Pakistan High Commission Demolition: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ హైకమిషన్ బ‌య‌ట చేప‌ట్టిన నిర్మాణాల‌ను భారత అధికారులు తొలగించారు.

పాక్‌ హైకమిషన్‌ బయట అసలేం జరిగింది?

న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ వీసా విభాగం వద్ద దరఖాస్తుదారుల కోసం ఏర్పాటు చేసిన క్యూ నిర్వహణ మౌలిక వసతులు, లోహపు కంచెలు, తాత్కాలిక నిర్మాణాలు రహదారి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి అనుమతించిన ప్రాంగణ హద్దులకు వెలుపల ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత యంత్రాంగం అక్కడికి జేసీబీలను తీసుకొచ్చి నిర్మాణాలను తొలగించింది. కూల్చివేతలో క్యూల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు, మెటల్‌ ఫ్రేములు, రేకుల కప్పులు, తెల్లటి లోహపు కంచెలు, రహదారి చుట్టూ ఉన్న బారికేడ్లను తొల‌గించారు. ఘటన అనంతరం హైకమిషన్‌ వెలుపల నిర్మాణాల శిథిలాలు కనిపించాయి. అయితే పాకిస్థాన్‌ హైకమిషన్‌ ప్రధాన ద్వారం, ప్రధాన కాంపౌండ్‌ గోడలకు ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.

Scroll to load tweet…

ఇస్లామాబాద్‌లో జరిగిన ఘటనతో లింక్‌ ఏంటి?

ఢిల్లీలో ఈ చర్యకు ముందు పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ బయట ఏర్పాటు చేసిన కొన్ని భద్రతా బారికేడ్లు, పార్కింగ్‌ ఏర్పాట్లను పాక్‌ అధికారులు తొలగించారు. ఆ ఘటన జరిగిన మూడు రోజులకే న్యూఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ వద్ద భారత అధికారులు కూడా బారికేడ్లు, ఇతర బాహ్య నిర్మాణాలను తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు పరిణామాలు దాదాపు ఒకే తరహాలో ఉండటంతో ఇది ‘టిట్‌ ఫర్‌ టాట్‌’ చర్య కావచ్చనే చర్చ మొదలైంది. అయితే ఢిల్లీలో చేపట్టిన కూల్చివేతలను ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్‌ తీసుకున్న చర్యకు ప్రతీకారంగా చేశామని భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారికంగా మాత్రం అనుమతి లేని నిర్మాణాలు నిర్ణీత హద్దులను దాటి ఉండటంతోనే వాటిని తొలగించినట్లు సమాచారం.

దౌత్య ఉద్రిక్తతలకు కశ్మీర్‌ అంశం కూడా తోడైంది

ఇదే సమయంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మరో దౌత్యపరమైన వివాదం కూడా ముదిరింది. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ఇటీవల శ్రీనగర్‌లో పర్యటించారు. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో ముఖ్యమైన భాగమని ఆయన వ్యాఖ్యానించడంతో పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయని గోర్‌ పేర్కొనడంతో పాటు, అమెరికా జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ప్రయాణ సూచనలను కూడా పునఃపరిశీలించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఆ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని అమెరికా ఛార్జ్‌ డి’అఫైర్స్‌ నాటలీ బేకర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై తమ వైఖరిని పాకిస్థాన్‌ మరోసారి స్పష్టం చేసింది. గోర్‌ వ్యాఖ్యలు తమ దీర్ఘకాలిక దౌత్యపరమైన స్థానం, కశ్మీర్‌ వివాదంపై అమెరికా గతంలో అనుసరించిన వైఖరికి భిన్నంగా ఉన్నాయని ఇస్లామాబాద్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న దౌత్య ఒత్తిడి

హైకమిషన్ల వెలుపల భద్రతా ఏర్పాట్ల తొలగింపు, కశ్మీర్‌పై అమెరికా రాయబారి వ్యాఖ్యలు, వాటిపై పాకిస్థాన్‌ నిరసనఈ వరుస పరిణామాలు ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తతను మరోసారి బయటపెట్టాయి. ఒక దేశం దౌత్య కార్యాలయం బయట తీసుకున్న చర్యకు మరో దేశం కూడా అదే తరహాలో స్పందించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే న్యూఢిల్లీలోని తాజా కూల్చివేతలను నేరుగా ప్రతీకార చర్యగా పేర్కొనేందుకు అధికారిక ఆధారం ప్రస్తుతం లేదు. అనధికార నిర్మాణాల తొలగింపే కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కశ్మీర్‌ విషయంలో అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ నుంచి తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి. దీంతో మూడు దేశాలకు సంబంధించిన దౌత్యపరమైన పరిణామాలు ఒకేసారి చర్చనీయాంశంగా మారాయి.