వాట్సాప్‌కు కొత్త చిక్కులు... పేమెంట్స్‌పై ఫిర్యాదు!
ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన మెసేజింగ్ ఫీచర్‌లోనే పేమెంట్స్ సెక్షన్ జత చేయడం యాంట్రీ ట్రస్ట్ స్ఫూర్తికి నిదర్శనం. దీని సాకుగా వాట్సాప్ పేమెంట్స్ అమలుకు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఫిర్యాదులు అందాయి.
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌కు కొత్త చిక్కులు వస్తున్నాయి. వాట్సాప్ వినియోగ దారుల కోసం పేమెంట్స్ ఆప్షన్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి బీటా వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదిలక్షల మంది యూజర్లతో ఈ ప్రయోగాత్మక వర్షన్ కొనసాగుతోంది. పేమెంట్ల రంగంలోకి వాట్సాప్ ప్రవేశించడంపై విమర్శలు వస్తున్నాయి.
భారత్‌లో ప్రస్తుతం వాట్సాప్‌కు దాదాపు 40కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మార్కెట్ విస్తృతికి ఉన్న అవకాశాల దృష్ట్యా గత రెండు సంవత్సరాలుగా వాట్సాప్ పేమెంట్స్ అనుమతికోసం ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. వాట్సాప్ మెసేజింగ్ యాప్‌గా తనకు గల సానుకూలతను చెల్లింపుల రంగంలో వాడుకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు వచ్చాయి.
ఈ సమయంలో మెసేజింగ్ యాప్‌లో ఉన్న పేమెంట్స్ ఆప్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలూ వచ్చాయి. మెసేజింగ్ యాప్ లోనే పేమెంట్ ఫీచర్ కూడా జత చేసి, ప్రస్తుతం ఉన్న యూజర్లకు బలవంతంగా పేమెంట్ సర్వీసు అందిస్తున్నదని ఫిర్యాదు. దీనిపై వచ్చిన ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు ఫిర్యాదు కూడా అందింది. తాజాగా ఈ విషయంపై సీసీఐ సమీక్షిస్తున్నట్లు సమాచారం. సమీక్ష తర్వాత సీసీఐ ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించడం లేదా విచారణకు అనర్హమైనదిగా తేల్చే అవకాశం ఉంది.
also read ఈ-కామర్స్ రంగంలోకి పతంజలి.. స్వదేశీ వస్తువుల విక్రయం
వాట్సాప్ తమ మెసేజింగ్ లాగే ఈ ఆప్షన్ ద్వారా ఇతరులకు డబ్బు సులువుగా పంపే వీలు ఉంటుంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ వంటివి ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్ కూడా ఈ సేవలు అందించేందుకు చాలారోజులుగా ప్రయత్నిస్తోంది. అయితే మెసేజింగ్, పేమెంట్స్ రెండూ కలిసి ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఫిర్యాదులు వచ్చాయి.
అంతేకాక పేమెంట్స్ డేటాను భారత్‌లోనే భద్రపరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే వాట్సాప్ వెల్లడించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు వాట్సాప్ చెల్లింపుల డేటాను భద్రపరిచేందుకు భారత్‌లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ మీద వచ్చిన ఫిర్యాదు విషయమై ఫేస్ బుక్ ఇఫ్పటి వరకు స్పందించలేదు.
సీసీఐ వద్ద కేసు ప్రారంభ దశలో ఉంది. మెసేజింగ్ యాప్ లోనే పేమెంట్స్ ఫీచర్స్ కలిపి ఉండటం కాంపిటీటివ్ స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని, ఇది భారతదేశంలోని యాంటీ ట్రస్ట్ చట్టానికి వ్యతిరేకమని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గమ్మత్తేమిటంటే 2018 నుంచి భారతదేశంలో వాట్సాప్ తన పేమెంట్స్ సర్వీసును పరీక్షిస్తూనే ఉన్నది. కేవలం 10 లక్షల మంది యూజర్లపై పరీక్షలు జరుపుతున్నది.