Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020 నిర్వహణ: ముందున్న సవాళ్లు ఇవే...!

దేశంలో అన్ని రంగాలను మెల్లిమెల్లిగా తెరుస్తున్న ప్రభుత్వం ఇంకొక నెలరోజుల్లో అయినా ఆటలకు పచ్చ జెండా ఊపడం తథ్యంగా కనబడుతోంది. ఈ తరుణంలో బీసీసీఐ భారతదేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఎందుకు వెనకాడుతోంది అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. 

The Challenges Ahead For IPL2020
Author
Hyderabad, First Published Jun 6, 2020, 7:23 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నప్పటికీ.... ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కి ఎటువంటి ఢోకా లేదు అని అన్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో వాయిదా వేసి పరిస్థితి సమీక్షిస్తామని అన్నారు. కానీ ఒక్కసారిగా అన్ లాక్ మొదలవ్వగానే బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు ఏకంగా  విదేశీ పాటను అందుకుంటున్నాయి. 

దేశంలో అన్ని రంగాలను మెల్లిమెల్లిగా తెరుస్తున్న ప్రభుత్వం ఇంకొక నెలరోజుల్లో అయినా ఆటలకు పచ్చ జెండా ఊపడం తథ్యంగా కనబడుతోంది. ఈ తరుణంలో బీసీసీఐ భారతదేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఎందుకు వెనకాడుతోంది అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. 

క్రికెట్‌ అభిమానులు ప్రతి ఏటా జరుపుకునే సంబురం ఐపీఎల్‌. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్‌ నుంచి బయటపడుతున్న సమయంలో క్రీడాభిమానుల చూపు ఇప్పుడు ఐపీఎల్‌పై మళ్లుతోంది. స్టేడియంలోకి ప్రవేశం లభించకపోయినా.. టెలివిజన్‌ తెరపై క్రికెట్‌ విన్యాసాలు చూసి వినోదించవచ్చని అభిమబానులు ఎదురుచూస్తున్నారు. 

అభిమానులు, ఆర్థిక భాగస్వామ్యులను సంతృప్తిపరిచేందుకు బీసీసీఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) సైతం ఐపీఎల్‌ 2020 నిర్వహణ కార్యాచరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అక్టోబర్‌త 18-నవంబర్‌ 15న ఆస్ట్రేలియాలో జరగాల్సిన 2020 టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడిన వెంటనే.. అదే షెడ్యూల్‌లో ఐపీఎల్‌ నిర్వహణ ప్రకటన లాంఛనమే అని అభిమానులు భావిస్తున్నారు. 

పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచిచూసి, భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని చెప్పిన బీసీసీఐ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రణాళికలో పెను మార్పులు చేసింది. దుబాయిలో ఐపీఎల్‌13 సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారత్‌లో నమోదైన కరోనా కేసులు ఐపీఎల్‌ ఆతిథ్య నగరాల్లోనే 45 శాతం ఉండటం, మరణాల్లో 47 శాతం ఇక్కడే నమోదు కావటం బీసీసీఐని ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రధాన నగరాలన్నీ కోవిడ్ హాట్ స్పాట్లే... 

కరోనా వైరస్‌కు ఐపీఎల్‌ ఆతిథ్య నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. కోవిడ్‌-19 ఈ నగరాల్లోనే ఎక్కువగా విలయతాండవం చేస్తోంది. నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేత జట్టు ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ ముంబయిలో కేసులు 42216కు చేరుకున్నాయి. ముంబయి నగరంలో కోవిడ్‌-19 మృతుల సంఖ్య 1300 దాటిపోయింది. 

దేశ రాజధాని న్యూఢిల్లీ కోవిడ్‌-19 దెబ్బకు విలవిల్లాడుతుంది. ముంబయి తర్వాత అత్యంత ప్రభావితమైన నగరం ఢిల్లీయే. మూడుసార్లు ఐపీఎల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆతిథ్య నగరం చెన్నైలో కూడా కేసుల సంఖ్య 17 వేలకు చేరువగా ఉంది. మరణాలు సైతం 600కు చేరువగా ఉన్నాయి. 

కరోనా వైరస్‌కు తోడు అంపన్‌ తుఫాను ప్రళయంతో కోల్‌కత నగరం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కోల్‌కతలో కరోనా కేసులు ఇప్పటికే 2 వేల మార్క్‌ దాటింది. రాజస్థాన్‌లో కోవిడ్‌-19కు దారుణంగా దెబ్బతిన్న నగరం జైపూర్‌. ఇక్కడ కూడా కేసులు 2000 దాటాయి. 

ఐపీఎల్‌ టైటిల్‌ను రెండుసార్లు దక్కించుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆతిథ్య నగరం‌ హైదరాబాద్ సైతం కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతోంది. ఇక్కడ కూడా కేసులు 2 వేలకు చేరువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు భాగ్యనగరంలోనే నమోదయ్యాయి. 

మరో మెట్రో నగరం, కింగ్‌ కోహ్లి అడ్డా బెంగళూర్‌ కోవిడ్‌-19 బారిన పడకుండా జాగ్రత్త వహించినట్టు కనిపిస్తోంది. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే మహమ్మారిని ఎదుర్కొవటంలో బెంగళూర్‌ ముందంజలో ఉంది. చంఢగీడ్‌లో సైతం కోవిడ్‌-19 కేసులు తక్కువగా ఉన్నాయి. బెంగళూర్‌, చంఢగీడ్‌ మినహా ఇతర ఆరు ఆతిథ్య నగరాల్లో కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది.

మరో సవాలు, పిచ్ ల తయారీ.... 

ఆతిథ్య నగరాల్లో కరోనా వైరస్‌ తీవ్రత సహా మరో అంశం సైతం ఐపీఎల్‌ విదేశాలకు వెళ్లేందుకు దోహదం చేస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ వాయిదా వేసినా, ఈ వర్షాకాలంలో భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యపడదని క్యూరేటర్లు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. 

ఏడాది పొడవునా క్రికెట్‌ కొనసాగే పిచ్‌లకు వానా కాలం ముంగిట కాసింత విశ్రాంతి లభిస్తుంది. గత పదేండ్లుగా వానాకాలం ముందర నూతన పిచ్‌లు తయారు చేసేందుకు క్యూరేటర్లకు బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ప్రతి ఏటా వర్షాల సీజన్‌కు ముందు క్యూరేటర్లు నూతన పిచ్‌లను రూపొందిస్తున్నారు. 

సహజంగా సిక్సర్లు, ఫోర్లతో సందడి చేసే ఐపీఎల్‌ ఇప్పుడున్న పిచ్‌ల పైన్నే జరిగితే.. పిచ్‌లు పూర్తిగా మండికోడిగా తయారువుతున్నాయి. ఐపీఎల్‌ మ్యాచులు ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏకపక్షంగా సాగే ప్రమాదం ఉంటుంది. 

లాక్‌డౌన్‌ సమయంలో కొత్త పిచ్‌లు రూపొందించేందుకు అనుమతులు లేవు. వర్షాలు పడుతున్న సమయంలో ఈ పని చేసేందుకు వీలు పడదు. నూతన పిచ్‌లు లేకుండా ఓ ఏడాది అలాగే సాగితే.. పిచ్‌లు నాణ్యత కోల్పోతాయి.

ఏడాదిగా పిచ్‌పై విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున, పగళ్లు, గుంతలు వస్తాయి. సీజన్‌ ముగిసే సరికి పిచ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వచ్చే సీజన్‌కు పిచ్‌ను కొత్తగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. లేదంటే పిచ్‌లు నెమ్మదిగా స్పందిస్తాయి. ఆ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లపై ఆసక్తి సన్నగిల్లే ఆస్కారం ఉంది. 

పిచ్‌ కు జీవం పోసే ప్రక్రియకు పది రోజుల సమయం పడుతుందని బీసీసీఐ మాజీ చీఫ్‌ క్యూరేటన్‌ దల్జీత్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు పిచ్‌ల సమస్య సైతం ఐపీఎల్‌ విదేశాలకు తరలేందుకు కారణం అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios