Hockey World Cup: హాకీ ప్రపంచకప్‌ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ సత్తా చాటింది. ఆమ్‌స్టల్‌వీన్ లో బుధవారం జరిగిన పూల్‌-D చివరి మ్యాచ్‌లో టీమిండియా 5-3 తేడాతో పాక్‌ను ఓడించింది.

ఆరంభంలోనే భారత్‌ దూకుడు

ఇంగ్లండ్‌ చేతిలో 2-4తో ఓడిన తర్వాత భారత్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. తదుపరి దశలో చోటు కోసం తప్పక గెలవాల్సిన పరిస్థితిలో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే దాడులకు పదును పెట్టారు. ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అద్భుతంగా గోల్‌గా మలిచాడు. దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 11వ నిమిషంలో అభిషేక్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత ఆధిక్యం 2-0కు చేరింది. తొలి క్వార్టర్‌లోనే పాక్‌పై భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

రెండో క్వార్టర్‌లో గోల్స్ వర్షం

రెండో క్వార్టర్‌లో భారత దాడులు మరింత పదునెక్కాయి. 21వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మార్చి వ్యక్తిగతంగా రెండో గోల్‌ సాధించాడు. దీంతో భారత్‌ 3-0తో ముందంజలో నిలిచింది. అయితే వెంటనే పాకిస్థాన్‌ స్పందించింది. 22వ నిమిషంలో హన్నన్‌ షాహిద్‌ గోల్‌ చేసి భారత ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆ వెంటనే 24వ నిమిషంలో అభిషేక్‌ మరోసారి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్‌ 4-1తో బలమైన స్థితిలోకి వెళ్లింది. అదే నిమిషంలో పాక్‌ తరఫున సఫ్యాన్‌ ఖాన్‌ గోల్‌ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 4-2తో ఆధిక్యంలో నిలిచింది.

హార్దిక్‌ గోల్‌తో పెరిగిన ఆధిక్యం

మూడో క్వార్టర్‌లో పాకిస్థాన్‌ తిరిగి పోరులోకి రావడానికి ప్రయత్నించింది. భారత్‌పై ఒత్తిడి పెంచినప్పటికీ కీలక సందర్భాల్లో టీమిండియా ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. 35వ నిమిషంలో భారత వైస్‌కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌కు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో భారత్‌ ఆధిక్యం 5-2కు పెరిగింది. ఈ గోల్‌తో మ్యాచ్‌పై టీమిండియా పట్టు మరింత బలపడింది. పాక్‌ ఆటగాళ్లు తిరిగి మ్యాచ్‌లోకి రావడానికి చేసిన ప్రయత్నాలను భారత డిఫెన్స్‌ సమర్థంగా నిలువరించింది.

చివరి క్వార్టర్‌లో ఉత్కంఠ

చివరి క్వార్టర్‌లో పాకిస్థాన్‌ దూకుడు పెంచింది. వరుస అటాక్స్‌తో భారతపై ఒత్తిడి తీసుకొచ్చింది. 46వ నిమిషంలో హన్నన్‌ షాహిద్‌ మరో గోల్‌ చేయడంతో స్కోరు 5-3కు చేరింది. దీంతో మ్యాచ్‌ చివరి నిమిషాల వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే భారత ఆటగాళ్లు ఎలాంటి తొందరపాటుకు గురికాకుండా ఆడారు. ప్రత్యర్థికి మరిన్ని అవకాశాలు ఇవ్వకుండా రక్షణను పటిష్ఠం చేశారు. చివరి వరకు 5-3 ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది.

త‌దుప‌రి రౌండ్‌కు భార‌త్

ఈ విజయంతో భారత్‌ పూల్‌-Dలో రెండో స్థానాన్ని సాధించి ప్రపంచకప్‌లో తదుపరి రౌండ్‌కు చేరుకుంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత పాకిస్థాన్‌పై సాధించిన ఈ గెలుపు టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అభిషేక్‌ చెరో రెండు గోల్స్‌ సాధించగా.. హార్దిక్‌ సింగ్‌ ఒక గోల్‌ చేశాడు. పాకిస్థాన్‌ తరఫున హన్నన్‌ షాహిద్‌ రెండు, సఫ్యాన్‌ ఖాన్‌ ఒక గోల్‌ చేశారు. స్కోరు పరంగా పోటీ కనిపించినప్పటికీ కీలక సందర్భాల్లో భారత్‌ పైచేయి సాధించింది. దాయాది దేశంపై ఘన విజయం నమోదు చేసిన టీమిండియా ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకు వేసింది.