Lok Sabha Elections 2024 : సీఎం రేవంత్ భయపడుతున్నారా..? లేకపోతే రోజుకో దేవుడిపై ఒట్టేంటి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలే ఇప్పుడు వ్యతిరేకిస్తారన్న అనుమానం కలుగుతోందా?  రేవంత్ మాటలు వింటే అవుననే అనిపిస్తోంది. 

Is CM Revanth Reddy afraid of Lok Sabha elections? AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది... అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిలో ఏమాత్రం భయం కనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్ గా అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రేవంత్ లో కాస్త భయం కనిపిస్తోంది. ప్రతిపక్షంలో వుండగా లేనిభయం అధికారంలో వుండగా ఎందుకు అనుకోవచ్చు. కానీ ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే... అధికారంలో వుండికూడా పార్టీని గెలిపించుకోలేకపోయాడనే అపవాదు వస్తుందన్నది రేవంత్ భయంగా కనిపిస్తోంది. అందువల్లే ఆయన తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చాయి. అయితే ఇందులో చాలా కీలకమైనది వ్యవసాయ రుణామ మాఫీ. ప్రతి రైతుకు రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను అధికారంలోకి రాగానే మాపీ చేస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వందరోజులకు పైనే అయ్యింది... కానీ ఇప్పటివరకు రుణమాపీ జరగలేదు. దీని ప్రభావం ఎక్కడ లోక్ సభ ఎన్నికలపై పడుతుందోనన్న భయం సీఎం రేవంత్ లో మొదలయ్యింది. అందువల్లే ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ఒట్టేసి మరీ ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం లోపు రైతు రుణాలను మాపీ చేస్తానని హామీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. 

బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి : 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్ కారణంగానే రైతు రుణమాపీ ఆలస్యం అవుతోందని... ఈ ఎన్నికలు ముగియగానే  మాపీ చేసి తీరతామని హామీ ఇచ్చారు. బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి పంద్రాగస్ట్ లోగా రుణమాపీ చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి : 

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల భువనగిరిలో పర్యటించారు సీఎం రేవంత్. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు రేవంత్. ఈ క్రమంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి పంద్రాగస్ట్ వరకు రైతుల రుణాలు మాపీ చేస్తానని హామీ ఇచ్చారు. రైతులెవ్వరూ అధైర్యపడకూడదని... ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరతామని రేవంత్ అన్నారు. 

జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేసి : 

ఇక నాగర్ కర్నూల్ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి రుణమాపీపై స్పందించారు. జోగులాంబ అమ్మవారిపై ఒట్టేసిమరీ రైతుల రుణాలను మాపీ చేస్తామని చెప్పారు.  ఆరు నూరయినా, అటు పొడిచే సూరీడు ఇటు పొడిచినా పంద్రాగస్టు లోపు రుణమాపీ చేసి తీరతామన్నారు. రుణమాపీ చేయకుంటే రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు.. చేస్తు నువ్వూ, నీ మామ కేసీఆర్ కలిసి బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని రేవంత్ ఛాలెంజ్ విసిరారు.

 

రామప్ప ఆలయంలోని శివుడు, సమ్మక్క సారలమ్మ,  వేయి స్తంభాల ఆలయంపై ఒట్టేసి :

ఇక తాజాగా వరంగల్ లోక్ సభ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా దేవుళ్లపై ఒట్టేసి రైతు రుణాల మాఫీపై హామీ ఇచ్చారు.  రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా.. ఆగస్టు 15లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

ఇలా కేవలం రైతు రుణాల మాపీపై కనిపించిన దేవుళ్లందరిపై ఒట్టు వేస్తున్నారు రేవంత్  రెడ్డి.  ఆరు గ్యారంటీల్లో ఐదు అమలుచేసామని చెబుతున్నా... ఒక్క రైతు రుణమాపీ గురించి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు బిఆర్ఎస్, బిజెపి లు కూడా దీన్నే ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకునేలా కనిపిస్తోంది. అందుకోసమే ముందుగానే రైతు రుణమాపీపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios