మోదీజీ ... అసలు సర్జికల్ స్ట్రైక్ చేసారా? నాకు అనుమానమే.. : రేవంత్ రెడ్డి

పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. బిజెపి, కాంగ్రెస్ నాయకుల మధ్య  ఈ విషయంలో మాటలయుద్దం సాగుతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద కామెంట్ చేయగా తాజాగా తెలంగాణ సీఎం కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. 

Who knows if Balakot strike took place or not: Telangana CM Revanth Reddy AKP

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఎండలే కాదు రాజకీయ నాయకుల ప్రచారాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం సాగుతోంది... ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్ కు, ముస్లింలకు ప్రయోజనాలే ముఖ్యమంటూ బిజెపి ఆరోపిస్తోంది. ఇదే సమయంలో దేవుళ్ల పేరుతో, దేశ రక్షణ పేరిట డ్రామాలాడుతూ బిజెపి హిందుత్వ పాలిటిక్స్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్ పైనా కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూల్వామా దాడిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

పుల్వామా ఉగ్రదాడిలో దేశ సైనికులు బలి బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్ర మోదీ కారణమని తెలంగాణ సీఎం అన్నారు. దాడి జరిగాక సర్జికల్ స్ట్రైక్ చేయడం కాదు... ఉగ్రవాదుల కదలికను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్దికోసం ఈ ఘటనను బిజెపి వాడుకుందని రేవంత్ ఆరోపించారు. పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసామని బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది... అసలు వీళ్ళు ఈ స్ట్రైక్ చేసారా?అన్న అనుమానం కలుగుతోందన్నారు.  సర్జికల్ స్ట్రైక్ జరిగిందో లేదో ఆ దేవుడికే తెలుసంటూ  రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్, రా, ఐబి వంటి విభాగాలు ఎందుకు గుర్తించలేకపోతున్నాయి? పుల్వామా దాడిని ఎందుకు ముందుగానే పసిగట్టలేకపోయారు? అని రేవంత్ ప్రశ్నించారు. దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఈ ఘటనతో అర్థమవుతుందన్నారు. పుల్వామా దాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసామని బిజెపి ప్రభుత్వం అంటోంది... కానీ ఏ తేదీన ఈ దాడి జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. అసలు సర్జికల్ స్ట్రైక్ అనేది ఎన్నికల కోసం మోదీ సర్కార్ ఆడిన నాటకంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడబోదని రేవంత్ స్పష్టం చేసారు. దేశం ఎవరి చేతిలోకి వెళ్లకుండా కాపాడతామన్నారు. దేశ రక్షణ తమ బాధ్యతగా రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకే దేశంపై ఎక్కువ ప్రేమ వుందని తెలంగాణ సీఎం అన్నారు. 

ప్రతి విషయంతో రాజకీయం చేసే మోదీకి దేశ ప్రయోజనాలకంటే బిజెపి గెలుపే ముఖ్యమని రేవంత్ అన్నారు. ఆయన ఎప్పుడుకూడా దేశంగురించి ఆలోచించలేదన్నారు. ఈ పదేళ్లలో బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీ దేశ అభివృద్ది, ప్రజాసంక్షేమం కోసం ఏం చేసారు? ఇలా ప్రశ్నిస్తే బిజెపి వాళ్ళవద్ద సమాధానం వుండదు కాబట్టి 'జై శ్రీరామ్' అంటారన్నారు. మళ్లీ మోదీని గెలిపించాల్సిన అవసరం ప్రజలకు, బిజెపి అవసరం దేశానికి లేవని రేవంత్ అన్నారు. తాతముత్తాల కాలంనుండి రామరాజ్యం, శ్రీరాముడి గొప్పతనం గురించి ప్రజలందరికి తెలుసు... ఇప్పుడు కొత్తగా బిజెపి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేవలం రాజకీయాల కోసం బిజెపి శ్రీరామ నామస్మరణ చేస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios