ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్‌లో వరల్డ్ నెం.1 బ్యాడ్మింటన్ స్టార్, డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‌సన్ చేతుల్లో 10-21, 15- 21 తేడాతో పోరాడి ఓడిన లక్ష్యసేన్... అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్...
20 ఏళ్ల భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్... అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయాడు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన లక్ష్యసేన్... టైటిల్ పోరులో వరల్డ్ నెం.1 బ్యాడ్మింటన్ స్టార్, డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‌సన్ చేతుల్లో 10-21, 15- 21 తేడాతో పోరాడి ఓడాడు.
లక్ష్యసేన్ కంటే ముందు ప్రకాశ్ నాథ్, ప్రకాశ్ పదుకోనే, పుల్లెల గోపిచంద్ వంటి లెజెండరీ భారత బ్యాడ్మింటన్ స్టార్లు, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్‌కి చేరారు. మహిళల విభాగంలో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాగ్ ఈ ఫీట్ సాధించింది. మొత్తంగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్ చేరిన ఐదో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచిన లక్ష్యసేన్, 21 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 3 ర్యాంకర్ అంటెన్సన్‌ని, సెమీ ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ 7 ర్యాంకర్, మలేషియా ప్లేయర్ లీ జి జియోను చిత్తు చేసిన లక్ష్యసేన్, ఫైనల్‌లో డెన్మార్క్ ప్లేయర్ దూకుడు ముందు నిలవలేకపోయాడు...
53 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్, తొలి గేమ్ నుంచి ప్రత్యర్థికి ఆధిక్యాన్ని అందించాడు. 0-6 తేడాతో లక్ష్యసేన్‌పై తిరుగులేని లీడ్ సాధించిన విక్టర్, ఆ తర్వాత ఆ జోరును కొనసాగిస్తూ వరుస సెట్లను ఫైనల్‌ను ముగించాడు...
తొలి సెట్‌లో 21-10 తేడాతో తేలిపోయిన లక్ష్యసేన్, రెండో సెట్‌ను దూకుడుగా ఆరంభించాడు. విక్టర్, లక్ష్యసేన్ హోరాహోరీగా తలబడుతూ పాయింట్లు సాధించడంతో ఒకానొక దశలో 4-4 తేడాతో సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత లక్ష్యసేన్‌పై స్మాష్ షాట్లతో విరుచుకుపడిన విక్టర్, వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 8-4 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు...
ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుండా 21-15 తేడాతో ఫైనల్‌ని రెండు సెట్లలోనే కైవసం చేసుకున్నాడు విక్టర్ అక్సెల్‌సన్.
ఈ టోర్నీకి ముందు జరిగిన జర్మన ఓపెన్ సెమీ ఫైనల్‌లో వరల్డ్ నెం.1 విక్టర్ అక్సెల్‌సన్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు లక్ష్యసేన్. 21-13, 12- 21, 22- 20 తేడాతో వరల్డ్ నెం.1 విక్టర్‌ను ఖంగుతినిపించి, ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ఇది జరిగిన వారం రోజులకే భారత షెట్లర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు తన అనుభవాన్ని చక్కగా వాడుకున్నాడు విక్టర్...
20 ఏళ్ల వయసులో ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం లక్ష్యసేన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
‘లక్ష్యసేన్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు అద్భుతమైన పోరాటం, పట్టుదల చూపించావు. ఓ చక్కని ఫైట్ చేశావు. నీకు భవిష్యత్తు టోర్నీల్లో సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. నువ్వు కొత్త విజయపు శిఖరాలను అధిరోహిస్తావని గట్టిగా నమ్ముతున్నా...’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ...
అలాగే భారత మాజీ క్రికెటర్, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ కూడా లక్ష్యసేన్‌కి అభినందనలు తెలిపారు. ‘జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవు. ఒకటి నువ్వు గెలుస్తావు, లేదా నేర్చుకుంటావు... లక్ష్యసేన్, ఈ మ్యాచ్ ద్వారా నువ్వు ఎంతో విలువైన పాఠాలను నేర్చుకుని ఉంటావని అనుకుంటున్నా.. భవిష్యత్ టోర్నీల్లో నీకు విజయం దక్కాలని కోరుకుంటున్నా... ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు సచిన్ టెండూల్కర్..
