తమిళనాట రాజకీయాలు ఎన్నికలకు ఒక సంవత్సరం ముందుగానే మాంచి కాకమీదున్నాయి. ఇద్దరు తమిళ సూపర్ స్టార్స్ కలిసి తమిళనాడు రాజకీయాల ముఖచిత్రాన్ని మారుస్తామంటున్నారు. కమల్ హాసన్ ఇప్పటికే తన పార్టీ మక్కల్ నిధి మయ్యం ను ప్రారంభించాడు.  గత పార్లమెంటు ఎన్నికల్లో, ఆ ఎన్నికలతోపాటు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగారు. 

ఎన్నికల ఫలితాలను చూసేసరికి మాత్రం కమల్ ఖచ్చితంగా షాక్ కు గురయ్యే ఉంటాడు. ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయాడు. అంతే కాకుండా కమల్ టిక్కెట్లిచ్చినా అభ్యర్థుల్లో ఒక ముగ్గురు బీజేపీలో చేరారు కూడా. ఈ పరిణామాలన్నిటిని అర్థం చేసుకున్న కమల్ హాసన్ తన ఒక్కడి బలం మాత్రమే సరిపోదనుకున్నాడేమో రజనీకాంత్ ని కూడా కలుపుకుపోవాలని అనుకుంటున్నాడు. 

Also read: కమల్ హాసన్ ఆఫర్: సూపర్ స్టార్ రజినీకాంత్ రెడీ

రజనీకాంత్ విషయానికి వస్తే, రాజకీయాలపట్ల ఆసక్తి ఉందని ప్రకటించిన తరువాత పార్టీ పెడుతున్నట్టు చెప్పాడు. కానీ ఇంతవరకు పార్టీ పేరును కూడా ప్రకటించలేదు, దాని ఊసే లేదు. ఒకింత కమల్ హాసన్ ప్రయోగం ఏమవుతుందో చూద్దామని వేచి చూస్తూ ఉండొచ్చు. కమల్ హాసన్ ప్రయోగం విఫలం చెందిందని అర్థమయిపోయిన తరువాత ఇద్దరు సూపర్ స్టార్లు ఇప్పుడు ఒక్కతాటిపైకి రావాలని సంకల్పించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. 

తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితి... 

జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. జయలలిత తరువాత ఎవరు అనేదానిపై నెలకొన్న సందిగ్ధత వాతావరణం ఆ పార్టీలో అస్థిరతకు దారి తీసింది. ముఖ్యమంత్రి అవుతానన్న తరుణంలో శశికళ జైలుకెళ్లింది. ఆ తరువాత ఆ పార్టీలో అధికార పీఠం కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈపీఎస్, ఓపిఎస్ ల మధ్య పోరు తీవ్రతరమైన నేపథ్యంలో టీటీవి దినకరన్ పార్టీని చీల్చి తన సొంతగా అమ్మడీఎంకే పార్టీని ఏర్పాటు చేసాడు. 

ఇలా పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్ల అన్నా డీఎంకే ప్రభుత్వం ఒక పది రోజులైనా మనగలుగుతుందా అని అంతా అనుకున్నారు. కాకపోతే ఆశ్చర్యం కలిగిస్తూ, ఇప్పటివరకు ప్రభుత్వం నిరాటంకంగా నడుస్తుంది. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మాత్రం చెప్పడం కష్టం. 

మరోవైపు కరుణానిధి తన మరణానికి ముందే తన వారసుడిని ప్రకటించడంతో, స్టాలిన్ అన్ని తానై పార్టీని నడిపిస్తున్నాడు. ఇప్పటికే డీఎంకే పార్టీ ముఖ్జ్యమంత్రి అభ్యర్థిగా తమిళనాట సుపరిచితుడయ్యాడు. పార్టీలో బలమైన నేతగా, పార్టీనంతా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి నడిపిస్తున్నాడు. 

అన్నాడీఎంకే పార్టీలోని అంతర్గత విభేదాలను ఉపయోగించుకొని, పాలనా పరంగా ఏర్పడ్డ అనిశ్చితి వల్ల లాభపడి అధికారంలోకి రావాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నాడు. మరోపక్క అమ్మడీఎంకే  అధినేత టీటీవి దినకరన్ ఏమో సాధ్యమైనంత మంది అన్నా డీఎంకే నేతలను తన పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
 

కమల్, రజనీ ఎం చేయబోతున్నారు...?

తమిళనాడు లోని రాజకీయ పరిస్థితిని ఇరువురు సూపర్ స్టార్లు బాగానే అంచనా వేసినట్టున్నారు. ఒక్కరి బలమైతే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం కష్టమైతుందని భావించి వారిరువురు ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు. 

వారి ఆలోచనా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వారి పొలిటికల్ స్పీచులను వింటే మనకు అర్థమయిపోతుంది. వారు పదే పదే చెబుతున్న మాటలేంటంటే... రాష్ట్రంలో జయలలిత తరహా పాలన గని, లేదా కరుణానిధి తరహా పాలన గాని, లేదా ఎంజీఆర్ తరహా అభివృద్ధి కనపడడం లేదని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉందని వారంటున్నారు. 

దానితో పాటు రాష్ట్రం అభువృద్ధి పథంలో నడవడం లేదని, పాలన పడకేసిందని వారిద్దరూ పదే పదే చెబుతున్నారు. అంతే కాకుండా తమిళనాడు అభివృద్ధి కొరకు, తమిళనాడు ప్రజల హితం కొరకు అనే నినాదాలను ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 

వీరు తమ స్పీచులలో గత ముఖ్యమంత్రులైన జయలలితను, కరుణానిధిని, ఎంజీఆర్ ను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. లోతుగా పరిశీలిస్తే వీరంతా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. వీరిలా ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే, మల్లి సినిమాల్లోంచి వచ్చిన తమకే సాధ్యమవుతుందని చెప్పడంతోపాటు, ప్రజల్లో ఉన్న మాస్ పాపులారిటీని ఓట్ల రూపంలో మార్చడం దీని వెనకున్న స్ట్రాటజీ. 

Also read: వాళ్ళ ట్రాప్‌లో నేను చిక్కుకోను.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

దానితోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అని చెప్పడం వల్ల, ప్రజలకు తాము ఒక ప్రత్యామ్నాయంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీలు పాలన చేస్తున్నా, గత పాలకుల స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, ఇప్పుడు మళ్లీ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే, తమవల్లే అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

కమల్, రజినీలు కలిస్తే తమిళ రాజకీయాలను శాసించొచ్చా...?

కమల్ హాసన్, రజని కాంత్ లకు తమిళ రాజకీయాలను శాసించడం అంత తేలికైన పని మాత్రం కాదు. తమిళనాట సినిమాకి రాజకీయానికి చాలా దగ్గరి స్సంబంధముంది. ఆ నాయకులంతా తమ మాస్ ఇమేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చుకోగలిగారు. రాష్ట్ర రాజకీయాలను శాసించారు. గతంలో ప్రజల్లో అటువంటి అభిమానం ఉండేది, వారికి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండేవి కావు. 

కానీ ప్రస్తుతం ఉన్నదీ కొత్త తరం, ఉడుకు రక్తం ఉరకలేస్తుంది. సినిమా స్టార్లకు బయట, సోషల్ మీడియాలో ఉన్న ఇమేజ్ ఓట్లను రాల్చలేదు అని కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ ప్రయోగాలు మనకు ఋజువు చేసాయి. కమల్ హాసన్ మీటింగులకు కూడా పవన్ మీటింగులకు వచ్చినట్టే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చేవారు. కానీ ఎన్నికలవేళ మాత్రం వారు తమ ఓట్లను వేరే వారికి వేశారనే విషయాన్నీ ఎన్నికల ఫలితాలు బల్ల గుద్ది చెబుతున్నాయి. కాబట్టి కమల్, రజనీలు తమ ఇమేజ్ ను ఎంతమేర ఓట్ల రూపంలోకి మార్చుకోగలుగుతారో వేచి చూడాలి. 

అంతే కాకుండా తమిళనాడు రాజకీయాలు ప్రాంతాలవారీగా డిఫరెంట్ గా ఉంటాయి. ఉదాహరణకు మదురై ప్రాంతాన్ని గనుక తీసుకుంటే, అక్కడున్న మాస్ ఓటర్ బేస్ ను కమల్, రజనీలు ఖచ్చితంగా కొల్లగొట్టాల్సి ఉంటుంది. అందరికి గనుక గుర్తుంది ఉంటే, కమల్ హాసన్ తన పార్టీని మధురైలోనే ప్రారంభించాడు. అతనికి సైతం ఇక్కడి ఓటర్ల ప్రాముఖ్యత తెలిసినట్టే మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

