అసలు సమస్య ఇదీ: విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ గుట్టు విప్పిన కపిల్ దేవ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో విఫలం కావడానికి గల అసలు కారణాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వివరించాడు. 30 ఏళ్లు దాటిన తర్వాత క్రికెటర్లందరూ ఎదుర్కునే సమస్యనే ఇది అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో వైఫల్యం కావడానికి గల అసలు కారణాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పసిగట్టారు. న్యూజిలాండ్ పై రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, నాలుగు ఇన్నింగ్సుల్లోనూ 38 పరుగులు మాత్రమే చేసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండో టెస్టు మ్యాచులోనూ మొదటి టెస్టులో మాదిరిగానే కోహ్లీ అవుట్ కావడంపై కపిల్ దేవ్ మాట్లాడాడు.
కోహ్లీ వయస్సులో ఓ దశను దాటాడని, ఆ స్థితిలో కంటిచూపూ ప్రతిచర్యలూ (రిఫ్లెక్సెస్) మందగిస్తాయని, దానివల్ల ఆటగాడి చేతికీ కంటికీ మధ్య సమన్వయం కొరవడుతుందని కపిల్ దేవ్ అన్నాడు. 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కంటిచూపుపై ప్రభావం పడుతుందని, విరాట్ కోహ్లీ స్వింగ్ డెలివరీలను ఫోర్ గా మలిచేవాడని, అత్యంత బలంగా ఫోర్ కొట్టేవాడని, అదే డెలీవరీలను ఎదుర్కోవడానికి విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడని ఆయన అన్నారు.
Also Read: సిరీస్ కోల్పోయిన టీమిండియా, కోహ్లీపై విమర్శలు... అండగా నిలిచిన చిన్ననాటి కోచ్
రెండో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సుల్లోనూ విరాట్ కోహ్లీ ఇన్ స్వింగింగ్ బాల్స్ కు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కోహ్లీ బలహీనతను గుర్తించిన కపిల్ దేవ్ తన కంటిచూపును అడ్జస్ట్ చేసుకోవడానికి నెట్ లో ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయాలని సూచించాడు.
విరాట్ కోహ్లీ కొద్దిగా కంటిచూపును అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. బలమైన బ్యాట్స్ మెన్ ఇన్ స్వింగింగ్ బంతులకు ఎల్బీడబ్యూ లేదా బౌల్ అవుతున్నప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని సూచించాలని ఆయన అన్నాడు. కంటిచూపునకూ చేతికీ మధ్య పొత్తు కుదరనప్పుడు నీ బలమే బలహీనతగా మారుతుందని ఆయన అన్నాడు.
వివ్ రిచర్డ్స్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి బ్యాట్స్ మెన్ రెండో దశలో ఇదే విధమైన సమస్యను ఎదుర్కున్నారని ఆయన చెప్పాడు. 18 -24 ఏళ్ల మధ్య వయస్సులో నీ కంటిచూపు ఆప్టిమమ్ లెవెల్లో ఉంటుందని, ఆ తర్వాత నువ్వు ఎలా శ్రమిస్తున్నావనేదానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు.
Also Read: కివీస్ పై ఘోర ఓటమి: కోహ్లీ బ్యాటింగ్ ఫట్, అయ్యో అనాల్సిందే
తిరిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి కోహ్లీకి కనీసం మూడు నెలల శిక్షణ అవసరమని, ఐపిఎల్ లో ఆడడం కోహ్లీకి ఉపయోగపడుతుందని కపిల్ దేవ్ చెప్పాడు. కోహ్లీకి ఎంతో ప్రాక్టీస్ అవసరమని అన్నాడు. బంతులను ఎదుర్కోవడంలో ఆలస్యం చేస్తున్నాడని, ఇంతకు ముందు తగిన సమయంలో బంతిని ఎదుర్కునేవాడని ఆయన చెప్పాడు.