చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అవసరమైతే తమిళనాడు ప్రజల కోసం మక్కల్ నీది మయమ్ (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు, సినీ నటుడు కమల్ హాసన్ తో కలిసి పనిచేస్తానని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. పరిస్థితి కలిసి వస్తే తాను కమల్ తో చేతులు కలుపుతానని, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. 

కమల్ హాసన్ ఇచ్చిన ఆఫర్ పై గోవాకు బయలుదేరే ముందు రజినీకాంత్ స్పందించారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రజినీకాంత్ తో కలిసి ప్రయాణం చేయాలనే తన ఆకాంక్షను కమల్ హాసన్ మంగళవారం వెలిబుచ్చారు. విమానాశ్రయంలో ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

రజనీకాంత్ తో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రతినిధులు అడిగితే తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తలైవాతో కలిసి పనిచేయడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని కమల్ హాసన్ చెప్పారు. 

వివిధ సామాజిక విషయాలపై కమల్, రజినీ విభిన్నాభిప్రాయాలతో ఉన్నారు. అయినప్పటికీ రజినీకాంత్ తో పనిచేయడానికి తాను సిద్ధమేనని కమల్ హాసన్ చెప్పారు. రజినీకాంత్ కాషాయ రాజకీయాలు కలిసి పనిచేయడానికి ఆటంకంగా ఉన్నాయని ఒక సందర్భంలో కమల్ హాసన్ అన్నారు. తమిళ కవి తిరువల్లువార్ ను చేసినట్లుగానే తనపై కాషాయ రంగు పులుముతున్నారని రజినీకాంత్ ఇటీవల అన్నారు.