ఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రచ్చరచ్చ జరుగుతుంటే తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. 

శబరిమల అయ్యప్ప ఆలయం తమదంటూ కేరళకు చెందిన మాల ఆర్యులు వాదిస్తున్నారు. తరతరాలుగా ఈ ఆలయం తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 

అసలు శబరిమలలోని అయ్యప్ప ఆలయం ఎవరిది. మాల ఆర్యుల వివాదం వెనుక వాస్తవమెంత ఓ సారి చూద్దాం. 12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులదని ప్రచారం. పండలం రాజ కుటుంబం 1800లో ఈ ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు.

అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో లభించాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్‌ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. 

గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనెతో అభిషేకం చేసేవారు. అయితే వారి స్థానంలో వచ్చిన బ్రహ్మణ పూజారులు పాలతో అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించిందని మాల ఆర్యులు చెప్తున్నారు.

 తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాన్ని అప్పగించాల్సిందిగా త్వరలోనే ప్రభుత్వాన్ని కోరతామని ఒప్పుకోని పక్షంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో దేవాలయాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమోనని మాల ఆర్యులు చెప్తున్నారు. మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికిందంటున్నారు. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని తెలిపారు. 
మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత చూపలేదని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్‌ చెప్పారు. సజీవ్ అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. 

శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారని మాల ఆర్యులు చెప్తున్నారు. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్‌ అని, ఆయనే శబరిమల అయ్యప్ప ఆలయానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్‌ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్‌లో నివసిస్తున్నారని సజీవ్‌ స్పష్టం చేశారు.  

దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారని తెలిపారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. మాల ఆర్యుల ఊర్లు అన్నీ కొండ చెరియ వాలుకు ఆనుకుని ఉంటాయని చెప్తున్నారు. 

మాల ఆర్యుల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్‌ ఆఫ్‌ ది మౌంటేన్‌) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్‌ లైవ్‌ ఇన్‌ ట్రావెంకోర్‌’ పుస్తకంలో శామ్యూల్‌ మతీర్‌ రాశారని తెలిపారు.

ఇప్పటికే కేరళలో కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్‌ మహదేవ్‌ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. 

బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనెతో అభిషేకం నిర్వహించేవారిని సాక్షాత్తు కేరళ సీఎం పినరయి విజయన్‌ అక్టోబర్‌ 23న  పట్టణంతిట్టలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించడం మాల ఆర్యుల వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

గతంలోనే ఆదివాసీల ఆలయాలు కొన్ని అన్యాక్రాంతమైతే మరికొన్ని ధ్వంసమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మ, కొడగులోని తాళకావేరి, చిక్‌మగలూరులోని బాబా బుడాన్‌ గిరి టెంపల్, తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఒకప్పుటి గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. 

తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు, ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. అందువల్లే అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్‌ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. 

అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్‌ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. ఇకపోతే వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అని చరిత్ర చెప్తోంది. వేంకటేశ్వరుడు ఒకప్పుడు చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెప్తున్నారు. 

చారిత్రక ఆధారాలుగా అయ్యప్ప ఆలయం తమదేనని మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దేవాలయాలపై ఉద్యమం చేస్తున్న వారు శబరిమల అయ్యప్ప ఆలయంపై కూడా చేస్తామని చెప్తుండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దానికి తోడు మాల ఆర్యుల ఆందోళనలు చేపడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అయితే మాల ఆర్యుల మాత్రం శాంతియు తంగానే నిరసనలు చేపడతామని చెప్తున్నారు. ముందు ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శబరిమలలో హై టెన్షన్: ఆలయంలో లోపల మహిళా పోలీసులు

శబరిమల: తెరుచుకొన్న అయ్యప్ప ఆలయం, భారీ బందోబస్తు

శబరిమల హోటళ్లలో మహిళలు.. గవర్నర్‌కు ఎమ్మెల్యే లేఖ

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం