Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వానలు దంచికొడుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి విధ్వంసం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వానల కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కుండపోత వానతో ఊళ్లు జలమయం
తెలంగాణలో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అత్యధికంగా 20.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా రాయపర్తి, యాదాద్రి జిల్లా దత్తప్పగూడ, మంచిర్యాలలోని కన్నెపల్లి తదితర ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాల వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 2, 3 ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బొగ్గు తీసే యంత్రాలు, కార్మికులు నిలిచిపోవడంతో దాదాపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే వర్షం హోరెత్తించింది. పటాన్‌చెరు, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో స్టార్ట్ అయిన కుండపోత వర్షం, ఆ తర్వాత ఖైరతాబాద్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ మీదుగా నగరమంతటికీ విస్తరించింది. బాచుపల్లి, ఆర్‌సీ పురంలో భారీ వర్షపాతం రికార్డయింది.
ఏపీ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అలర్ట్: మత్స్యకారులకు తీవ్ర హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మరో రెండ్రోజులు జాగ్రత్త: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 24 నుంచి 48 గంటల్లో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, వాగులు, మ్యాన్‌హోల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

