బిజెపిపై ఫైట్: మోడీపై కేసీఆర్ విసుర్లు, దీదీకే పెద్ద సవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా బిజెపి కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెబుతున్నారు. ఇది మమతా బెనర్జీకి పెద్ద సవాల్ ను విసరనుంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు బలమైన గొంతుగా ముందుకు వస్తున్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే కాకుండా ప్రధాని మోడీ వస్త్రధారణపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే జాతీయ రాజకీయాల్లో చర్చకు ఆయన ఎజెండా ఖరారు చేసినట్లు కనిపిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా కేసీఆర్ వ్యాఖ్యలపైనే మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో మాంత్రిక శక్తి మాత్రమే కాకుండా విషయాలపై కార్యకారణ సంబంధమైన లేదా హేతుబద్దమైన విమర్శపెడుతూ వస్తున్నారు. ఇంత ధాటిగా విమర్శలను ఎక్కుపెడుతున్న నేతలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తక్కువేనని చెప్పాలి.
బిజెపి బద్ధవ్యతిరేక అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ మాటలను సంధించడంలో నేర్పరి. దీదీ మాట్లాడితే తిరుగుండదు. ఆమెది బలమైన గొంతు. కానీ కేసీఆర్ మాదిరిగా విషయాలపై హేతుబద్ధంగా ఆసక్తి కలిగించే పద్ధతిలో మాట్లాడడం ఆమె కేసీఆర్ కు సాటి రారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎదుగుదల ప్రధాని నరేంద్ర మోడీకి విసరే సవాల్ కన్నా మమతా బెనర్జీకి విసరే సవాల్ పెద్దది. బిజెపి ప్రత్యర్థి పక్షానికి నాయకత్వం వహించాలని మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ స్థితిలో కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ మమతా బెనర్జీని దాటిపోయే దశ వచ్చింది.
బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్న ప్రస్తుత దశలో మమతా బెనర్జీని కాదని కేసీఆర్ నాయకత్వ స్థాయికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీకి ఆ విషయంలో కేసీఆర్ గట్టి సవాల్ విసరనున్నారు. దేశంలో బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడుతుందని, దానికి మమతా బెనర్జీ కన్వీనర్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే, దీనికి కేసీఆర్ పోటీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఫెడరల్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడినంత హెతుబద్దంగా మరో నాయకుడు మాట్లాడడం లేదు.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బిజెపిపై స్వరం పెంచారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో 22 నెలల గడువు ఉంది. ఈ స్థితిలో అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకు మోడీ గుజరాత్ మోడల్ ను కూడా కేసీఆర్ ప్రశ్నించారు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు మోడీ గుజరాత్ మోడల్ తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. మోడీ వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయాల్లో పెరగడానికి అది ప్రధానమైన కారణం.
కేసీఆర్ మోడీని వ్యక్తిగతంగా లక్షం చేసుకుని విమర్శిస్తూ వస్తున్నారు. ఊపర్ షెర్వానీ, అందర్ పరేషానీ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ డ్రెస్ కోడ్ మీద వరుసగా వ్యాఖ్యలను సంధిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా కనిపించడానికి గడ్డం పెంచుకున్నారని ఆయన మోడీని విమర్శించారు. అరే బాప్ రే... తమిళనాడు వెళ్తే లుంగీ ధరించాల్సిందే, ఏమిటిది అని అన్నారు. ఈ విధమైన గిమ్మిక్కుల వల్ల దేశానికి ఒరిగేదేమిటని ఆయన ప్ఱశ్నించారు.
మోడీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్ ను ఆయన ఈ సందర్భంలో తెర మీదికి తెచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పడానికి ఆధారాలు కావాలని రాహుల్ గాంధీ అడిగితే తప్పేమిటని, ఎఐసిసి అధ్యక్షుడిగా ఆయన అడిగారని, ఇప్పుడు తాను అడుగుతున్నానని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అదివారంనాడు మూడు గంటల పాటు కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలను ముందుకు తెచ్చారు. బిజెపిని అధికారం నుంచి తరిమి కొడుతామని, ప్రజలు కోరితే జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెడుతానని ఆయన చెప్పారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కేసీఆర్ ఉద్దేశం కొత్తదేమీ కాదు. 2018 నుంచి ఆయన అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. 2019 మార్చి -ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలను 2018 డిసెంబర్ లో జరిగేలా చూసుకున్నారు. అయితే, ఆ సమయంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెసుకు సవాళ్లు విసురుతూ వెళ్లారు. రాహుల్ గాంధీని అతి పెద్ద బఫూన్ గా అభివర్ణించారు. ప్రధాని మోడీకి దగ్గరవుతూ వచ్చారు. కేసీఆర్ కు బిజెపి బీ టీంగా పేరు వచ్చింది. బిజెపికి వ్యతిరేకంగా ఆయన ఒక రకంగా అకస్మాత్తుగా, తీవ్రంగా వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు.
కేసీఆర్ మాదిరిగా కాకుండా మమతా బెనర్జీ మొదటి నుంచి బద్ధ రాజకీయ శత్రువుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, మోడీకి, మమతా బెనర్జీకి మధ్య కూడా కొంత కాలం సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి. ప్రధాని మోడీ 2014లో మమతా బెనర్జీని సోదరి అని సంబోధిస్తూ ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ ను 35 ఏళ్ల పీడ నుంచి మమతా బెనర్జీ విముక్తం చేశారని ప్రశ్నించారు. ఆమెను గౌరవిస్తానని చెప్పారు. గుజరాత్ మోడల్ ను మమతా బెనర్జీ ప్రశంసించారు కూడా. మోడీ, మమతా స్నేహం కాంగ్రెసుకు ఆ సమయంలో ఇబ్బందికరంగా మారింది. 2015లో ప్రధాని మోడీతో పాటు మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు... ఏం జరుగుతోందని, ఈ స్నేహంలోని ఆంతర్యమేమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
2016 పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మోడీ, మమతాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. 2021 శాసనసభ ఎన్నికల తర్వాత బిజెపి ప్రత్యర్థిగా జాతీయ రాజకీయాల్లోకి రావడానికి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తుండడం, బిజెపికి వ్యతిరేకంగా బలంగా ముందుకు రావడం దీదీ ఆశలపై నీళ్లు చల్లే అవకాశం ఉంది. కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మనుగడ సాగిస్తున్నారు. దానికి తోడు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ప్రధాని అభ్యర్థిగా మమతతో పాటు కేసీఆర్ పోటీ పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హిందీలో అనర్గళంగా మాట్లాడే శక్తి వల్ల కేసీఆర్ మమత మీద పైచేయి సాధించగలరని భావిస్తున్నారు.