తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువే: అసలేం జరుగుతోంది?
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం చూసుకుంటే (మే 14వ తేదీ వరకు అందుబాటులో ఉన్న డేటా మేరకు) కేవలం 22,842 టెస్టులను మాత్రమే చేసింది. దేశం మొత్తం మీద సుమారు 14 లక్షల పైచిలుకు టెస్టులను నిర్వహించగా అందులో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే.
కరోనా వైరస్ టెస్టులను తెలంగాణ రాష్ట్రం తక్కువగా చేస్తుందని అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హై కోర్ట్ ఈ విషయంలో అక్షింతలు కూడా వేసింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే.... తెలంగాణ టెస్టులనుఈ తక్కువగా చేస్తుందంటూ హెల్త్ సెక్రటరీ తో సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం చూసుకుంటే (మే 14వ తేదీ వరకు అందుబాటులో ఉన్న డేటా మేరకు) కేవలం 22,842 టెస్టులను మాత్రమే చేసింది. దేశం మొత్తం మీద సుమారు 14 లక్షల పైచిలుకు టెస్టులను నిర్వహించగా అందులో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే.
కేసులు 1600 దాటినప్పటికీ.... ఇన్ని తక్కువ టెస్టులను ఎందుకు నిర్వహిస్తున్నారనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో యాంటీబాడీ టెస్టులను నిర్వహించట్లేదు. వాటి ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండట్లేదని అందరూ చెబుతున్నమాట. ఫలితాలను పర్ఫెక్ట్ గా చెప్పే పిసిఆర్ టెస్టులను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.
ఇక్కడి దాకా బాగానే ఉంది. తెలంగాణ అత్యంత ప్రామాణికమైన పిసిఆర్ టెస్టులను చేస్తుంది. కానీ ఎందుకింత తక్కువగా చేస్తుందనే ప్రశ్నకు ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే తాము ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కాంటాక్టులు పరీక్షిస్తున్నామని అంటుంది.
ప్రభుత్వ వాదన బాగానే ఉంది. కానీ లక్షణాలు లేకున్నప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ బయటపడుతూనే ఉంది. తాజాగా మెహిదీపట్నంకి చెందిన ఒక టెక్కీ తనకు కరోనా టెస్టు చేయాల్సిందిగా ఫీవర్ ఆసుపత్రికి వెళితే... అతనికి లక్షణాలు లేనందున వెనక్కి తిప్పి పంపించేశారు. మరల ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే... అక్కడ అతను కరోనా పాజిటివ్ గా తేలాడు. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నాడు.
ఇలా టెస్టులను తక్కువగా చేయడానికి కారణాలను వివరిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యూనిట్ ప్రతినిధి మాట్లాడుతూ... కేంద్రం నుంచి వస్తున్న టెస్టు కిట్ల సంఖ్య సరిపోవడం లేదేమో అని అన్నారు. అంటే... టెస్టు కిట్లు తక్కువగా ఉండడం వల్ల తెలంగాణ పరీక్షలు చేయడం లేదా అనే అనుమానం ఇక్కడ కలుగుతుంది.
తెలంగాణాలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు కూడా రాత్రిళ్ళు మినహా చాలావరకు సడలించబడ్డాయి. ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మరెక్కడా కూడా ఆంక్షలు అమల్లో లేవు.
బస్సులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వైరస్ మారుమూలపల్లెల్లోకి కూడా వెళ్లే ఆస్కారముంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అందరూ ఆచరిస్తున్న మంత్రమే సాధ్యమైనన్ని ఎక్కువ టెస్టులు చేయడం, ఐసొలేట్ చేయడం.
అలాంటిది టెస్టులను ఎక్కువగా నిర్వహించకపోతే.... వైరస్ ఎవరికీ ఉందొ అర్థం కాదు. లక్షణాలు కనబడకుండా ఉన్న వ్యక్తి ఎక్కడికైనా వెళితే... అది ఆ సదరు వ్యక్తి నుండి ఇతరులకు సోకే ప్రమాదం కూడా లేకపోలేదు.
కాబట్టి తెలంగాణాలో కూడా టెస్టింగ్ ను మరింతగా పెంచడం ఇప్పుడు మనముందున్న తక్షణ కర్తవ్యం. దేశవ్యాప్తంగా ప్రతి పదిలక్షల మందికి 1000 పైచిలుకు టెస్టులను నిర్వహిస్తే... తెలంగాణాలో అందులో సగం మాత్రమే నిర్వహించారు. అంటే జాతీయ సరాసరి కన్నా తెలంగాణాలో 50 శాతం తక్కువగా టెస్టులు చేస్తున్నట్టు.
తెలంగాణ వ్యాప్తంగా 20 ల్యాబులకు టెస్టులను నిర్వహించడానికి ఐసీఎంఆర్ అనుమతులను ఇచ్చింది. 11 ప్రైవేట్ ల్యాబులు కాగా 9 ప్రభుత్వ ల్యాబులు. తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబులను టెస్టింగ్ కి వినియోగించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పటికైనా ప్రైవేట్ ల్యాబులకు రాష్ట్రం అనుమతులిస్తే బాగుంటుంది. ప్రజలను దోచుకునే ఆస్కారం ఉందన్న ప్రభుత్వ వాదనలో కూడా వాస్తవం లేకపోలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే కరోనా టెస్టుల పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఎలా దండుకుంటున్నాయో మనం చూసాము కూడా.
ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలతో ప్రైవేట్ ల్యాబుల సహాయాన్ని కూడా తీసుకొని టెస్టింగ్ నిర్వహిస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. మరి టెస్టులను పెంచడమంటే ఏమి చేయాలి? ఉదాహరణకు కంటైన్మెంట్ జోన్లలో అందరికి టెస్టులను నిర్వహించాలనేది ఎప్పటి నుండో ఉన్న డిమాండ్.
తొలుత ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. దానితోపాటుగా హై రిస్క్ లో ఉన్నవారందరిపై కూడా టెస్టులను నిర్వహిస్తే మరింత సమర్థవంతంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు అనేది డాక్టర్లు, కేంద్రం చెబుతున్నమాట!