- Home
- Sports
- Cricket
- Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Tilak Varma and Vaibhav Sooryavanshi Clash: దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

దులీప్ ట్రోఫీ ఫైనల్: తిలక్ వర్మ పంచ్ వార్నింగ్.. మైదానంలో వైభవ్ సూర్యవంశీతో మైండ్ గేమ్స్
దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో మైదానంలో తీవ్ర గొడవ జరిగింది. ఈస్ట్ జోన్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ కాస్తా కాసేపటికే గొడవకు దారితీసింది.
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్ తమ తుది జట్టులో ఒక మార్పు చేయగా, సౌత్ జోన్ దేవదత్ పడిక్కల్, మహమ్మద్ సిరాజ్ సహా నలుగురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.
సిరాజ్‌పై వైభవ్ సూర్యవంశీ ధనాధన్ బ్యాటింగ్
బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చెలరేగిపోయాడు. సౌత్ జోన్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై విరుచుకుపడ్డాడు. సిరాజ్ వేసిన ఏడో ఓవర్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో ఏకంగా 14 రన్లు రాబట్టాడు. దీంతో కెప్టెన్ తిలక్ వర్మ డిఫెన్సివ్ ఫీల్డింగ్ సెట్ చేయక తప్పలేదు. ఈ చిన్న వయస్సులోనే ఏమాత్రం భయం లేకుండా ఆడిన వైభవ్, మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ బౌండరీలు సాధించాడు. తొలి 10 ఓవర్లలోనే ఈస్ట్ జోన్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది.
'ఏందిరా ఈ వైస్ కెప్టెన్'.. స్టంప్ మైక్‌లో రికార్డ్
వైభవ్ ధాటిగా ఆడుతుండటంతో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మైండ్ గేమ్‌కు తెరతీశాడు. 11వ ఓవర్‌లో వైభవ్‌కు దగ్గరగా వెళ్లి స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టాడు. "ఏంటి యార్.. ఇది వైస్ కెప్టెన్?" అంటూ సెటైర్లు వేశాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ తర్వాత తిలక్ వర్మ కోపంతో వైభవ్ వైపు వెళ్తూ, పంచ్ ఇస్తా అన్నట్లుగా చేతితో సైగ చేశాడు. దీనికి 15 ఏళ్ల వైభవ్ కూడా వెనక్కి తగ్గకుండా ధీటుగా సమాధానమిచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుండటంతో అంపైర్లు మధ్యలో వచ్చి ఇద్దరినీ పక్కకు పంపించాల్సి వచ్చింది.
Tilak Verma vs Vaibhav Suryavanshi. pic.twitter.com/YIDfgF0qps
— Ishan's Fan (@Ishanworld32) September 6, 2026
వికెట్ తీసిన చామా మిలింద్.. అర్ధసెంచరీ దాటిన ఈశ్వరన్
తిలక్ వర్మ చేసిన స్లెడ్జింగ్ ప్లాన్ వర్కవుట్ అయింది. మైండ్ గేమ్‌తో ఏకాగ్రత కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ పారేసుకున్నాడు. చామా మిలింద్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పెద్ద షాట్ కొట్టే క్రమంలో టాప్ ఎడ్జ్ అయి మిడ్ వికెట్ వైపు వెళ్ళింది. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన తనయ్ త్యాగరాజన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో వైభవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు వైభవ్, అభిమన్యు ఈశ్వరన్ కలిసి మొదటి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సీనియర్ బ్యాటర్ ఈశ్వరన్ 72 పరుగులు చేసి ఈస్ట్ జోన్‌ను బలమైన స్థితిలో నిలిపాడు. లంచ్ విరామానికి ఈస్ట్ జోన్ 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
సెమీఫైనల్లో మెరుపులు.. అఫ్గానిస్థాన్ సిరీస్
వైభవ్ సూర్యవంశీ సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా సెంట్రల్ జోన్‌పై 92 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో ఈ యంగ్ స్టార్ నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ దలీప్ ట్రోఫీ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ జట్టుతో చేరనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ ఆడనున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
ఫైనల్ మ్యాచ్‌లో ఈ చిన్నపాటి గొడవ మ్యాచ్ హీట్‌ను మరింత పెంచింది. మైదానంలో సీనియర్లకు సైతం భయపడకుండా బ్యాటింగ్, అగ్రెషన్ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై అభిమానులు నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.

