Asianet News TeluguAsianet News Telugu

‘వాట్సాప్’ చెల్లింపులు డౌటే? అవును డేటా భద్రతపైనే సందేహాలు

భారతదేశంలో వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి రావడం అనుమానమేనని తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీల వివరాల భద్రతపై సందేహాలు ఉన్నాయి. వాట్సాప్ పే ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం, ఆర్బీఐ ఆడిట్‌ చేయనున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ స్పైవేర్‌ వల్ల జర్నలిస్టులు, పలువురు ప్రముఖుల డేటా చోరీకి గురైందని వార్తలొచ్చాక వాట్సాప్ నుంచి డౌన్‌లోడ్స్‌ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

What is Facebook Pay and how is it different from WhatsApp Pay?
Author
Hyderabad, First Published Nov 14, 2019, 11:14 AM IST

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల రంగంలో అవకాశాలు అంది పుచ్చుకుని, ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడానికి మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చేస్తున్న యత్నాలు ఇప్పటికిప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచే విషయమై వాట్సాప్‌ సామర్థ్యంపై నెలకొన్న సందేహాలే దీనికి కారణం. 

దీనికి తోడు.. ఇతరత్రా దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పారదర్శకతను ‘వాట్సాప్‌ పే’ పట్టించుకోకపోవడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పైగా తమ యూజర్లు జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను నిబంధనల ప్రకారం భారత్‌లోనే భద్రపరుస్తోందా? లేదా? అన్న సంగతి కూడా వాట్సాప్‌ సూటిగా చెప్పకపోవటం సంస్థ తీరుపై అనుమానాలకు తావిస్తోంది. 

ఈ పరిస్థితుల్లో దేశీయంగా చెల్లింపుల వ్యవస్థకు కీలకంగా మారుతున్న ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను (యూపీఐ) వినియోగించడానికి వాట్సాప్‌నకు అనుమతునిస్తే మొత్తం పేమెంట్స్‌ వ్యవస్థకే ముప్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆందోళన చెందుతున్నాయి. 

also read  డిజిటల్ పేమెంట్ లోకి ఫేస్ బుక్ పే...

యూపీఐని వాడుకోవటానికి వాట్సాప్‌నకు అనుమతి ఇవ్వరాదని ఆర్థికశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ భావిస్తున్నాయి. ‘వాట్సాప్‌ పే’ లో యూజర్ల ఆర్థిక లావాదేవీల వివరాలకు భద్రత ఉండకపోవచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) సైతం భావిస్తోంది. 

అందుకే భారత యూజర్ల డేటాను స్థానికంగానే భద్రపర్చాలన్న లోకలైజేషన్‌ నిబంధనను వాట్సాప్‌ పక్కాగా పాటిస్తేనే, దేశవ్యాప్త పేమెంట్స్‌ సేవలకు అనుమతి ఇవ్వాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు (ఎన్‌పీసీఐ) ఆర్‌బీఐ స్పష్టంచేసింది. యూపీఐ విధానాన్ని ఎన్‌పీసీఐ రూపొందించింది. 

కొన్నాళ్లుగా వాట్సాప్‌ పే సేవలపై సానుకూలంగానే ఉంటున్నా, ఆర్బీఐ సూచనలతో పరిస్థితి మారేట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు వాట్సాప్‌ యూజర్ల సమాచారానికి ఎంత మేర భద్రత ఉన్నదన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఆ సంస్థ పేమెంట్‌ వేదికను సమగ్రంగా అధ్యయనం చేయాలన్న ఆలోచన కూడా వ్యక్తమవుతోంది.

What is Facebook Pay and how is it different from WhatsApp Pay?

ఆర్‌బీఐ, ఐటీ శాఖ సంయుక్తంగా ఈ ఆడిట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. డేటా లోకలైజేషన్‌ విషయంలో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాట్సాప్‌ పేమెంట్‌ సేవలను నడిపిస్తోందంటూ ఇప్పటికే ఒక స్వచ్ఛంద సంస్థ .. సుప్రీం కోర్టులో కేసు కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం వాట్సాప్‌ పే ద్వారా చెల్లింపుల విధానం ప్రయోగాత్మక దశలో ఉంది.

దీన్ని ఈ ఏడాదే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని వాట్సాప్‌ భావించినా తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పుడప్పుడే సాధ్యపడేలా లేదు. ప్రస్తుతం వాట్సాప్‌నకు భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. స్పైవేర్‌ ద్వారా యూజర్లపై నిఘా పెట్టేందుకు వాట్సాప్‌లో లొసుగులు కారణం అవుతున్నాయన్న ఆరోపణలు సైతం కంపెనీకి సమస్యగా మారాయి.

ఇటీవలే కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల సమాచారం బయటకు పొక్కిందనే వార్తలతో వాట్సాప్‌ భద్రతపై సందేహాలు అమాంతం పెరిగిపోయాయి. యూజర్ల డేటాను తస్కరించేందుకు ఉపయోగిస్తున్న పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ .. అమెరికాలో అధికారులకు ఫిర్యాదు కూడా చేసింది.

also read  అమ్మో!! ఇండియాలో బిజినెస్ చేయలేం: సీఈఓ...

అయినా వాట్సాప్‌పై సందేహాలు నివృత్తి కాలేదు. భారత్‌లో వాట్సాప్‌ డౌన్‌లోడ్స్‌ ఏకంగా 80 శాతం పడిపోయాయి. మొబైల్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ అధ్యయనం ప్రకారం స్పైవేర్‌ వివాదం బయటకు రాకముందు.. అక్టోబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 25 దాకా డౌన్‌లోడ్స్‌ 89 లక్షలుగా ఉన్నాయి. స్పైవేర్‌ వివాదం వచ్చాక  అక్టోబర్‌ 26 -నవంబర్‌ 3 మధ్య ఇది 18 లక్షలకు పడిపోయింది.

అదే సమయంలో సిగ్నల్‌ అనే మరో మెసేజింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 63 శాతం, టెలిగ్రాం డౌన్‌లోడ్స్‌ 10 శాతం పెరిగాయి.2017 ఫిబ్రవరిలో భారత్‌లో వాట్సాప్‌ చెల్లింపుల సేవలను ప్రారంభించనుందని తొలిసారిగా వార్తలు వచ్చాయి.  అదే ఏడాది జూలైలో యూపీఐ ద్వారా సేవలకు ఎన్‌పీసీఐ నుంచి అనుమతులు లభించాయి.

గతేడాది ఫిబ్రవరి: ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ప్రయోగాత్మకంగా సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రయోగాత్మక దశలోనే 10 లక్షల యూజర్లకు సేవలు అందిస్తున్న వాట్సాప్ పే మొత్తం 40 కోట్ల యూజర్ల సేవలు విస్తరించేందుకు అనుమతుల కోసం యత్నాలు చేస్తున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios