మల్లేష్ ముందుగానే రెజిమెంట్ ప్రాంతాన్ని పరిశీలించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం పరిసరాల్లో అతడు రెక్కీ నిర్వహించినట్లు డీజీపీ చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భద్రతా నిఘా తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 30న కార్గిల్ గేట్ వైపు నుంచి సైనిక ప్రాంగణంలోకి ప్రవేశించి, చీకటిని అనుకూలంగా మార్చుకుని ఆయుధాగారం వద్దకు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంచిన ప్రాంతానికి సంబంధించిన తాళాలను పగులగొట్టి సామగ్రిని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని కారులో అచ్చంపేట వైపు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో అతడు ముందుగానే ప్రదేశాన్ని పరిశీలించడం, ప్రవేశ మార్గాన్ని ఎంచుకోవడం వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.
పాకిస్థాన్ లింక్‌పై ఆరా
చోరీ చేసిన ఆయుధాలను అచ్చంపేటలోని తన కుటుంబ నివాసానికి సమీపంలో దాచినట్లు మల్లేష్ విచారణలో వెల్లడించినట్లు డీజీపీ తెలిపారు. కొన్ని ఆయుధాలను గడ్డివాములో ఉంచినట్లు సమాచారం. మరికొన్నింటిని గుంత తీసి పాతిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించి చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. తొలిదశలో నాలుగు AK-203 రైఫిళ్లు, ఒక INSAS రైఫిల్, ఆరు 9ఎంఎం పిస్టళ్లు, ఒక సివిలియన్ పిస్టల్‌తో పాటు మ్యాగజైన్లు, బుల్లెట్లు మాయమైనట్లు గుర్తించారు.
ఇదే సమయంలో మల్లేష్ సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి చెందిన ఆయుధాల విక్రేతకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అతడు ఫాలో అవుతున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఆ ఖాతాలో వివిధ తుపాకులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోషల్ మీడియా సంబంధం నేరానికి ప్రత్యక్ష లింక్ అని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. చోరీ చేసిన ఆయుధాలను విక్రయించాలనే ఉద్దేశం ఉందా? విదేశీ వ్యక్తులతో ఏదైనా సంబంధం ఏర్పడిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మాజీ సైనికుడి నేపథ్యంపై విచారణ..
మల్లేష్ నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్లకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. క్రమశిక్షణకు సంబంధించిన కారణాలతో అతడిని గతంలో ఆర్మీ నుంచి తొలగించినట్లు సమాచారం. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక లావాదేవీలు, పరిచయాలు, ఫోన్ సంభాషణలు, సోషల్ మీడియా కార్యకలాపాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇటీవల అతడు నాగర్‌కర్నూల్‌లో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన అంశం కూడా దర్యాప్తులో భాగంగా మారింది. మరోవైపు, అత్యంత భద్రత కలిగిన సైనిక కేంద్రం నుంచి ఆయుధాలు బయటకు వెళ్లడం రక్షణ వ్యవస్థలోని లోపాలపై ప్రశ్నలు లేవనెత్తింది. ఆయుధాగారం భద్రత, సీసీటీవీ నిఘా, ఎంట్రీ-ఎగ్జిట్ వివరాలు, ఆయుధాల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసులతో పాటు ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా కేసు దర్యాప్తులో భాగమయ్యాయి. ఆయుధాలు రికవరీ కావడం కీలక పురోగతే అయినప్పటికీ.. మల్లేష్ వెనుక మరెవరైనా ఉన్నారా? చోరీకి అసలు కారణం ఏంటి? ఆయుధాలను ఎక్కడికి తరలించాలనుకున్నాడు? సోషల్ మీడియా ద్వారా విదేశీ ఆయుధ విక్రేతలతో ఏమైనా సంబంధం ఏర్పడిందా? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ విషయాలపై అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

