ఢిల్లీ చూపు ఆగ్నేయాసియాకు మారితే... ఏపీ ప్రాధాన్యత పెరుగుతుందా?
‘మీటింగ్ జగన్ – మీటింగ్ జపాన్’
ప్రాస కవిత్యం కాదిది... 6 అక్టోబర్ 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి డిల్లీలో మోడీతో వుంటే, అదే రోజు మన విదేశాంగ శాఖామంత్రి డా. ఎస్. జై శంకర్ జపాన్ లో ఈస్ట్ ఆసియా సదస్సులో వున్నారు!
- జాన్‌సన్ చోరగుడి
బంగళా ఖాతంలో సునామీ తర్వాత, నష్ట తీవ్రతను చూసి ఎప్పటిలా వితరణతో ముందుకొచ్చిన విదేశీ సహాయాన్ని భారత్ మృదువుగా తిరస్కరించింది. మన ప్రభుత్వ వైఖిరిమీద విదేశీ మీడియా చేసిన వ్యాఖ్యలను అప్పట్లో విజ్ఞతగల కొందరు తప్పుపట్టారు. ఫ్రెంచ్ రక్షణ మంత్రి మైఖేల్ ఎలియట్ మారియో “ఇండియా గురించి సరైన అవగాహన లేనివారు చేస్తున్న వ్యాఖ్యలు అవి. ఆర్ధికంగా, సాంకేతికంగా, ఇండియా ఎంత పురోగతి సాధించిందో తెలిసివుంటే వారు అటువంటి వ్యాఖ్యలు చేయరు” అన్నారాయన. మైఖేల్ జోక్యంతో విదేశీ మీడియా అప్పట్లో గొంతు సవరించుకుని, ఆ తర్వాత ఇండియాను ‘నెక్స్ట్ ఏసియన్ జెయింట్’ అంది! చైనా తర్వాత... అని వాళ్ళ అభిప్రాయం కావొచ్చు.
అప్పట్లో సునామీ వచ్చిన ఐదు రోజుల తర్వాత 31 డిసెంబర్ 2004 సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆనాటి మన ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ విజయవాడ విమానాశ్రయం చేరుకున్నారు. అప్పటికే ఆయన ఏ,పి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సునామీ నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి వచ్చారు. ప్రధాని రాక ఏర్పాట్లు ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్వయంగా చూసుకున్నారు. ఆ ఏడాదిలో చివరి రోజు చివరి పని గంటల వేళ ఆయన డిల్లీ తిరిగి వెళుతూ పాత్రికేయులతో తన మాటల్లో ఎంతో పొదుపరితనంతో - “ఐ ఎష్యూర్ యాడిక్వేట్ అండ్ ఎఫెక్టివ్ రిలీఫ్ మెషర్స్...” అని హామీ ఇచ్చారు.
ఇది జరిగిన పదేళ్లకు నెల్లూరు తీరంలోని వాకాడు వద్ద రూ.250 కోట్లతో నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (నియోట్) మే 2015 న మోడీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. అప్పటికి 21 ఏళ్లుగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మన నెల్లూరు తీరానికి రావడానికి ప్రధాన కారణం సముద్రగర్భ పరిశోధనలకు ఈ ప్రాంతంలో ఉన్న నైసర్గిక అనుకూలత. దీంతో ఇండియాకు కూడా ‘ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టం’ వచ్చినట్టు అయింది. అంతకు ముందు ఈ ‘సర్వీస్’ కోసం మనం ఆస్ట్రేలియా మీద ఆధారపడేవాళ్ళం. శాస్త్రవేత్తల దృష్టిలో ఇది కేవలం మన సముద్ర తీరాన ఉన్న ‘ల్యాబ్ విత్ సీ ఫ్రంట్ ఫెసిలిటీ’ అయితే అది మన నాయకుల వద్దకు వచ్చేసరికి అది - ఎక్కడా? మన రాష్ట్రమా.. పొరుగు రాష్ట్రమా..?
దాన్ని తప్పు అని కూడా అనలేముగానీ, తరుచూ మన దృష్టి ఇలాగే వుంటుంది. ‘విభజనా’ లేక ‘సమైఖ్యమా’ అనే ఊగిసలాటలో మనం ఉన్నప్పుడు, అప్పట్లో బందరు వద్ద స్థలం కూడా గుర్తించిన సెంట్రల్ మెరైన్ పోలీస్ ట్రయినింగ్ ఇన్స్టిట్యుట్ చివరికి గుజరాత్ వెళ్ళింది. కొన్నిసార్లు ఇవి ఇలాగే ఉంటాయి, బందరు పోర్టు బందరులో కాకుండా కృష్ణా - పశ్చమ గోదావరి సరిహద్దున గోగిలేరులో ఎలా కడతారు? అనే రాజకీయ స్పర్ధతో 2004-2014 మధ్య పదేళ్ళు విలువైన కాలం మనకు వృధా అయింది. ఈ వివాదానికి కారణం రెండూ వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలు!
