- జాన్‌సన్ చోరగుడి

గత సార్వత్రిక ఎన్నికల ముందు 2019 ఏప్రిల్లో మన విదేశాంగ మంత్రిత్వ శాఖలో కొత్తగా ‘ఇండో-పసిఫిక్ డివిజన్’ ప్రారంభం అయింది. అయితే ఇది జరగడానికి రెండేళ్ళ ముందు 14 మే 2017 న వొక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఎడిట్ పేజిలో ప్రచురితమైన ఈ రచయిత రాసిన వ్యాసం ఇలా మొదలవుతుంది...

“కేంద్రంలో అధికారంలో వున్న ఎన్.డి.ఎ ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండు మార్గాలు వున్నాయి. రాబోయే రెండేళ్లలో అది – దేశీయ విధానం (Ministry of Home affairs) కేంద్రంగా పరిపాలన సాగించనుందా? లేక విదేశ విధానం (Ministry of External affairs) కేంద్రం గానా? అనేది ఈ ఏడాది స్పష్టం కావల్సివుంది. అది మొదటిదాన్ని కనుక ఎంచుకుంటే, అది అధికార ఎన్.డి.ఎ కి రాజకీయంగా ప్రయోజనకరం కావచ్చు. కాని రెండవ దాని మీద దృష్టి కనుక పెడితే, అందువల్ల - అధికార పక్షానికే కాదు, దేశానికి ధీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది.”  

అప్పట్లో ఆ వారంలో చైనా రాజధాని బీజింగ్ లో జరగనున్న ‘వన్ బెల్ట్-వన్ రోడ్’ సదస్సు సందర్భంగా ఆ వ్యాసం రాయడం జరిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడే తెలుగు పత్రికలు చదివి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నది, అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా విడిపోయాక; దేశ విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల వ్యూహాల్లో నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ దృష్టి కీలకంగా మారింది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. యు.పి.ఏ. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంపై అప్పట్లో నియమించిన కేంద్ర మంత్రుల కమిటీకి అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏ.కే. అంటోని అధ్యక్షుడుగా వున్నారు అనే విషయం ఇక్కడ గుర్తు చేసుకోవలసి ఉంది. అప్పటికి అమెరికా (బరాక్ ఒబామా) ఇండియా (డా. మన్మోహన్ సింగ్) చైనా (క్సిన్ పింగ్) దేశాల దృష్టిలో భవిష్యత్తు ఆగ్నేయ ఆసియాది! ‘ఆసియాన్’ వారికి తారకమంత్రం అయిన కాలమది.

 

 

అప్పటికి యూ. ఎస్. – ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతిపాదనల మేరకు 2015 సెప్టెంబర్ నాటికి మోడీ – ఒబామాల మధ్య జరగబోయే ఒప్పందంలో విశాఖపట్టణం ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు వొకటి. (‘ది హిందూ బిజినెస్ లైన్’ 23.01.2015) ఆ ఏడాది డిల్లీ రిపబ్లిక్ డే దినోత్సవంలో మన చీఫ్ గెస్ట్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అప్పటికి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టి ఆరు మాసాలు. అయితే ఒబామా వారసుడుగా డోనాల్డ్ ట్రంప్ రాకతో మన వద్ద ఆటకెక్కిన తొలి ప్రాజెక్టు ‘వైజాగ్ స్మార్ట్ సిటీ’.

 

 

అంతే కాదు, అంతకు ముందు బరాక్ ఒబామా తన రెండవ టర్మ్ ‘ఇప్పుడు- నాది ఆసియా-పసిఫిక్ కేంద్రిత దృష్టి’ (Asia-Pacific pivot) అని ప్రకటించి మరీ నిర్మించిన యూ. ఎస్. ఆగ్నేయ-ఆసియా విధానాన్ని డోనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రకటన చేసి మరీ చాప చుట్టేసాడు. అధ్యక్ష పీటం ఎక్కిన కొత్తలో అంతేసి బీరాలు పోయిన డోనాల్డ్ ట్రంప్, మళ్ళీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ‘ఆసియన్’ సదస్సుకు వచ్చి వారం రోజులు అక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు ఇదెందుకు చెప్పడం అంటే – ఒక దేశాధినేత దృష్టి తన దేశ విస్తృత ప్రయోజనాల పట్ల ధృడంగా ఉండాల్సిన అవసరం గురించి. ‘ఆసియన్’ దేశాలు అన్నీ చైనా ఓ.బి.ఓ.ఆర్. రూట్లో ఉండడం మనకు తెలిసిందే!

అయితే అప్పుడు జరిగింది ఏమిటి? మార్చి 2017 నాటికి ముఖ్యమంత్రి కుర్చీ కోసం నుంచి దేశ రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ ను డిల్లీ నుంచి గోవా పంపించి, కేవలం ఇంచార్జి తో రక్షణశాఖను నడిపించారు. విదేశాంగ మంత్రిత్వశాఖ వార్తలు కూడా ఆ ఏడాది జనవరి తర్వాత ఆశాజనకంగా కనిపించిన సంధర్భమైతే లేదు. ట్రంఫ్ ఏమి ఏమిచేయబోతున్నాడు  అనేది గమనించడానికే ఆ శాఖకు మొదటి  నాలుగు నెలలు సరిపోయాయి. పోని అలాగని ఈ కాలంలో నిజంగా ఏమి జరగలేదా? దేశం నిస్తేజంగా వుందా అంటే, అదీ కాదు.

ఈ కాలంలో- కొంత తాత్విక క్రియాశీలతతో దేశప్రజల మనస్సులను ‘జాతీయతాభావం’  వైపు మళ్ళించడానికి అధికారికంగానే ఒక ప్రయత్నం జరిగింది. జనవరి 2017 తర్వాత  జమ్ము-కాశ్మీర్ అల్లర్లు ప్రతి వారం శ్రీనగర్ డేట్ లైన్ తో జాతీయపత్రికల పతాక వార్తలుగా చూసాం. అవన్నీ ఈ ప్రభుత్వం ఖాళీగా ఏమీ లేదు, అది పూర్తి స్థాయిలో ‘యాక్షన్లో ‘ వుంది అనిపించేట్టుగా అంతా ఉండేది. వున్నట్టుండి, ‘ట్రిపుల్ తలాఖ్’ కూడా దానికి అప్పుడే గుర్తొచ్చింది. ఇటువంటివి జరగడం తప్పని కాదు, ఈ కాలమంతా మన ప్రధాని నరేంద్ర మోడి ఇంతకంటే  ప్రధానమైన అంశాలను విస్మరించారా? అనేది ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న! 

ఇంతకీ 2017 లో జరిగింది ఏమిటి? చైనా అధ్యక్షుడు క్సింగ్ పిన్- ‘సిగ్నేచర్ -ప్లాన్’ గా ప్రపంచ మీడియా అబివర్ణించిన  ‘ఓ.బి.ఓ.ఆర్’ అధికారిక ప్రకటన మే 14-15 తేదేల్లో బీజింగ్ లో జరిగింది. దానికి 28 దేశాల అధిపతులు, వంద దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో రష్యా- వ్లదిమీర్ పుతిన్, బ్రిటిష్- తెరిస్సా మే, ఫిపిఫిన్స్- డి రోడ్రిగో, పాక్- నవాజ్ షరీఫ్,  యు.ఎన్. సెక్రటరి జనరల్ యాంటియొన గుట్రెస్, ప్రపంచ బ్యాంక్ ప్రసిడెంట్ జిం యంగ్ కిం, ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టియాన లెగడ్రే  వంటి వారంతా బీజింగ్ దారి పట్టారు.

 

 

చైనాతో ప్రపంచ దేశాలు 50 కి పైగా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ దీనికి హాజరు కాలేదు!  సదస్సుకు మరో వారం ముందు (మే 6 వ తేదిన) పలుకరించినప్పటికీ- “జరుగుతున్నదేమిటో మాకు తెలియడంలేదు,” అని ఓ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి చెప్పినట్టు అప్పట్లో  ‘ది హిందూ’ పత్రిక రాసింది. “ ఇండియా సరిహద్దు దేశాలన్నీ దీనికి హాజరవుతున్నాయి, మన గైర్హాజరీ వల్ల - మనం ఒంటరి కావడం కావడం అనే ‘రిస్క్’ (ఇదే పదం వాడారు) ను కూడా కాదనలేము” అని అయన అన్నారు. “ అమెరికా, జపాన్ సైతం చైనాతో వాటి అభ్యంతరాలు వాటికున్నప్పటికీ, అవి తమ ప్రతినిధులను బీజింగ్ పంపుతున్నాయి. చివరి నిముషంలో కనీసం బీజింగ్ లోని భారత్ రాయబార కార్యాలయ ప్రతినిధులను అయినా పంపుతారో లేదో తెలియదు” అని అప్పట్లో ఆ అధికారి అన్నారు. 

అయితే ఇంత కీలకమైన వ్యవహారానికి మన దేశం తరపున మోడీ ప్రభుత్వం ఇచ్చిన నాటకీయమైన ముగింపు ఏమంటే – బిజెపి ప్రతినిధిగా చైనా వెళ్ళిన ఆ పార్టీ జనరల్ సెక్రటరి రామ్ మాధవ్ దీని గురించి అక్కడ మాట్లాడడం! జూన్ లో బీజింగ్ లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ముందస్తు సన్నాహక సమావేశానికి పార్టీ ప్రతినిధిగా ఆయన వెళ్లారు. అక్కడ ఆయన్నిపాత్రికేయులు ‘ఇండియా ఎందుకు ‘ఒ.బి-ఒ.ఆర్’ సదస్సుకు దూరంగా వుంది’ అని అడిగినప్పుడు, పాకిస్తాన్ గురించి ప్రస్తావించకుండా అది – ‘థర్డ్ పార్టీ’ సమస్య ఆయన అన్నారు.

ఇప్పుడు కూడా ఈ గతం తవ్వుకోవలసిన అవసరం ఉండేది కాదేమో. కానీ అదే ఏడాది నవంబర్ 18 న మన దేశంలో చైనా రాయబారి ల్యు జహోయి దిల్లీ జవహర్లాల్ నెహ్రు యునివర్సిటీ సౌత్ ఈస్ట్ ఏసియన్ స్టడీస్ స్కూల్ లో మాట్లాడుతు– “ఒ.బి.ఒ.ఆర్ పై భారత్ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని మునుపు ప్రతిపాదించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా కాకుండా, మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చైనా ఎంచుకోవచ్చు అన్నారు. దాని పేరు ఇప్పుడు ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ అంటున్నాము, రేపు మరో పేరుతో దాన్ని మనం పిలుచుకోవచ్చు” అన్నారు. సాంకేతికంగా అయితే నిజానికి వివాదం ఇక్కడితో ముగిసినట్టే, వాస్తవానికి చైనా రాయబారి ల్యు జహోయి జే.ఎన్.యు. ప్రకటన తర్వాత ఎన్.డి.ఏ. దౌత్య విజయం మన పత్రికల పతాక శీర్షికల్లో కనిపించాలి. అయితే ఇవేవీ జరగలేదు సరి కదా, చివరికి 2020 పరిణామాలతో మన వాళ్ళు చివరికి ఇలా ‘దొరికిపోయారా?’ అని మనమే అనుకోవాల్సి వస్తుంది.

 

 

ఎందుకంటే, నరేంద్ర మోడీ తన మొదటి టర్మ్స్ చివరిలో కొత్తగా మన విదేశాంగ మంత్రిత్వశాఖలో ‘ఇండో-పసిఫిక్ డివిజన్’ ప్రారంభం కావడం వల్ల. అది జరిగి ఏడాది దాటాక డిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ హ్యపిమన్ జాకబ్ అది మారిన ఎన్. డి. ఏ. దృష్టి అంటున్నారు. Time to shift focus to the maritime sphere శీర్షికతో ఆయన రాసిన వ్యాసంలో “In sum, this is perhaps the end of the road for New Delhi’s north-eastern and north-western geopolitical forays” (The Hindu 1st Oct’ 2020) అందులో క్లుప్తంగా ఆయన చెబుతున్నది – ‘డిల్లీ నాయకత్వం భౌగోళిక - రాజకీయ దృష్టి, ఇక ముందు దేశం ఉత్తరం సరిహద్దు వైపు చూడ్డానికి బహుశా కాలం చెల్లింది కావొచ్చు...’ అని! అయితే కేంద్రం దృష్టి దేశానికీ ఆగ్నేయాన కొత్తగా ‘మారిటైం’ వైపుకు మారినప్పుడు చూసేది - 970 కి.మీ. సముద్రతీరం ఉన్న ఏ.పి. వైపు. తొలి ఏడాదిలోనే ‘మారిటైం బోర్డు’ నెలకొల్పి, కొత్త పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రో-కెమికల్ రీజియన్ పన్లుతో స్థిరమైన ప్రభుత్వంతో పాలనను పరుగులు పెట్టిస్తున్న యువ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైపు!

నీతి: ఒక ‘రాజ్యం’ భౌగోళిక-రాజకీయ (జియో-పొలిటికల్) అవసరాలన్నింటినీ అధికారంలో వున్న ప్రభుత్వాలు ఎప్పూడూ తవ్వి తలకెత్తుకోవాలని ఏమీ వుండదు. కొన్నికొన్ని సార్లు  అధికార పార్టీ అవసరాలు - ప్రభుత్వంలో పైకి కనిపించకుండా ఒక దేశ విధానపర నిర్ణయాల్లో పడుగుపేకల్లా కలిసిపోయి వుండొచ్చు. అంతమాత్రాన ఎల్లకాలం వాటిని నర్మగర్భంగానే వుంచాలనుకోవడం  కుదరదు. ఎక్కువసార్లు  అవి మరే ఇతర కారణాల వలననో దాపరికం నుంచి అవి బయటకు వస్తాయి! 

 'మారిటైం' లో రాష్ట్రాల పాత్ర ఎలా కీలకం అవుతుంది? (మరో వ్యాసంలో...)