WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇదివరకే  ప్లేఆఫ్స్ అర్హత సాధించిన  మంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్  లు   నేడు   టోర్నీలో రెండోసారి తలపడబోతున్నాయి.  

మహిళల ప్రీమియర్ లీగ్  లో ఇదివరకే ప్లేఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్న  ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లు  నేడు   ఈ సీజన్ లో రెండోసారి  ఢీకొనబోతున్నాయి.  మార్చి  09న ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో  ముంబై ఇండియన్స్..  8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి నేటి పోరులో  ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.  

పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం తలపడుతున్న ఇరు జట్లు..  డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ నెగ్గి మొదలు బౌలింగ్ ఎంచుకుంది.   ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు రానుంది. 

ఈ  సీజన్ లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్.. ఆరు మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలు సాధించి  10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.   ఢిల్లీ క్యాపిటల్స్..  ఆరు మ్యాచ్ లలో నాలుగు గెలిచి   8 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఢిల్లీ..  ముంబైని అధిగమించకపోవచ్చు. నెట్ రన్ రేట్ విషయంలో ఢిల్లీ (+1.431 ) కంటే  మొగ్గు ముంబై  (+2.670) వైపునకే ఉంది. అయితే భారీ తేడాతో ముంబై ఓడితే మాత్రం సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. 

ఈ లీగ్ నిబంధనల ప్రకారం అగ్రస్థానంలో ఉండే జట్టు  నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.  ఆ తర్వాత రెండు, మూడు స్థానాలలో ఉన్న జట్లు.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. గెలిచిన జట్టు ఫైనల్  చేరిన జట్టుతో తుది పోరులో తలపడుతుంది. 

 

తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం  ఢిల్లీ జట్టులో మార్పులేమీ లేవు.  గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే నేడూ ఆడుతోంది.  కానీ ముంబై మాత్రం..   పూజా వస్త్రకార్  తుది జట్టులోకి వచ్చింది. 

ముంబై : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, ఇస్సీ వాంగ్, పూజా వస్త్రకార్, అమన్‌జ్యోత్ కౌర్, జింతమని కలిత, సైకా ఇషాక్ 

ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజనె కాప్,  జెస్ జొనాసేన్, తాన్యా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్,   పూనమ్ యాదవ్