సచిన్ టెండూల్కర్‌కు ఎయిర్‌పోర్టులో మెటల్ డిటెక్టర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Facts: విమానశ్రయాల్లోకి వెళ్లే ముందు మెటల్ డిటెక్టర్ వద్ద చెకింగ్ చేయడం సర్వసాధారణం. అయితే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని మీకు తెలుసా.? అయితే దీని వెనుక ప్రత్యేకమైన నిబంధన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ వీడియోతో తెరపైకి వచ్చిన ఆసక్తికర విషయం
సచిన్ టెండూల్కర్ భారత విమానాశ్రయంలో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా విమానం ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు భద్రతా తనిఖీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లడం, అవసరమైతే వ్యక్తిగత తనిఖీలు చేయడం సాధారణ ప్రక్రియ.
కానీ వీడియోలో సచిన్ ఈ సాధారణ మెటల్ డిటెక్టర్ ప్రక్రియను పాటించకుండా నేరుగా ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో చాలామందికి సందేహాలు వచ్చాయి. అయితే ఇది సెలబ్రిటీ హోదా కారణంగా ఇచ్చిన మినహాయింపు కాదని, దేశంలోని విమానయాన భద్రతా నిబంధనల్లో భాగంగా ఉన్న ప్రత్యేక ప్రోటోకాల్ అని తెలుస్తోంది.
సచిన్‌కు ఈ ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఉంది?
సచిన్ టెండూల్కర్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న అందుకున్నారు. క్రికెట్ రంగంలో దేశానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసింది. భారతరత్న గ్రహీతలకు దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రోటోకాల్స్ వర్తిస్తాయి. అందులో విమానాశ్రయాల్లో ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెకింగ్‌కు సంబంధించిన మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే సచిన్ వ్యక్తిగతంగా కోరుకున్న కారణంగా ఈ సౌకర్యం పొందడం లేదు. భారతరత్న పురస్కార గ్రహీతగా ఆయనకు భద్రతా నిబంధనల ప్రకారం ఈ ప్రత్యేక మినహాయింపు లభిస్తోంది.
విమానాశ్రయ భద్రతా నిబంధనలు ఏం చెబుతున్నాయి?
భారత విమానాశ్రయాల్లో భద్రతా వ్యవహారాలను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) పర్యవేక్షిస్తుంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అనేక నిబంధనలు, ప్రోటోకాల్స్ ఈ సంస్థ రూపొందిస్తుంది. సాధారణంగా ప్రతి ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు భద్రతా తనిఖీలకు హాజరుకావాలి. అయితే దేశంలోని అత్యున్నత రాజ్యాంగ, ప్రభుత్వ హోదాల్లో ఉన్న కొందరు ప్రముఖులకు ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. ఈ జాబితాలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత హోదాల్లో ఉన్నవారితో పాటు కొన్ని ఇతర ప్రముఖ కేటగిరీలు కూడా ఉంటాయి. భారతరత్న పురస్కార గ్రహీతలకు కూడా నిర్దిష్ట భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం మినహాయింపు ఉంటుంది.
ఈ జాబితాలో ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది?
విమానాశ్రయాల్లో సాధారణ ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెకింగ్ నుంచి కొన్ని ప్రత్యేక కేటగిరీలకు మినహాయింపు కల్పిస్తారు. వీరిలో దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రముఖులు ఉంటారు. వీరిలో ప్రధానంగా భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రివర్గంలోని కొందరు ప్రముఖులతో పాటు రాష్ట్రాల గవర్నర్లు, భారతరత్న పురస్కార గ్రహీతలు ఉంటారు. వీరికి సాధారణ ప్రయాణికుల మాదిరిగా ప్రతి దశలో భౌతిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
సచిన్ భద్రతను ఎవరు చూసుకుంటారు?
మెటల్ డిటెక్టర్ తనిఖీ నుంచి మినహాయింపు ఉందని చెప్పడం వల్ల విమానాశ్రయంలో సచిన్‌కు ఎలాంటి భద్రత ఉండదని కాదు. ఆయన ప్రయాణ సమయంలో విమానాశ్రయ భద్రతా వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. విమానాశ్రయాల్లో సాధారణంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(CISF) భద్రతా బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రముఖుల ప్రయాణ సమయంలో భద్రత, జనసందోహం నియంత్రణ వంటి అంశాలను సంబంధిత భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారు.