అటువంటప్పుడు, ఏదైనా పెద్ద కుదుపు జరిగితే మొదట మనం కొంత కలవరపడ్డా... తర్వాత క్రమంగా సర్దుకుంటాం. తెలుగు ప్రజలకు 2 జూన్ 2014 న జరిగిన రాష్ట్ర విభజన అటువంటిదే. ఉన్నట్టుండి జీవితం ఇరుకు అయినప్పుడు, సర్దుకుంటూ ఉన్నదాన్ని పంచుకుంటూ విస్తరిచడం కాలం నేర్పుతుంది. అందుకు ఐదేళ్ళ అమరావతి అనుభవాన్ని దాటి, మన ‘మైండ్ మ్యాప్’ రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించాలి. ఆ క్రమంలో మన దృష్టి కనుక ‘పాన్ ఇండియన్’ అయితే, మన సమీప సరిహద్దు సముద్రజలాల్లో జరుగుతున్న కదలికలు మనకు మరింత స్పష్టంగా అర్ధం అవుతాయి.
దేశ సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా పరిస్థితులు దృష్ట్యా ఏప్రెల్ 2020 నుంచి అమలులోకి వచ్చేట్టుగా కేంద్ర హోం శాఖ ‘బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం’ పేరుతో సరిహద్దు రాష్ట్రాలకు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇలా ఉంది – “ఈ దేశం మా మంచి చెడులు పట్టించుకుంటున్నది, అనే నమ్మకం మనం ముందుగా అక్కడ జీవించే ప్రజల్లో కలిగించాలి. అటువంటి వొక భరోసాతో వాళ్ళు దేశ సరిహద్దుల్లో నివాసం ఉంటున్నప్పుడు, భద్రత, రక్షణ కలిగిన సరిహద్దులు దేశానికీ ఉంటాయి.
అందుకొరకు అంతర్జాతీయ సరిహద్దుల్లో మారుమూల, దుర్భేద్యమైన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలి. ఇకముందు మన వనరుల మోహరింపు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 974 కి.మీ. తీరం పొడవునా పంపిణీ కావాలి. ఆ దిశలో మనం చేయగలిగిన మానవ వనరుల అభివృద్ధి గౌరవప్రదమైన పరిష్కారం అవుతుంది. సెప్టెంబర్ 2020 లోనే నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ మెరైన్ బయాలజీ శాఖలో డిగ్రీ ఇన్ - ఆక్వా కల్చర్, దిప్లమో ఇన్ ఆక్వా, ల్యాబ్ టెక్నీషియన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఆక్వా సెక్టార్ వంటివి మొత్తం 47 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కొత్తగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం యు.జి.సి. ద్వారా అనుమతి ఇవ్వడం అటువంటిదే!
