- Home
- Feature
- దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
ప్రతి సంవత్సరం సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ రాసేవారు లక్షల్లో ఉంటే సెలెక్ట్ అయ్యేవాళ్లు కేవలం వెయ్యిలోపే ఉంటారు. మరి సివిల్ సర్విసెస్ చరిత్రలో అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన రాష్ట్రమేదో తెలుసా?

సివిల్ సర్విసెస్ లో అత్యధిక ర్యాంకులు సాధించే రాష్ట్రాలివే..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలామంది యువతీయువకుల కల. సివిల్ సర్విసెస్ అంటే ఐఎఎస్, ఐపిఎస్ వంటి అత్యున్నతమైన ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు కూడా చాలామందే ఉంటారు. అయితే అత్యంత కఠినమైన సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ లో రాసి జాబ్ సాధించడం అందరితో సాధ్యంకాదు... లక్షలాదిమందిలో కేవలం వేలల్లో సెలెక్ట్ అవుతారు. సివిల్ సర్వీసులలో ‘ఇండియన్ పోలీస్ సర్వీస్’ (IPS) అత్యంత కీలకమైనది... పోలీస్ డ్రెస్ వేసుకోడానికే సివిల్స్ రాసేవారు చాలామంది ఉంటారు.
దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రతను కాపాడటం, నేర నియంత్రణలో ఐపీఎస్ అధికారులు ప్రధాన భూమిక పోషిస్తారు. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా ప్రతీ ఏటా ఐపీఎస్ అధికారుల ఎంపిక జరుగుతుంది. 1950 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అనేకమంది ప్రతిభావంతులు ఐపీఎస్ అధికారులుగా ఎంపికై దేశ సేవలో నిమగ్నమయ్యారు. మరి ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఐపీఎస్ అధికారులు వచ్చారనే అంశంపై పరిశీలిస్తే ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడవుతున్నాయి.
యూపీ, బిహార్‌లదే అగ్రస్థానం
సివిల్ సర్వీసెస్ లో మొదటి నుంచి ఉత్తర భారతదేశ రాష్ట్రాల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు సివిల్స్ సాధనలో అగ్రగామిగా నిలిచాయి. 1950 నుండి సేకరించిన గణాంకాల ప్రకారం... అత్యధికంగా 2,000 మంది ఐపీఎస్ అధికారులను అందించి ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దది కావడం మాత్రమే కాకుండా సివిల్స్ వైపు అక్కడి యువత చూపే ఆసక్తే దీనికి ప్రధాన కారణం. ఇక 1,450 మంది ఐపీఎస్ అధికారులతో బిహార్ రెండవ స్థానంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది.
ముందంజలో రాజస్థాన్, తమిళనాడు
ఈ జాబితాలో 1,000 మంది ఐపీఎస్ అధికారులను దేశానికి అందించడం ద్వారా రాజస్థాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్ యువతలో రక్షణ, పోలీస్ రంగాల పట్ల ఉన్న ఆసక్తి దీనికి నిదర్శనం.
ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. సివిల్ సర్విసెస్ లో తమిళనాడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తమిళనాడు నుంచి ఇప్పటివరకు 930 మంది ఐపీఎస్ అధికారులు ఎంపికై, దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం విశేషం.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల ప్రతిభ
పశ్చిమ భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, పరిపాలనా రంగంలోనూ తన ముద్ర వేసింది. మహారాష్ట్ర నుంచి ఇప్పటివరకు 880 మంది ఐపిఎస్ అధికారులు ఎంపికయ్యారు. అలాగే మధ్య భారతదేశంలో కీలకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రం 820 మంది ఐపీఎస్ లను సాధించి టాప్ జాబితాలో నిలిచింది.
హర్యానా, పంజాబ్ ల సత్తా
వ్యవసాయం, క్రీడా రంగాల్లో ముందుండే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఐపీఎస్ అధికారులను అందించడంలోనూ మెరుగైన స్థానాల్లో నిలిచాయి. హర్యానా రాష్ట్రం నుంచి 680 మంది ఐపీఎస్ అధికారులు ఎంపిక కాగా, పంజాబ్ రాష్ట్రం 620 మంది ఐపీఎస్ అధికారులను అందించి తన సత్తా చాటుకుంది.
టాప్ 10 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ
దేశానికి అత్యధికమంది సివిల్ సర్వెంట్స్ ని అందించే రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కూడా నిలిచింది. 1950 నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ (తెలంగాతో కలిపి) మొత్తం 600 మందికి పైగా అభ్యర్థులు ఐపిఎస్ అధికారులుగా ఎంపికై దేశవ్యాప్తంగా విధుల్లో రాణిస్తున్నారు.
ఇక అధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 500 మంది ఐపీఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. దీంతో దేశానికి ఎక్కువమంది ఐపిఎస్ లను అందించిన రాష్ట్రాల జాబితాలో కేరళ 10వ స్థానంలో నిలిచారు.
దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పరిశీలిస్తే... విద్యావసరాలు, ప్రాథమిక శిక్షణ, యువతలోని ఆశయాలు ఈ సంఖ్యను ప్రభావితం చేసినట్లు అర్థమవుతోంది. భిన్నమైన సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ టాప్ 10 రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కఠిన శ్రమ, పట్టుదలతో ఐపీఎస్ సాధించి దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అమూల్యమైన సేవలు అందిస్తున్నారు.

