FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రపంచంలో ప్రతిభతో పాటు పట్టుదల కూడా ఎంత ముఖ్యమో నిరూపించిన యువ ఆటగాడు నెస్టోరీ ఇరాన్‌కుందా. శరణార్థి శిబిరంలో జన్మించిన ఓ చిన్నారి, ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడలో దేశానికి గర్వకారణంగా నిలవడం సాధారణ విషయం కాదు. 

శరణార్థి శిబిరంలో మొదలైన జీవితం

నెస్టోరీ ఇరాంకుండా 2006లో టాంజానియాలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు బురుండి అంతర్యుద్ధం కారణంగా తమ స్వదేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. యుద్ధం, హింస, అనిశ్చితి మధ్య వారు శరణార్థులుగా జీవితం ప్రారంభించారు. నెస్టోరీ ఇరాన్‌కుందా పుట్టిన సమయంలో కుటుంబ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి. రోజువారీ జీవితం కూడా ఒక సవాల్‌గా మారిన పరిస్థితుల్లో అతను బాల్యాన్ని ప్రారంభించాడు. అయితే అతని తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆస్ట్రేలియాకు వలస.. జీవితంలో కీలక మలుపు

నెస్టోరీ ఇరాన్‌కుందా మూడు నెలల వయసులో ఉన్నప్పుడు అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ అడిలైడ్ నగరంలో స్థిరపడింది. అదే వారి జీవితంలో పెద్ద మార్పుకు కారణమైంది. ఆస్ట్రేలియాలో విద్యతో పాటు క్రీడలకు కూడా మంచి అవకాశాలు లభించాయి. అడిలైడ్ ఉత్తర ప్రాంతంలో పెరిగిన ఇరాన్‌కుందా చిన్న వయసులోనే ఫుట్‌బాల్‌పై ఆసక్తి చూపించాడు. స్థానిక స్థాయిలో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతని వేగం, నైపుణ్యం కోచ్‌ల దృష్టిని ఆకర్షించాయి.

అడిలైడ్ నుంచి యూరప్ వరకు ఎదిగిన ఫుట్‌బాల్ స్టార్

నెస్టోరీ ఇరాన్‌కుందా అడిలైడ్ యునైటెడ్ యువజట్టు ద్వారా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతని ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో యూరప్ క్లబ్‌ల దృష్టి అతనిపై పడింది. అతని ప్రతిభను గుర్తించిన బేయర్న్ మ్యూనిక్ క్లబ్ 2024లో అతడిని జట్టులోకి తీసుకుంది. ఇది ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ చరిత్రలోనే పెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే బేయర్న్ ప్రధాన జట్టులో అవకాశాలు తక్కువగా రావడంతో అతను స్విట్జర్లాండ్‌లోని గ్రాస్‌హాపర్ క్లబ్‌కు, తర్వాత ఇంగ్లండ్‌లోని వాట్‌ఫర్డ్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. అదే అతని కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది.

వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన యువ ఆటగాడు

ఫిఫా వరల్డ్‌కప్‌లో టర్కియేతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్‌కుందా ఆస్ట్రేలియా తరఫున తొలి గోల్ సాధించాడు. మ్యాచ్ 27వ నిమిషంలో వచ్చిన ఆ గోల్ కేవలం జట్టుకు ఆధిక్యం మాత్రమే ఇవ్వలేదు, చరిత్రను కూడా సృష్టించింది.

20 ఏళ్ల 148 రోజుల వయసులో వరల్డ్‌కప్‌లో గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా ఆటగాడిగా అతను నిలిచాడు. ఆ తర్వాత మరో గోల్ రావడంతో ఆస్ట్రేలియా 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయం జట్టుకు కీలకమైన మూడు పాయింట్లు అందించగా, ఇరాన్‌కుందా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.

లక్షల మందికి స్ఫూర్తిగా మారిన కథ

ఇరాన్‌కుందా ప్రయాణం కేవలం ఫుట్‌బాల్ కథ కాదు. కష్టాలు, నిరాశలు, వలస జీవితం, అవకాశాల కోసం చేసిన పోరాటం గురించి చెప్పే నిజ జీవిత గాథ. శరణార్థి శిబిరంలో జన్మించిన ఓ బాలుడు ప్రపంచ కప్ లో దేశానికి హీరోగా మారడం ఎంతో మందికి ఆశను కలిగిస్తోంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ప్రతిభతో పాటు కష్టపడే తత్వం ఉంటే విజయాన్ని అందుకోవచ్చని అతని జీవితం చెబుతోంది. ఈ రోజు ఇరాన్‌కుందా ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌కు కొత్త ఆశగా నిలవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా శరణార్థి కుటుంబాలకు స్ఫూర్తి చిహ్నంగా మారాడు.