మదురై ని తన కంచుకోటగా చేసుకొని డీఎంకే బహిష్కృత నేత అళగిరి అక్కడ చక్రం తిప్పుతున్నారు. గతంలో కమల్ హాసన్ చేసిన కామెంట్ కి మద్దతు పలికిన అళగిరి, ఇప్పుడు రజనీకాంత్ చేసిన "రాష్ట్రంలో నాయకత్వ లేమి కనపడుతుంది" అనే కామెంటుకు సైతం వత్తాసు పలికాడు. ఈ స్పీయేడు చూడబోతుంటే అళగిరి వీరిరువురి మద్దతిచ్చేలానే ఉన్నాడు. కమల్, రజనీ ఎంత చాకచక్యంగా ఇటువంటి చిన్నా, చితకా పార్టీలను కలుపుకుపోతారో, వారి విజయావకాశాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. 

రాష్ట్రంలోని అన్నడీఎంకే సర్కారు పటిష్టంగా లేదనే విషయం ఎంత వాస్తవమో, ప్రజలకు మాత్రం వాస్తవికంగా అందాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయనేది అంతే నిజం. ఈపీఎస్, ఓపిఎస్ ల ప్రభుత్వం పఠిష్టంగా లేకపోవచ్చు కానీ, వారి పాలన మాత్రం మరీ కొట్టిపారేసేంత చందంగా మాత్రం లేదు. కాకపోతే తమిళనాడు రాజకీయ చరిత్రకు భిన్నంగా జయలలిత వరుసగా రెండుసార్లు అధికార పీఠాన్ని దక్కించుకుంది. పది సంవత్సరాలు అవ్వడం వల్ల ఎమన్నా, ప్రజా వ్యతిరేకత మొదలైతే దాన్ని వీరిరువురు ఎంత మేర అందిపుచ్చుకోగలరనేది వేచి చూడాల్సిన మరో అంశం. 

ఇక ప్రత్యామ్నాయం విషయానికి వస్తే తమిళనాడు ఓటర్ల ముందు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెసులు ఉన్నా, అక్కడ వారి ప్రభావం అత్యల్పం. ఇరు జాతీయపార్టీలు కూడా ఏదో ఒక ప్రాంతీయ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలిసిందే. 

రాష్ట్రంలో గనుక తీసుకుంటే, స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఉండగా, అన్నడీఎంకే పార్టీ కూడా మరో ఛాయిస్ గాప్రజలముందు ఉంది. అన్నాడీఎంకే నుండి చీలిపోయి టీటీవి దినకరన్ ఏర్పాటు చేసిన అమ్మడీఎంకే కూడా ఎన్నికల్లో ప్రజలకు మరో ఆప్షన్. వీరితోనిపాటు, ఇప్పుడు కొత్తగా కమల్, రజినీల కూటమి. 

అంతే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో కులం అత్యధిక ప్రభావాన్ని చూపెడుతుంది. కొన్ని తరాలుగా అయితే డీఎంకే పార్టీకో లేదా అన్నాడీఎంకే పార్టీకో వారు తమ అమూల్యమైన ఓటును వేస్తున్నారు. ఇలాంటి కుల రాజకీయాలకు పెద్ద పీటవేసే తమిళనాడు రాజకీయాల్లో, తాను ఏ కులానికి చెందిన వాడను కాను అని ప్రకటించుకునే కమల్ హాసన్, తమిళుడే కానటువంటి రజినీకాంత్ లు ఎంతమేర సఫలీకృతులవుతారో కూడా వేచి చూడాల్సిన మరో అంశం.   

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం కూడా లేకపోలేదు. రాజకీయంగా డీఎంకే ఇప్పుడు ముందంజలో ఉంది. కాబట్టి కమల్, రజినీల ప్రయత్నాలను వారు అధికార దాహం కోసం అంటూ, తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే వారిపైన ఈ దాడి ప్రారంభమయ్యింది కూడా. ఈ నేపథ్యంలో వారు ఈ దాడిని తట్టుకొని ఎలా నిలబడతారో చూడాలి. 

కాకపోతే, తమిళనాడులో నూతన తరం శకం ఆరంభమయ్యింది. నూతన ఓటర్లు ఇప్పుడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించడానికి సిద్ధమయ్యారు. కొత్త నాయకత్వం కోసం మాత్రం అక్కడ ఖఛ్చితంగా ఆస్కారం ఉంది.