QR Code ఫుల్ ఫార్మ్ ఏంటో తెలుసా? ఈ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ఎలా చదువుతుంది?
ఈ టెక్ జమానాలో షాపులో పేమెంట్ చేయాలన్నా, ఏదైనా వెబ్‌సైట్‌కి వెళ్లాలన్నా, హోటల్ మెనూ చూడాలన్నా… ప్రతీచోటా QR కోడ్ కనిపిస్తోంది. అసలు ఈ నలుపు-తెలుపు గళ్ల డబ్బా ఎలా పనిచేస్తుంది? మీ ఫోన్ దాన్ని ఎలా చదువుతుంది? తెలుసుకుందాం రండి...

QR కోడ్ అంటే ఏమిటి?
QR కోడ్ పూర్తి పేరు 'క్విక్ రెస్పాన్స్ కోడ్'. అంటే చాలా వేగంగా చదవగలిగే కోడ్ అని అర్థం. ఇది ఒక ప్రత్యేకమైన 2D బార్‌కోడ్. ఇందులో నలుపు, తెలుపు రంగుల్లో ఉండే చిన్న చిన్న చదరపు గడుల రూపంలో సమాచారం దాగి ఉంటుంది. దీనిలో వెబ్‌సైట్ లింక్, మొబైల్ నంబర్, టెక్స్ట్, ఈమెయిల్, లొకేషన్, Wi-Fi పాస్‌వర్డ్ లేదా పేమెంట్ వివరాలను స్టోర్ చేయవచ్చు.
మీ ఫోన్ QR కోడ్‌ను ఎలా చదువుతుంది?
మీరు మీ మొబైల్ కెమెరా లేదా QR స్కానర్‌ను ఒక QR కోడ్‌పై పెట్టినప్పుడు, కెమెరా దాన్ని ఫోటో తీస్తుంది. మొదట మొబైల్ సాఫ్ట్‌వేర్ ఆ కోడ్‌లో ఉన్న 3 పెద్ద చదరపు బాక్సులను (ఫైండర్ ప్యాటర్న్స్) గుర్తిస్తుంది. ఈ బాక్సులు కోడ్ ఏ డైరెక్షన్‌లో ఉందో చెబుతాయి. ఆ తర్వాత మిగిలిన చిన్న నలుపు, తెలుపు బాక్సులను రీడ్ చేస్తుంది. ప్రతి బాక్సులో ఉండే డిజిటల్ సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ 0, 1 (బైనరీ డేటా) రూపంలోకి మార్చుకుని అర్థం చేసుకుంటుంది. కొన్ని సెకన్లలోనే QR కోడ్‌లోని డేటాను గ్రహించి, దానికి అనుగుణంగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం లేదా పేమెంట్ స్క్రీన్‌ను చూపించడం చేస్తుంది.
QR కోడ్‌లో ఇంత సమాచారం ఎలా స్టోర్ అవుతుంది?
ఒక QR కోడ్‌లో వేలకొద్దీ చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. ప్రతి బాక్స్ ఒక డిజిటల్ ప్యాటర్న్‌లో భాగం. ఈ ప్యాటర్న్‌ల సహాయంతోనే సమాచారాన్ని స్టోర్ చేస్తారు. ఒకవేళ QR కోడ్‌లో కొంత భాగం పాడైనా సరే, దాన్ని సులభంగా స్కాన్ చేయవచ్చు. ఎందుకంటే, ఇందులో 'ఎర్రర్ కరెక్షన్ టెక్నాలజీ' ఉంటుంది. ఇది పాడైన సమాచారాన్ని కూడా చాలా వరకు సరిగ్గా చదవడానికి సహాయపడుతుంది.
QR కోడ్ ఎందుకంత ఫేమస్ అయింది?
QR కోడ్‌ను స్కాన్ చేయడానికి కేవలం కొన్ని సెకన్ల సమయం పడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ టికెట్లు, బిజినెస్ కార్డులు, రెస్టారెంట్ మెనూలు, హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ సేవల వరకు దీని వాడకం విపరీతంగా పెరిగింది. UPI QR కోడ్ వచ్చిన తర్వాత, చిన్న దుకాణాల నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతిచోటా QR కోడ్‌తోనే పేమెంట్లు చేస్తున్నారు.
QR కోడ్ స్కాన్ చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
ప్రతి QR కోడ్ సురక్షితం కాదు. సైబర్ నేరగాళ్లు నకిలీ QR కోడ్‌లను ఉపయోగించి, మిమ్మల్ని ఫేక్ వెబ్‌సైట్‌లకు పంపవచ్చు లేదా మోసాలకు పాల్పడవచ్చు. అందుకే QR కోడ్ స్కాన్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. స్కాన్ చేశాక ఓపెన్ అయ్యే లింక్‌ను జాగ్రత్తగా చదవండి. పూర్తిగా నిర్ధారించుకోకుండా ఏ వెబ్‌సైట్‌లోనూ మీ వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలను నింపవద్దు.
QR కోడ్ గురించి ఆసక్తికర సమాచారం..
- QR కోడ్‌ను 1994లో జపాన్‌కు చెందిన 'డెన్సో వేవ్' (Denso Wave) అనే కంపెనీ కనిపెట్టింది. ఆటోమొబైల్ పార్ట్స్‌ను వేగంగా ట్రాక్ చేయడమే దీని అసలు ఉద్దేశం.
- సాధారణ 1D బార్‌కోడ్‌తో పోలిస్తే ఒక QR కోడ్ ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేయగలదు. అందుకే పేమెంట్లు, టికెట్లు, వెబ్‌సైట్ లింక్స్ వంటి సేవల్లో దీన్ని వాడుతున్నారు.
- QR కోడ్‌లో 'ఎర్రర్ కరెక్షన్' టెక్నిక్ ఉంటుంది. దీనివల్ల కోడ్‌లో కొంత భాగం పాడైనా స్కాన్ చేయవచ్చు.

