జనగామ: తెలంగాణలోని జనగామలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.  పట్టణ శివార్లలో చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని జనగామ మండలం శామీర్‌పేట గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేసి వెళ్లారు. 

మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. కల్వర్టు కింద మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి ఒంటిపై బట్టలు చెల్లాచెదురుగా ఉండటం,  గాయాలు కనిపించడంతో సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతురాలికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఓ కూతురు ఉంది. భర్త ఆమెను వదిలిపెట్టి హైదరాబాద్‌లో వేరే మహిళతో కాపురం ఉంటున్నాడు. ఆమె కొన్నాళ్లుగా గుడుంబాకు బానిసయింది. 

సోమవారం అర్థరాత్రి తన తల్లిదండ్రులుండే నెల్లుట్ల ప్రాంతం నుంచి జనగామ వైపు వచ్చింది. తెల్లవారుజామున శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.