Asianet News TeluguAsianet News Telugu

మ‌ళ్లీ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. షెడ్యూల్ లో ల‌ఖింపూర్ ఖేరి బాధితుల పరామర్శ..?

ఇటీవలే వారం రోజుల పాటు ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మళ్లీ హస్తినకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరికి వెళ్లనున్నారు. అనంతరం పలువురు నాయకులు, ఆర్థికవేత్తలు, మేధావులతో సమావేశం కానున్నారు. ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చర్‌ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.

CM KCR Delhi tour again .. Lakhimpur Kheri victims' visit in schedule ..?
Author
Hyderabad, First Published Apr 16, 2022, 9:30 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ళ్లీ ఢిల్లీకి ప‌యన‌మ‌వ్వ‌నున్నారు. గ‌త కొంత కాలం నుంచి కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై సీఎం తీవ్రంగా విమర్శ‌లు చేస్తున్నారు. వ‌డ్ల‌ కొనుగోలు విష‌యంలో ఇది మరింత ఎక్కువైంది. గ‌తంలో సీఎం కేంద్రం రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తోంద‌ని, ఇది ఫెడ‌ర‌ల్ స్పూర్తికి విరుద్ద‌మ‌ని, కేంద్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మవుతోందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఫ్రంట్ ఏర్ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతూ.. కావాలంటే ఆ ఫ్రంట్ ను తానే ముందుండి న‌డిపిస్తాన‌ని చెప్పారు. ఆ దిశ‌గా కొన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కొంత కాలం త‌రువాత దాని ఊసే ఎత్త‌కుండా ఉన్నారు. 

తెలంగాణ‌లో యాసంగి వ‌డ్ల కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య వైరం మ‌రింత ఎక్కువైంది. యాసంగి సీజ‌న్ మొద‌లైనప్ప‌టి నుంచి ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య విమర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌లే సీఎం కేసీఆర్ ఢిల్లీలో వారం రోజుల పాటు ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా నిర్వ‌హించారు. యాసంగిలో పండిన వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. 24 గంట‌ల్లో కేంద్రం స‌మాధానం చెప్పి తీరాల‌ని అన్నారు. మ‌రుస‌టి రోజు కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించి, రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తుంద‌ని చెప్పారు. 

కేంద్రంలో ఉన్న బీజేపీ రైతు వ్య‌తిరేకి అని, తాము రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ చాలా కాలంగా చెబుతూ వ‌స్తున్నారు. అందులో భాగంగానే రెండేళ్ల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ చ‌ట్టాల‌పై రైతులు ఆందోళ‌నలు, నిరస‌న‌లు చేప‌ట్ట‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసింది. ఈ ఆందోళ‌న స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరి ప్రాంతంలో హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పై కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రా కారెక్కించాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం విచారణ జ‌రుగుతోంది. 

ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధ‌ర్నా నిర్వ‌హించిన స‌మ‌యంలో రైతు సంఘాల నేత రాకేష్ టికాయ‌త్ పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలో వారి మ‌ధ్య ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కొంత కాలం నుంచి కేంద్ర ప్ర‌భుత్వంపై వార్ చేయాల‌నుకుంటున్న సీఎం.. ఈ ల‌ఖింపూర్ ఖేరి నుంచే దానిని మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు రైతులు, ఓ జ‌ర్న‌లిస్టు చ‌నిపోయారు. అయితే ప్ర‌స్తుతం వేసే ఢిల్లీ టూర్ లో మొద‌ట ల‌ఖింపూర్ ఖేరికి వెళ్లి బాధితుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించనున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు సిద్ధం అవుతున్నారు. 

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ దాదాపు 10 రోజులు ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రైతుల కోసం ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చరల్‌ పాలసీ రావాల్సిన అవ‌స‌రం ఉందంటూ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ పాల‌సీని తీసుకురావ‌డానికి తాను కృషి చేస్తాన‌ని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీలో రైతు నాయ‌కుల‌తో, ఆర్థికవేత్త‌ల‌తో, నిపుణుల‌తో స‌మావేశం కానున్నారు. వీరితో స‌మావేశం ఏర్పాటు చేసి కొత్త అగ్రికల్చరల్‌ పాలసీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశం ముగిసిన త‌రువాత బీజేపీని వ్య‌తిరేకించే నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. అందులో భాగంగానే ఎన్ సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్, ఇత‌ర నాయ‌కులు, మేధావుల‌తో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ ఢిల్లీ టూర్ పై నేడో, రేపో స్ప‌ష్ట‌త వ‌చ్చే రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios