2020లో 2002 రిపీట్: అప్పుడు దాదా ఇప్పుడు కోహ్లీ....

భారత క్రికెట్‌లో విదేశీ గడ్డపై సంచలన విజయాలు సాధించిన నాయకుడిగా సౌరవ్‌ గంగూలీకి పేరుంది. విదేశీ టెస్టుల్లో గంగూలీ తరహాలో విజయాలు సాధిస్తున్న సారథిగా కోహ్లి కూడా ఆస్థాయిలో చిరస్మరణీయ విజయాలను అందుకుంటూ... గంగూలీ సరసన చోటు సాధించాడు. 

2002 repeats in 2020, then sourav ganguly now kohli

భారత్ అత్యంత త్వరగా మర్చిపోవాలనుకునే ఘట్టం ఏదన్నా ఉందంటే... ప్రస్తుత తరుణంలో అది ఖచ్చితంగా న్యూజీలాండ్ పర్యటనలో టెస్టు సిరీసే. సాధ్యమైనంత తొందరగా ఈ సిరీస్ తాలూకు జ్ఞాపకాలను భారతీయ క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా చూస్తున్నారు. 

ఈ సిరీస్ ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు మాత్రం కొన్ని పరిస్థితులకు రామ్ రామ్ పలికినందుకు చాలా సంతోషంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. అక్కడి పిచ్ ల నుంచి మొదలుకొని భయపెట్టే బౌలర్ల వరకు అన్నిటికి ఒక నమస్కారం చెప్పి భారత్ ఆ పీడకలను మర్చిపోవాలని చూస్తుంది. 

వరల్డ్‌ నం.1గా టెస్టు సిరీస్‌ను మొదలు పెట్టిన టీమ్‌ ఇండియా, 0-2 వైట్‌వాష్‌ ఓటమితో భంగపడింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి అనూహ్య వైఫల్యం, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఊహించని తడబాటు.... ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు, టీం ఇండియా ఓటమికి అనేక కారణాలు కనబడుతాయి. ఏదయితేనేమి, అన్నీ వెరసి భారత్‌ను చావు దెబ్బ దెబ్బతీసాయి. 

భారత క్రికెట్‌లో విదేశీ గడ్డపై సంచలన విజయాలు సాధించిన నాయకుడిగా సౌరవ్‌ గంగూలీకి పేరుంది. విదేశీ టెస్టుల్లో గంగూలీ తరహాలో విజయాలు సాధిస్తున్న సారథిగా కోహ్లి కూడా ఆస్థాయిలో చిరస్మరణీయ విజయాలను అందుకుంటూ... గంగూలీ సరసన చోటు సాధించాడు. 

ఆసీస్‌, సఫారీ, ఇంగ్లీష్‌, కరీబియన్‌ గడ్డలపై గంగూలీ తరహాలోనే విజయాలను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. న్యూజిలాండ్‌లో మాత్రం సౌరవ్ గంగూలీ మాదిరిగానే గర్వభంగానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే అందరూ ఇప్పుడు గంగూలీతో కోహ్లీని పోల్చి చూస్తున్నారు. 

వీరెందర్‌ సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ వంటి అరివీర భయంకరులైన బ్యాట్స్‌మెన్‌ తో గంగూలీ న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లాడు. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.  

భారత్‌ రెండు టెస్టుల్లోని ఏ ఒక్క ఇన్నింగ్స్ లోను 200 పరుగుల మార్కును అందుకున్న దాఖలాలు లేవు. రెండు మ్యాచుల్లోనూ వరుసగా 161, 121.. 99, 154 పరుగులకే కుప్పకూలింది. 0-2తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ ఓటమిని చవిచూసింది. 

2002లో గంగూలీ నాయకుడిగా విజయాల పరంపర కొనసాగిస్తున్న తరుణంలో కివీస్‌ గడ్డపై వారికి దారుణ పరాభవం ఎదురైంది. 2020లో అదే కథ పునరావృతం అయ్యింది. నాయకులు మారారు, సంవత్సరం వేరు. కానీ ఫలితం అదే పునరావృతమైంది. 

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో మూడు సిరీస్‌లలోన్ కలిపి ఏడు టెస్టుల్లో అజేయ రికార్డుతో దూసుకుపోతున్న భారత్‌ న్యూజిలాండ్‌లో కాలుమోపింది. వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. 

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లను మాత్రమే నమోదు చేసింది. నాలుగు ఇన్నింగ్సుల్లో వరుసగా 165, 191..242, 124 పరుగులకే ఆలౌటైంది. టెస్టు సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌ ఓటమి మూటగట్టుకుంది. 

Also read: ఇండియాకి రండి చూపిస్తా... కివీస్ క్రికెటర్లను బెదిరించిన కోహ్లీ

2002 గంగూలీసేన ఓటమికి, 2020 కోహ్లిసేన పరాజయానికి ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. మీరు కూడా ఈ రెండు సిరీస్ ల మధ్య ఉన్న సారూప్యతలపై ఒక లుక్కేయండి. 

టాస్‌...

2002, 2020 టెస్టు సిరీస్‌ల్లో రెండు మ్యాచుల్లోనూ భారత్‌ టాస్‌ కోల్పోయింది. అప్పుడైనా ఇప్పుడైనా నాలుగు మ్యాచుల్లో కూడా న్యూజిలాండ్‌నే టాస్‌ వరించింది. నాలుగు సందర్భాల్లో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 

అత్యల్ప స్కోర్లు...

2002లో 161, 121, 99, 154 స్కోర్లు చేసింది. 2020లో 165, 191, 242, 124 పరుగులు చేసింది. ఫలితాన్ని ప్రభావితం చేసిన తొలి ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 161, 99... 165, 242 పరుగులే చేయగల్గింది. 

వేదికలు కూడా ఒక్కటే... 

2002, 2020 టెస్టు వేదికలు సైతం ఒకటే. అప్పుడూ, ఇప్పుడూ తొలి టెస్టు వెల్లింగ్టన్‌లో జరగగా, రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్‌లో జరిగాయి. ఇంత సారూప్యతలు ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయా చెప్పండి. 

రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్... 

రెండు పర్యటనల్లోనూ భారత్‌ తొలి టెస్టును 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2002లో గంగూలీ జట్టు న్యూజిలాండ్‌కు 36 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా..2020లో కోహ్లిసేన 9 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

న్యూజిలాండ్‌ రెండు సందర్భాల్లోనూ అలవోక విజయాలు నమోదు చేసింది. 2002, 2020ల్లో రెండో టెస్టులో భారత్‌ స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. 2002లో ఐదు పరుగుల ఆధిక్యం లభించగా, 2020లో 7 పరుగుల ఆధిక్యం వచ్చింది. అయినా, రెండు సందర్భాల్లోనూ మ్యాచ్‌ను నిలుపుకోలేదు. వరుసగా 4, 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 

బ్యాటింగ్‌ దిగ్గజాల వైఫల్యం...  

2002, 2020లో రెండు జట్ల నుంచి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా సెంచరీ కొట్టలేదు. రెండు సిరీస్‌ల్లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగులే కావడం మరో విశేషం. రెండు సార్లు ఆ స్కోరును న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ ఏ కొట్టారు. 2002లో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ రిచర్డ్‌సన్‌ బాదగా, 2020లో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొట్టాడు. 

ఆ రెండు 89 పరుగుల ప్రదర్శనలు తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లోనే రావటం మరో విశేషం. ఈ రెండు పర్యటనల్లోనూ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ నుంచి ఒక్క సెంచరీ నమోదు కాలేదు. 2002 నుంచి 2020 వరకూ భారత్‌ 60 టెస్టు సిరీస్‌లో ఆడింది. ప్రతి సిరీస్‌లోనూ కనీసం ఎవరో ఒక బ్యాట్స్ మెన్ సెంచరీ బాదాడు. 

2002, తర్వాత 2020లో భారత్‌ తొలిసారి శతకం లేకుండా సిరీస్‌ను ముగించింది. ఇక అప్పటికి ఇప్పటికే భారత్ తరుఫున అప్పుడు ఇప్పుడు అత్యధిక పరుగులు చేసినవారి మధ్య కూడా ఒక సారూప్యత ఉంది. 

2002లో రాహుల్‌ ద్రవిడ్‌ 76 పరుగులు చేయగా, 2020లో మయాంక్‌ అగర్వాల్‌ 58 పరుగులు చేశాడు. ఇద్దరూ కూడా కర్ణాటకకు చెందిన వారు కావడం విశేషం. భారత్‌ నుంచి అప్పుడు రాహుల్‌ ద్రావిడ్, ఇప్పుడు అగర్వాల్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేశారు. 

2002లో రెండు టెస్టుల్లో 100కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌. 2020లో చతేశ్వర్‌ పుజార, మయాంక్‌ అగర్వాల్‌లు 100 ప్లస్‌ మార్క్‌ దాటారు. భారత్‌ ప్రతి వికెట్‌కు చేసిన సగటు పరుగులు తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. 2002లో సగటున ఒక్క వికెట్ కి 13.17 పరుగులు చేస్తే.... 2020లో 18.05 పరుగులు చేసింది. విదేశీ టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యల్పం. 

సారధి వైఫల్యం చెందిన వేళ... 

విదేశీ గడ్డపై సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లిలు అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లు. టెస్టుల్లో ఈ ఇద్దరికీ న్యూజిలాండ్‌లోనే తొలి వైట్‌వాష్‌ పరాభవం ఎదురైంది. బ్యాట్స్‌మన్‌గా కూడా గంగూలీ, విరాట్‌ కోహ్లిలు ఇద్దరూ దారుణ వైఫల్యం చెందారు. 

గంగూలీ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7.25 సగటుతో 29 పరుగులే చేయగా.. విరాట్‌ కోహ్లి 9.50 సగటుతో 38 పరుగులు మాత్రమే చేశాడు. గంగూలీ, విరాట్‌లకు ఇద్దరికీ ఈ సిరీస్‌లే బ్యాట్స్‌మన్‌గా రెండో అత్యల్ప స్కోర్లు నమోదైన సిరీస్‌ లు అవడం గమనార్హం. న్యూజిలాండ్‌లో ఆడిన విదేశీ కెప్టెన్ల ప్రదర్శనల్లోనూ గంగూలీ, విరాట్‌ కోహ్లిలు రెండు అట్టడుగు స్థానాల్లో ఉన్నారు. 

న్యూజీలాండ్ డెబ్యూ హీరోలు....  

రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్‌ తరఫున అరంగ్రేటం చేసిన ఆల్‌రౌండర్లు సిరీస్‌ ఫలితాన్ని శాసించారు. ఈ ఇద్దరు కూడా ఆరు అడుగుల ఎత్తు ఉండడం మరో విశేషం. 2002లో ఆరు అడుగుల ఆజానుబాహుడు జాకబ్‌ ఓరం తొలి బ్లాక్‌క్యాప్‌ అందుకున్నాడు. 2020లో మరో ఆరు అడుగుల ఆజానుబాహుడు కైల్‌ జెమీసన్‌ తొలి టెస్టు క్యాప్‌ దక్కించుకున్నాడు. 

జాకబ్‌ ఓరం రెండు టెస్టుల్లో 11 వికెట్లు కూల్చాడంతోపాటు... రెండో టెస్టు నాల్గో ఇన్నింగ్స్‌లో అజేయంగా 26 పరుగులు చేసి, భారత్‌ వైట్‌వాష్‌ను పూర్తి చేశాడు. ఆ సిరీస్‌లో డార్లీ టఫ్ఫీ తర్వాత జాకబ్‌ రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 

2020లో జెమీసన్‌ 9 వికెట్లు కూల్చాడంతోపాటు... రెండు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్స్‌ల్లో కీలక 44, 49 పరుగుల సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. టిమ్‌ సౌథీ (14 వికెట్లు) తర్వాత సిరీస్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. ఇది మరో కొసమెరుపు. 

మ్యాచ్ విన్నర్లకు కొదవలేకున్నా... 

2002, 2020ల్లో న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత జట్లను ప్రతిభ పరంగా వేలెత్తి చూపలేం. అప్పుడు గంగూలీ జట్టులో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరెందర్‌ సెహ్వాగ్‌ వంటి ఉద్ధండులు ఉన్నారు. 

ఇప్పుడు విరాట్‌ కోహ్లి శిబిరంలో చతేశ్వర్‌ పుజార, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా వంటి యువ కెరటాలు ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి బౌలర్లనైనా ఎదుర్కొనే సత్తా రెండు జట్లకూ ఉంది. 

Also read: అసలు సమస్య ఇదీ: విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ గుట్టు విప్పిన కపిల్ దేవ్

అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయినా, రెండు జట్లూ 0-2 వైట్‌వాష్‌ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రెండు పర్యటనల్లోనూ భారత్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన ఒకే ఒక పొరపాటు, న్యూజిలాండ్‌ స్థానిక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోయినట్టుగా కనబడుతుంది. 

అక్కడి లేట్ గా బంతి స్వింగ్ అయ్యే పరిస్థితులు, బ్యాట్స్ మెన్ తడబాటుకు గురయ్యే ఊహించని బౌన్స్, బౌలర్లకు స్వర్గధామంలాంటి పచ్చిక పిచ్‌లు, బలంగా వీచే గాలులు. ఇవి న్యూజిలాండ్లోని ప్రత్యేక పరిస్థితులు. 

వీటికి అనుకూలంగా మ్యాచ్‌ వ్యూహలని సిద్ధం చేసుకోవడంలో రెండు పర్యాయాల్లోను భారత్‌ విఫలం చెందింది. 2002, 2020ల్లోను  భారత్‌ రికార్డును చూసిన వారెవరైనా కివీస్ పై విజయం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండుసార్లూ  అంచనాలను తలకిందులు చేస్తూ వైట్ వాష్ ఓటమిని మూటగట్టుకొని పరాభవ భారంతో వెనక్కి వచ్చింది భారత జట్టు. 

అప్పటి సారథి గంగూలీ నేడు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండగా కూడా ఇంకా భారత జట్టు మానేజ్మెంట్ విఫలం చెందటం మాత్రం కలవరపెడుతుంది. ఇప్పటికైనా భారత జట్టు మానేజ్మెంట్ దీన్నొక పీడా కలలాగా మర్చిపోయి, త్వరగా పాఠాలు నేర్చుకొని టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బరిలో నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios