Hyderabad : కాషాయ కండువా కప్పుకున్న అసదుద్దీన్ ఓవైసి

మజ్లిస్ అంటే ముస్లిం పార్టీ... అసదుద్దీన్ ఓవైసి అంటే ముస్లిం నేత అన్న పేరుంది.  అలాంటి నేత మెడలో కాషాయ కండువా ఎప్పుడైనా చూసారా..? ఎన్నికల వేళ  అలాంటి ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. 

 

 

Asaduddin Owaisi wearing a saffron scarf AKP

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జరుగుతున్నాయి... ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా ముగిసింది. నాలుగో విడతలో అంటే మే 13న తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు... ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ఇలా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి కూడా కేవలం ముస్లిం ఓట్లపైనే ఆదారపడుకుండా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోక్ సభ మజ్లిస్ పార్టీకి కంచుకోట. పాతబస్తీలో మెజారిటీ ప్రజలు ముస్లింలే... వారంతా దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీకే మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో ఎంఐఎం అధినేత ఓవైసి కుటుంబమే పాతబస్తీ రాజకీయాలను శాసిస్తూవస్తోంది. అయితే ఈసారి బిజెపి పాతబస్తీలో బలమైన అభ్యర్థి మాధవీలతను బరిలోకి దింపింది. దీంతో ఓల్డ్ సిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పాతబస్తీ ప్రాంతంలోని హిందువుల ఓట్లపైనే బిజెపి ఆశలు పెట్టుకుంది... ఈ దిశగానే ఆ పార్టీ ప్రచారం కూడా సాగుతోంది. 
 
అయితే మజ్లిస్ పార్టీ కూడా హిందువుల ఓట్లపై కన్నేసింది. అసదుద్దీన్ ఓవైసి ప్రచారాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బిజెపి హిందువుల ఓట్లను సమీకరించే పనిలో వుండగా ఎంఐఎం చీఫ్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్ కేవలం ముస్లింల పార్టీ కాదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ లేనిది అసదుద్దీన్ ఓవైసి కాషాయ కండువా కప్పుకున్నారు.  

 

అసలేం జరిగింది : 

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మూసారాంబాగ్ లోని పలు కాలనీల్లో పర్యటిస్తూ మజ్లిస్ పార్టీకి ఓటేయాలని కోరారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న ఓవైసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరోసారి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని ఓవైసి కోరారు.  

ప్రచారంలో భాగంగా ఓ హనుమాన్ మందిర్ వద్దకు వెళ్లారు అసదుద్దీన్ ఓవైసి. దీంతో ఆ ఆలయ పూజారి ఆయనుకు పూలదండతో పాటు ఓ కాషాయ కండువా కప్పారు. ఓవైసి కూడా నవ్వుతూ కాషాయ కండువా మెడలో వేయించుకున్నారు.  కానీ వెనకాల వుండే మజ్లిస్ నాయకులు వెంటనే ఆ కండువాను ఓవైసి మెడలోంచి తీసేసారు. ఇలా అసదుద్దీన్ ఓవైసి కాషాయ  కండువాతో కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అయితే హిందువుల ఓట్ల కోసమే ఓవైసి ఇలా పాట్లు పడుతున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. గతంలో కూడా ఓవైసి తలకు కాషాయ పగిడి ధరించారని... కాషాయ వస్త్రధారులైన స్వాములను కలిసిన వీడియోలు, ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీటిని స్వయంగా ఎంఐఎం సోషల్ మీడియా గ్రూప్స్ లోనే పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఓవైసి హిందూ వ్యతిరేకి కాదని చూపించే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందని అర్థమవుతోంది. 


 


 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios