Asianet News TeluguAsianet News Telugu

తీరందాటిన నివర్... తమిళ రాజధాని చెన్నై అతలాకుతలం

నివర్ తుఫాను... కొద్దిరోజులగా తమిళ, కన్నడ, తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. 

నివర్ తుఫాను... కొద్దిరోజులగా తమిళ, కన్నడ, తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య ఈ తుపాను తీరం దాటింది. ఎంతో అలజడిని సృష్టిస్తూ తీరం వైపు దూసుకొచ్చిన నివర్ చివరి నిమిషంలో కాస్త శాంతించింది. కాస్త బలహీన పడి తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
ఇలా తీరందాటిన నివర్ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లతో పాటు విద్యుత్ వైర్లు రోడ్లపై పడుతూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. 

ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా నివర్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల శాఖ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

Video Top Stories