Asianet News TeluguAsianet News Telugu

కేపిటల్ ‘మానియా’ ఇక చాలు: దృష్టి తీరానికి చేరాలి

విభజన చట్టంలోని ఉమ్మడి రాజధాని వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోవడంలో కలిగిన తడబాటు వల్ల, నాటి ప్రభుత్వానికి ‘రాజధాని నిర్మాణం’ సింగిల్ పాయింట్ ఎజెండా గా మారింది. రాజకీయ ఎజెండా తొలి ప్రాధాన్యతగా సాగిన ఎన్.డి.ఏ. మొదటి ‘టర్మ్’లో కేంద్ర విభజన చట్టంలో అంశాలు మినహా రాష్ట్రం మీద సీత కన్ను వేసింది. 

special story on south indian coastal area
Author
Hyderabad, First Published Sep 15, 2019, 5:47 PM IST

-జాన్ సన్ చోరగుడి

 

‘గాయం’ పేరుతో రామగోపాల్ వర్మ తీసిన థ్రిల్లర్ సినిమాకు ఇప్పటికి పాతికేళ్ళు. 1993 నాటి దాని కథ అంతా బెజవాడే! అయితే ఈ ‘గాయం’ సీక్వెల్ ఇప్పటికీ ఇక్కడ ఇంకా కొనసాగుతూ వుంది. రాజధాని ఇక్కడికి వచ్చి, అధికారం కోల్పోయాక, ఒక నెల రోజులు క్రితం ఏ.పి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతికి గాయంతో మీడియా ముందు కనిపించారు. ఇప్పుడు గాయాలతో వున్న కొంత మంది ఆయన పార్టీ శ్రేణులు ఆత్మ రక్షణలో మీడియాలో కనిపిస్తున్నారు.

‘గాయం’ సినిమాకు అప్పట్లో కొన్ని నంది అవార్డులు కూడా వచ్చాయి. మొదటినుంచి ఈ కార్యక్షేత్రానికి, కథకు ఉన్న బలం అటువంటిది మరి. ‘మరక మంచిదే’ అన్న సర్ఫ్ ప్రకటన మాదిరిగా, కొన్నికొన్ని చోట్ల కొంతమందికి గాయం కూడా మంచిదే! అదీ వుండాలి. మానకూడదు, మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రేపితే మళ్ళీ అది పచ్చి పుండులా తాజాగా వుండాలి. దానికి ‘విజ్యువల్ వాల్యూ’ తప్పనిసరిగా ఉండాలి. 

అయితే, ఎవరి ప్రయోజనం కోసమిది? నేల విడిచిన సాములా మారిన ఈ విపరీత ధోరణి కారణంగా ఈ ప్రాంతంలో నిజంగానే ‘గాయపడి’ బయటకు రాకుండా, మునుపటి  క్రియాశీలత నుండి పౌర జీవితం నుండి కూడా శాస్వితంగా విశ్రాంతికి పరిమితమైన వారూ ఉన్నారు. వాస్తవానికి ఈ “మీడియా కోసం గాయం” కంటే, భంగపడి స్వచ్చంద మౌనంలోకి వెళ్ళిన వారి వల్ల కలిగిన గాయం పెద్దది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి జరుగుతున్న ఎక్కువ నష్టం అందువల్లనే.

ప్రపంచీకరణ వల్ల బల్లపరుపుగా మారిన ఈ ‘గ్లోబు’ మీద ఇన్నాళ్ళుగా ఎక్కడ ఫలాలు ఉంటే, అక్కడికి వెళ్లి వాటిని అందుకున్నావు, కోసి నీ బుట్టలో వేసుకున్నావు. కదా, మరి  విడిపోయి రెండు అయ్యాక, మనం కట్టుకోబోయే కొత్త రాజధాని అందరికీ అందేలా కొమ్మలు విస్తరించిన వృక్షంలా వుండాలని నువ్వు ఎందుకు కోరుకోవు? రేపటి తరం ప్రతినిధిగా నువ్వు కోరుకుంటున్న‘కేపిటల్’ ఎలా వుండాలి, అది ‘వెర్టికల్’ రాజధానా లేక ‘హారిజాంటల్’ రాజధానా? కోస్తాంధ్రకు రాష్ట్ర ప్రజలు  నేరుగా ఎక్కుపెడుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వాలి?

special story on south indian coastal area

ప్రతి ఒక్కరి ‘కామన్ సెన్స్’ కు తోచే విషయాన్ని కూడా ఇలా అంతులేని కథగా మార్చితే, ఆంధ్రప్రదేశ్ ఈ వ్యదార్ధ గాధ నుంచి ఎప్పటికి కోలుకోవాలి. ఉన్నవి చాలవు అన్నట్టుగా, జాతీయ మీడియాలో మళ్ళీ ఈ పెట్టుడు గాయాలు!  బాలరిష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి మరి రేపు ఏదో ఒక వైపు నుంచి నిజ గాయాల విపత్తు వస్తే, దాని నుంచి బయటపడ్డానికి మనల్ని మనం కాపాడుకోవడానికి మన పౌర సమాజానికి రేపటి తరం మేలు కోసం ఒక వ్యూహం వద్దా? రాష్ట్ర వ్యాప్తంగా గడచిన ఆరేళ్ళలో ఎంతో మంది ఆలోచనాపరుల అంతరంగ వ్యధ ఇది.

సమస్య - సూక్ష్మ స్థాయిలో కూడా ప్రతిదాన్ని రాజకీయం చేసాక; ఇప్పుడు వాస్తవమేది అనేదానికంటే, ఎవరెటు అనేది మన రోజువారీ రాజకీయ జీవనంగా మారింది. మనవద్ద  ప్రత్యామ్నాయ గొంతుకు జాగా పూర్తిగా తగ్గిపోవడం కూడా నిజమే. కానీ మొదటి నుంచి ఆధునిక పౌర సమాజాలు ఉన్న రాష్ట్రంగా చరిత్రలో రికార్డు అయిన ఆంధ్రప్రదేశ్ వంటి చోట, ఒకనాటి స్ఫూర్తి, ఇప్పుడిలా క్రియాశీల కార్యక్షేత్రం మీది నుండి, స్వచ్చంద నిష్క్రమణకు దారితీసిన పరిస్థితికి కారణం ఎవరు? కాలాన్ని అందుకు నిందించుకుంటూ కూర్చుంటే,   ముంచుకొస్తున్న పరిణామాలు తాకిడి రేపు నేరుగా మనకే తగిలాక అప్పుడు చేసేది ఏమిటి?

చరిత్ర తన ‘జాగ్రఫీ’ని వెతుక్కుంటూనే వుంది. మనకది అర్ధం కాకపొతే, అది మన సమస్యగానీ అందుకు ఎవరినో తప్పు పట్టడానికి లేదు. భారత ప్రభుత్వం దక్షణాదిలో ఆంధ్రప్రదేశ్ ను రెండు  రాష్ట్రాలుగా విడగొట్టిన ఆరేళ్లలోనే, కాశ్మీర్ కు ఉన్న  370 ప్రత్యేక చట్ట భద్రతను తీసివేయడం జరిగింది. ఈ రెండు నిర్ణయాలు రెండు వేర్వేరు ప్రభుత్వాలు తీసుకున్నవి. ఈ రెండూ భిన్న రాజకీయ సిద్దాంతాలు ఉన్న పక్షాలు అని మన నమ్మకం.

కొంతమేర కావచ్చు కూడా. కానీ వీటన్నిటినీ కలిపి చూడడం తెలియకపోతే, కాలంతో పాటుగా మారుతున్న కొత్త దారి మనకు తెలిసేది ఎలాగు? కేవలం తమకు అధికారం కోసం అసత్యాలు తప్ప, నిజాలు మాట్లాడని వాళ్ళను, వాళ్ళ పని చేసుకోనిద్దాం. అధికారంతో పని లేని వాళ్ళం, మనం మన ప్రాదేశిక రాష్ట్రం గురించి దాని బాగోగులు గురించి రేపటి తరం కోసం నిజాయితీతో నిజాలు మాట్లాడడానికి వచ్చిన చెబ్బర ఏమున్నది?

special story on south indian coastal area

మన ప్రదాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ ల మధ్య అక్టోబర్ 11 - 13 మధ్య జరగవలసిన రెండవ సౌహార్ధ సమావేశం ముందుగా వారణాసిలో జరగవచ్చు అనుకున్నప్పటికీ, ఇప్పుడు అది తమిళనాడు సముద్ర తీర పట్టణం మహాబలిపురంలో జరగవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర-రాష్ట్ర ఉన్నత అధికారులు ఏర్పాట్లు సమీక్షకు ఒక సారి సమావేశం కూడా అయ్యారని అంటున్నారు. ఉన్నట్టుండి, ప్రధాని మోడీ తన ఆరవ ఏడాదిలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే స్థాయి అంతర్జాతీయ సమావేశం వేదిక మన సరిహద్దుకు ఎందుకు మార్చారు? అనే సందేహం మనకు రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతైనా అవసరం. దీని పూర్వ రంగం గురించి ఈ రచయిత 29.8.2019 న రాసిన సమగ్ర వ్యాసం ‘ఆసియా నెట్’ వెబ్ సైట్ లో చూడవచ్చు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ 70 వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న అత్యంత శక్తివంతమైన భారీ సైనిక కవాతును చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. ఆగ్నేయ ఆసియాలో తన వాణిజ్య ఆధిక్యతకు సవాలు విసురుతున్న అమెరికాకు ధీటైన జవాబు తన ఈ మిలటరీ షో ద్వారా ఇవ్వబోతున్నట్టు, మొట్టమొదటి సారిగా తమ వద్ద ఉన్న అత్యంత ఆధునిక ఆయుధాలలో కొన్నిటిని ఆ కవాతులో ప్రదర్శిస్తున్నామని జనరల్ కై జ్హిజున్ తెలిపారు. అయితే దీని ద్వారా మేము ఏ దేశాన్ని ప్రాంతాన్ని లక్ష్యంగా చేయడం లేదని అన్నారు. 

special story on south indian coastal area

అయితే, చైనా చెబుతున్న ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నది మనకు తూర్పు తీరాన. చైనా తన ‘సిల్క్ రూట్’ కు ఇంధన మజిలీ కోసం ఇప్పటికే శ్రీలంక పోర్టుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇండో-పసిపిక్ జలాల్లో జరగబోయే చైనా యుద్ద కవాతు తర్వాత మున్ముందు తూర్పుతీరాన ముంచుకు వచ్చే కల్లోల జలాల నివారణ చర్యల్లో భాగంగా, చివరి క్షణంలో నరేంద్ర మోడీ – జిన్ పింగ్ ల భేటీ వేదిక మార్పు జరుగుతుందా? అటువంటి అనుమానమే కనుక నిజమైతే, ఈ పరిస్థితుల్లో చైనా-అమెరికా మధ్య ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరిగే ఉద్రిక్తతల ఒత్తిడి ముందుగా తగిలేది భారత్ కు అయితే, నేరుగా దాని సెగ  తగిలే రాష్ట్రం, 970 కి,మీ. తీరమున్న ఆంధ్రప్రదేశ్. 

 

దక్షణాదిన ఇంకా తీర ప్రాంత రాష్ట్రాలు లేవని కాదు, అవన్నీ దేశమంత పాతవి. ఉన్నవాటిలో కొత్తది, ఇంకా బాలారిష్టాల్లో ఉన్నది మనమే. గత నెలలో జరిగిన డైరక్టర్ జనరల్ షిప్పింగ్, డైరక్టర్ జనరల్ నేవీ స్థాయి అధికారులు సంబంధిత వాణిజ్య వర్గాలతో జరిపిన కోస్టల్ సెక్యూరిటీ సమీక్షా సమావేశంలో వెల్లడయిన విషయాలు మనకు ఆందోళన కలిగించేస్థాయిలో ఉన్నాయి. గత నాలుగేళ్లలో చైనా, హాంగ్ కాంగ్, తైవాన్లకు చెందిన 500 డీప్ సీ ఫిషింగ్ బోట్లు (Trawlers) ఏటా మన సరిహద్దుల్లో సంచరిస్తున్నాయి అని, రమారమి 32,250 సార్లు వీటి కదలికలు మన తీరంలో రికార్డు అయ్యాయని వెలుగులోకి వచ్చింది. 

special story on south indian coastal area

అన్నిసార్లు అవి మన సరిహద్దుల్లోకి రాకపోయినప్పటికీ వీటి రద్దీ మాత్రం ఎక్కువయింది అనేది అర్ధమవుతున్న విషయం. గత నెలలోనే, శ్రీలంక కోస్ట్ గార్డ్ మన కోస్ట్ గార్డ్ అధికారులతో డిల్లీలో సమావేశమై ఇరుపక్షాల మధ్య ఒప్పందాల అమలు పై చర్చించింది. ఇలా అంతర్జాతీయ రాజకీయ-ఆర్ధిక పరిణామాలు గత రెండు దశాబ్దాలు పైగా ఆసియా కేంద్రంగా జరగడం ఉన్నదే. అయితే, ఇప్పుడు అవి ఆగ్నేయ ఆసియాకు బదిలీ అయిన నేపధ్యంలో, దేశం తూర్పు సరిహద్దున ఒక కొత్త ‘జియో-పొలిటికల్’ గుర్తింపుతో ఇండియా ‘మ్యాప్’ లో కనిపిస్తున్నది మనమే. అందుకే, ఒక కీలక ప్రశ్న. 

special story on south indian coastal area

ఈ రాష్ట్ర భవిష్యత్తు మన రాజకీయులకు వొదిలి వేద్దామా? లేక కోస్తాంధ్ర గత చరిత్ర పరంపరను తలుచుకుని, మన రాష్ట్రాన్ని మారిన ఆర్ధిక-సామాజిక అవసరాలకు తగినట్టు నిర్మించుకుందామా? ఇటువంటి చర్చ ఆలోచనాపరుల మధ్య ఇప్పుడు అవసరం అవుతున్నది. అప్పటి ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2009 లో అకాల మరణం తర్వాత నుండి 2014 జూన్ వరకు కొనసాగిన అస్తవ్యస్త పరిస్థితుల దుష్ఫలితాలు కారణంగా తీవ్రంగా నష్టపోయింది అంధ్రప్రదేశ్. 

విభజన చట్టంలోని ఉమ్మడి రాజధాని వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోవడంలో కలిగిన తడబాటు వల్ల, నాటి ప్రభుత్వానికి ‘రాజధాని నిర్మాణం’ సింగిల్ పాయింట్ ఎజెండా గా మారింది. రాజకీయ ఎజెండా తొలి ప్రాధాన్యతగా సాగిన ఎన్.డి.ఏ. మొదటి ‘టర్మ్’లో కేంద్ర విభజన చట్టంలో అంశాలు మినహా రాష్ట్రం మీద సీత కన్ను వేసింది. ఈ కాలంలో తీరాంధ్రలో మచిలీపట్టణం వద్ద భూమి కేటాయింపు దశలో ఉన్న మెరైన్ పోలీస్ అకాడమీ ఇక్కడి నుంచి గుజరాత్ కు వెళ్ళింది. బందరు పోర్టు ఇంకా ఊగిసలాటలో ఉంది. నాగాయలంక గుల్లలమోద వద్ద  మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ శంఖుస్థాపన జరగవలసి వుంది.

special story on south indian coastal area

ముగింపులో మన ముందు ఉన్న ప్రశ్న ఒక్కటే, గత ఐదేళ్లుగా ఏదో ఒక రాజకీయ పదవి కోసం, ప్రభుత్వం పంచన చేరి రాష్ట్ర నిర్మాణ దీక్షల వేదికల మీద కనిపించిన మేధోజన ‘విజడం’ కు లేదా తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఏదో ఒక పార్టీ రంగు పులుముకుంటున్న ‘మీడియా’ చేతికి మనం ఈ రాష్ట్రాన్ని వొదిలి వేయడమా లేక అంతకు మించి ఇంకా విద్వత్తు ఉన్న పౌర సమాజంగా, మన కోసం మనం ఏమైనా చేయగలమా? వింధ్య పర్వతాలకు ఇవతల వరసగా ఓడిస్సా, వోర్వకల్లు (కర్నూలు), గోవా వద్ద ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో జరిగిన మన రక్షణ శాఖ క్షిపణి ప్రయోగాల సంఘటనలు మనం కనుక గమనించగలిగితే, అవి మన ఇళ్ళకు వస్తున్న పత్రికల్లోని వార్తలే!

Follow Us:
Download App:
  • android
  • ios