సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశించవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.


కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం మార్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశించవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ.. మహిళలను ఆలయంలోకి ప్రవేశించడానికి వీలులేదంటూ పలువురు ఆందోళనకారులు భక్తులను అడ్డుకుంటున్నారు.

అయితే.. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి మహిళలు శబరిమల చేరుకుంటున్నారు. కొందరు మహిళలు మాత్రమే భారీ భద్రత నడుమ అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా.. ఎంతో ఆశతో.. స్వామి వారిని దర్శించుకుందామని వెళ్లిన ఐదుగురు తెలంగాణ మహిళలకు మాత్రం భంగపాటు ఎదురైంది.

 ఇద్దరు మహిళలు ఆదిశేషన్(41),వసంతి(42) మరో ముగ్గురితో కలిసి శబరిమల చేరుకున్నారు. కాగా.. వారు పోలీసు భద్రత కోరకుండా అక్కడికి వెళ్లడం గమనార్హం. అంతేకాకుండా వారి దగ్గర వారి వయసు ధ్రువీకరించడానికి తగిన డాక్యుమెంట్స్ కూడా లేవు. దీంతో.. వారు ఆలయంలోకి వెళ్లడానికి ఆందోళనకారులు అంగీకరించలేదు. 

కొద్ది సేపటి తర్వాత పోలీసులు వారి దగ్గరకు చేరుకొని.. వారి సమాచారం సేకరించారు. తాము దక్షిణ భారతదేశంలోని అన్ని దేవాలయాలను దర్శించుకొని వస్తున్నామని.. ఎక్కడా పోలీసుల రక్షణ అవసరం రాలేదని ఆ మహిళలు వివరించారు. ఆందోళన కారులు వారిని లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడంతో.. వారు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.