బ్రిక్స్ సదస్సుకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడం, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

18వ BRICS (బ్రిక్స్) సదస్సు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమ్మిట్ కోసం డిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ (సెప్టెంబర్ 11, శుక్రవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ద్వైపాక్షిక సమావేశంలో కీలకమైన వాణిజ్య అంశాలపై చర్చించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్-రష్యా ఆర్థిక, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు.

ఇన్నోప్రామ్, పారిశ్రామిక సహకారం

భారత్‌లో 'ఇన్నోప్రామ్' విజయవంతం కావడంపై కూడా పుతిన్, మోదీ చర్చించారు. ఇన్నోప్రామ్‌ను భారత్‌కు తీసుకురావడం వల్ల రష్యాతో పారిశ్రామిక సహకారం విస్తరించేందుకు మార్గం సుగమమైంది. రైల్వే రంగం, టన్నెలింగ్, స్టీల్ వాల్యూ చైన్ అభివృద్ధి, B2B అవకాశాలు, రష్యా మార్కెట్‌లోకి ప్రవేశం వంటి అంశాల్లో మరింత సహకారానికి వీలు కలుగుతుంది.

'ఇన్నోప్రామ్-ది ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్' అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు, కొనుగోలుదారులను ఒకే ప్లాట్ ఫామ్ పైకి తెచ్చే ఒక గ్లోబల్ ప్లాట్‌ఫామ్. ఇది అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ మార్కెట్‌ను యాక్సెస్ చేయడానికి, సమర్థవంతమైన నెట్‌వర్కింగ్ కోసం ఒక B2B ప్లాట్ ఫామ్ గా పనిచేస్తుంది.

విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యం

అణు ఇంధన రంగంలో సహకారం, రవాణా సౌకర్యాలు, భారత నైపుణ్య కార్మికులను రష్యాకు పంపడం, కీలక ఖనిజాలు, ఎరువుల రంగంలో జాయింట్ వెంచర్ల ద్వారా సహకారాన్ని పెంచుకోవడం వంటి అంశాలపై కూడా ఇద్దరు నేతలు లోతుగా చర్చించారు. రష్యా అధ్యక్షుడి ఈ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.