మారుతున్న ఆగ్నేయ ఆసియా కేంద్రిత ‘జియో – పొలిటికల్’ పరిస్థితుల్లో ఇక ముందు కేరళలోని కొచ్చిలో వున్న ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ మారిటైం లా’ వంటి సంస్థలు కూడా మనకు అవసరం అవుతాయి. ఎందుకంటే, పోర్టు నగరాలకు వాణిజ్య అవసరాల కోసం వచ్చి పోయే వేర్వేరు దేశాల వారితో తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు, వొక దేశం స్నేహసంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఈనాడు ప్రపంచీకరణ కారణంగా దేశాల విదేశాంగ విధానంలో తీరప్రాంత రాష్ట్రాలు పాత్ర కీలకం అవుతున్నది. నిజానికి ఇప్పటికే కొంత ఆలస్యం అయినప్పటికీ ఏ.పి. కొత్త రాష్ట్రం అయ్యాక ఏడవ ఏట ‘ఏ.పి. మారిటైం బోర్డు’ ఏర్పాటుచేసి ఈ దిశలో తొలి అడుగు వేసింది. అప్పట్లో ఈ పరిణామం గురించి ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక చేసిన వ్యాఖ్య ఇలా సాగింది...”Close to a decade after it was conceived, the Andhra Pradesh Maritime Board is now being put in place and would be operational from next month. Industry and Infrastructure Principal Secretary Rajat Bhargava issued a notification on Friday stating that the AP Maritime Board Act, 2018, would come into force from December 16, 2019”
భారత్ పశ్చమాన అరేబియా తీరంలో ఇన్నాళ్ళు ‘మెరైన్ ఎకానమీ’ ఫలాలను గరిష్టంగా అందిపుచ్చుకున్న కేరళ వ్యూహాన్ని విభజిత ఆంధ్రప్రదేశ్ అంది పుచ్చుకోవడం ఇప్పటి మొదటి అవసరం. అటువంటి ముందస్తు ప్రణాళికలతో కనుక మనం సిద్దంగా ఉంటే, మారిన తన విదేశాంగ ప్రాధాన్యతల్లో డిల్లీ దృష్టి అగ్నేయ ఆసియాకు (సౌత్ ఈస్ట్ ఏసియాకు) మారినప్పుడు, అక్కడ ‘మేజర్ ప్లేయర్ రోల్’ ఆంధ్రప్రదేశ్ ది అవుతుంది. కేరళ అనుభవం చూసినప్పుడు ఆ రాష్ట్రమంతా ఉత్తరానికి 570 కి.మీ. తీరంతో విస్తరించి ఉంటే, రాష్ట్ర రాజధాని త్రివేండ్రం పూర్తిగా దక్షణాన వొక పక్కన ఉంటూ, సముద్ర తీరానికి పశ్చమ కనుమలకు మధ్య పలు పట్టణాలను పోర్టు, వాణిజ్య, కేంద్రాలుగా అభివృద్ధి పరిచి ప్రజల జీవన ప్రమాణాల ‘రేటింగ్’ విషయంగా దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉండడం మనకు తెలిసిందే.
కేరళ ముందుచూపు ఎలా దానికి అక్కరకు వచ్చింది అనేది తెలుసుకునే రెండు సంఘటనలు ఇవి: చైనా లో ‘బ్రిక్స్’ కోసం ముందస్తు సమావేశం జరుగుతున్నప్పటికే - ‘ఓబి-ఓఆర్’ ప్రాజెక్ట్ నుంచి తొలి అంతర్జాతీయ క్రిమినల్ కేసు కేరళ తీరంలోని కొచ్చి పోర్టు పోలీస్ స్టేషన్లో నమోదు అయింది!
పనామా మెరైన్ కంపెనీకి చెందిన సరుకు రవాణా నౌక ‘అంబర్-ఎల్’ కెప్టెన్ (గ్రీకు దేశస్తుడు) అతని సిబ్బంది 28 మందిపై ఐ.పి.సి నాలుగు సెక్షన్ల క్రింద కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నౌక ఇజ్రాయేల్ నుంచి చైనా సరుకు రవాణా చేస్తూ, మార్గం మధ్యలో ఇంధనం నింపుకోవడానికి - కొచ్చి పోర్టు తీరానికి వస్తూ, 11 జూన్ 2017 మధ్యాహ్నం 2 గం లకు కర్మెల్ మాత పేరుతో వున్న మత్స్యకారుల బోటును ఢీకొట్టడంతో, ఇద్దరు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. బోటు ధ్వంసం కాగా మిగిలిన 11 మందిని సమీప బోట్లలో వున్నవారు ప్రాణాపాయం నుంచి రక్షించారు. కేసు కేరళ హైకోర్టుకు చేరింది.
ఇండియాకు తూర్పుతీరం కంటే పశ్చమ తీరం పోర్టులనుంచి సెంట్రల్ ఆసియా దేశాలకు సముద్ర వాణిజ్యం ముమ్మరంగా వుండటం మొదటినుంచీ వున్నదే. ’ఓబి-ఓఅర్’ వాణిజ్య ఒప్పందం తర్వాత మున్ముందు ఈ రద్దీ మరింతగా పెరుగుతుంది. అప్పుడు 974 కి.మీ సముద్ర తీరమున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ అలల ధాటి తప్పదు. ఎందుకంటే 2016 జూన్ లో కేంద్ర ప్రభుత్వం సముద్ర జలాలమీద నిఘా పరిధిని సవరించింది. కేరళ తీరంలో 2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ‘ఎనిరిక లెక్సి’ అనే నౌక నుంచి సిబ్బంది - సముద్ర దొంగలు అనే అనుమానంతో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మన మత్స్యకారులు చనిపోయారు. అందుకు ఇద్దరు ఇటలీ దేశస్తులను కేరళ ప్రభుత్వం రెండేళ్లపాటు జైల్లో వుంచింది.
అయితే ఆ కేసులో- 'తనకు అధికార పరిధి లేని సముద్ర భూభాగంలో జరిగిన సంఘఠనలో కేరళ ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకుందని’ సుప్రీం కోర్టు దానిని తప్పుపట్టింది. ఈ నేపధ్యంలో సముద్ర జలాల మీద రాష్ట్రాల న్యాయపరిధిని - 8 రాష్ట్రాలలో ఎంపికచేసిన 10 పోలీస్ స్టేషన్లలో- మునుపున్న 12 నాటికల్ మైళ్ళ నుంచి 200 నాటికల్ మైళ్ల పరిధికి పెంచారు. అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేనాటికి, ఇప్పుడు ఉన్నవి చాలవన్నట్టుగా తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తగా సముద్రజలాల మీద అదనపు శాంతిభద్రతల పరిధి వచ్చి చేరింది.
కేరళ తీరంలో ఇజ్రాయేల్ - చైనా కార్గో నౌక ‘అంబర్-ఎల్’ ప్రమాదం విషయమే తీసుకుంటే, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు- ఇజ్రాయేల్ తన రెండవ రాయబార కార్యాలయాన్ని చైనాలో మొదలెట్టేంత స్థాయిలో వున్నాయి. అంతేకాదు, ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా దేశాలన్నీ చైనా ‘ఓబి-ఓఆర్’ ప్రాజెక్టుపై ఆసక్తితో అప్పట్లో బీజింగ్ క్యూ కట్టాయి! రాబోయే రోజుల్లో ప్రపంచం ఎదుర్కోబోయే ఆర్ధిక కల్లోల జలాలనుంచి నుంచి తమ దేశాల ఆర్ధికవ్యస్థలు గట్టెక్కడానికి బీజింగ్ నిర్మిస్తున్న ‘ఓబి-ఓఆర్’ ప్రాజెక్టు – బైబిల్ ఓల్డ్ టెస్ట్ మెంట్ నాటి ‘నోవ్హా ఆర్క్’ వంటిదని క్రమంగా వారంతా విశ్వసిస్తున్నారు!
ఏ.పి.లో 2019 ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ దిశలో అది వేస్తున్న బలమైన అడుగులు రాజకీయ వైరుధ్యాలను అధిగమించి క్రమంగా స్థిరపడుతున్న వైనం ఇప్పటికే స్పష్టం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ 16 జూన్ 2020 న అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ.... “We see an opportunity to transform our state into a maritime trading hub for South East Asia” అనడం, విభజన జరిగిన ఏడేళ్ళ తర్వాత స్పష్టమవుతున్న రాష్ట్ర ప్రాధాన్యతలుగా చూడవలసి ఉంటుంది.
(ఫోటో: చైనా పెట్టుబడులతో శ్రీలంకలో నిర్మించిన హంబన్‌టోట ఇండస్ట్రీయల్ కారిడార్)
ఇటీవల కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ సందర్శనల అలికిడి నెమ్మదిగా పెరగడంగానీ, ‘కోవిడ్’ కాలంలో కూడా ఈ వ్యాసం ముగిస్తున్న అక్టోబర్ 10 నాటికి చైనా రాజధాని బీజింగ్ నుంచి వచ్చిన హై లెవల్ డెలిగేషన్ బృందం శ్రీలంక రాజధాని కొలంబోలో వుండడం గానీ, ఇదే వారంలో మన విదేశాంగ మంత్రి డా. ఎస్. జై శంకర్ జపాన్ రాజధాని టోక్యోలో ‘క్వాడ్ నేషన్స్ మీట్’ పేరుతో జరిగిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తో ఆగ్నేయ ఆసియా పరిణామాలపై సమలోచన గానీ విడివిడిగా చూడవలసిన పరిణామాలుగా లేవు. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా రాజకీయ కారణాలతో ఇప్పటికీ ‘ఇంక్యుబేటర్ బేబీ’ గా వున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యక హోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తూ, ఆగ్నేయ ఆసియాలో కల్లోల జలాల అలల్ని ఎదుర్కోవడం డిల్లీకి కూడా ఇకముందు కుదరకపోవచ్చు.
Also Read: మోడీ – జగన్ కలయిక... కేంద్రం కొత్త ‘జియో - పాలిటిక్సా?