ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అభం, శుభం తెలియని పసివాళ్లే. రోజూ స్కూల్ కి వెళ్లడం.. అక్కడి నుంచి ట్యూషన్ కి వెళ్లడం.. తిరిగి ఇంటికి చేరుకోవడం తప్ప మరో వ్యాపకం ఎరుగరు. అలాంటి చిన్నారులపై మృగాళ్ల కన్ను పడింది. దాదాపు సంవత్సరం పాటు ఆ ఇద్దరు చిన్నారులపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైదరాబాద్ లోని కామాటిపురలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామాటిపుర ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. అక్క తొమ్మిదో తరగతి చదువుతుండగా.. చెల్లెలు ఏడో తరగతి చదువుతోంది. కాగా... వారిపై మృగాళ్ల కన్నుపడింది.

Also Read వంతెన కింద మహిళ నగ్న దేహం: గాజుల్లో వజ్రాలు, దిమ్మతిరిగే విలువ...

 పెద్దమ్మాయి క్లాస్‌మేట్‌ అయిన ఓ బాలుడు (17) ఇద్దరినీ పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి ఒకరోజు సాయంత్రం ఒంటరిగా ట్యూషన్‌ నుంచి తిరిగి వస్తుండగా సమీపంలో ఉన్న శ్మశానవాటికలోకి ఆమెను బాలుడు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. 

కొన్నాళ్లకు అతడు ఈ విషయాన్ని అదేబస్తీలో ఉంటున్న తన స్నేహితులైన ఇద్దరు బాలురతో పాటు ఫతేదర్వాజ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షఫీఖ్‌ అలియాస్‌ షఫీ (20), మహ్మద్‌ సైఫ్‌ అలీ (19)లకు చెప్పాడు. ఈ ఐదుగురు కలిసి ఆ బాలికతో తరచూ మాట్లాడేవారు. ఆమె సోదరిని కూడా మాయమాటలతో నమ్మించి ట్యూషన్‌ నుంచి తిరిగివస్తున్న క్రమంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 

ఆ తర్వాత తరచూ ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికల ద్వారా దారుణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు బాలురితో పాటు షఫీ, సైఫ్‌ అలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు. షఫీ, సైఫ్‌ అలీలను రిమాండ్‌కు, ముగ్గురు బాలురను జువెనైల్‌ హోంకు తరలించారు.