వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ చిత్రాలు పంపిన కర్నాటక ఎమ్మెల్సీ
ప్రజాప్రతినిధులంతా పేదల పెన్నిధే కావాలంటే ఎలా.. కొందరు రాజకీయ నేతలు నీలిచిత్రాల పెన్నిధిగా కూడా ఉంటారు. వారిలో కళాపోషణ అప్పుడప్పుడు కట్టలు తెంచుకుంటుంది. అది ఒక్కోసారి పబ్లిక్ గా బయటపడుతుంది. అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.
కర్నాటకలోని బీజేపీ నేతలు ఇలా నీలిచిత్రాలను ఆస్వాదించడంలో దేశంలోని అందరి కంటే ముందు ఉన్నట్లున్నారు. ఆ మధ్యన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా మొబైల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ దొరికి పోయారు.
అది మరిచిపోకముందే ఓ మంత్రి తన వద్దకు వచ్చిన మహిళతో రాసలీలలు జరిపి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.
ఇప్పుడు తాజాగా ఓ బీజేపీ నేత కూడా అలాంటి ప్రదర్శనే చేసి పేరు తెచ్చుకున్నారు.కర్ణాటకలోని బెల్లావి కి చెందిన ఎమ్మెల్సీ మహన్ తేష్ కవతగిమాత్ ఏ మూడ్ లో ఉన్నారో ఏమోగాని తన మొబైల్ లో ఉన్న నీలిచిత్రాలను బెల్గావి మీడియా ఫోర్స్ అనే వాట్సప్ గ్రూప్ లో షేర్ చేశాడు.
అదేదో ఆయన ఫ్రెండ్స్ గ్రూప్ అనుకునేరు. సీనియర్ రాజకీయనాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు ఉన్న గ్రూప్ అది. దీంతో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్లందరూ ఎమ్మెల్సీ చేసిన పనికి అవాక్కైయ్యారు. మహిళాప్రతినిధులు, అధికారులు కూడా ఆ గ్రూప్ లో ఉండటంతో దీనిపై వారు తీవ్రంగానే స్పందించారు.
విషయం తెలుసుకొని కంగుతిన్న ఎమ్మెల్సీ తన ఫోన్ హ్యాంగ్ అయిందని, పొరపాటున ఆ చిత్రాలు వాట్సాప్ గ్రూప్ కు వెళ్లాయని తాను కావాలని చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు.
అయితే ఆయన తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి మొబైల్ లో పోర్న్ చిత్రాలు ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాయి. సైబర్ చట్టాల మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
