Asianet News TeluguAsianet News Telugu

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

శబరిమల తీర్పు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి పున:సమీక్ష చేసుకోవాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళలోని హిందువులకు, అయ్యప్ప భక్తులకు కూడా కావాల్సింది ఇదే.
 

sabarimala women's entry: women's discrimination is wrong and dangerous
Author
Sabarimala, First Published Oct 19, 2018, 3:04 PM IST | Last Updated Oct 19, 2018, 4:22 PM IST

నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి మాలను ధరించి అయ్యప్పను క్రమం తప్పకుండా దర్శిస్తూ వస్తున్నాను. అయితే అమెరికాలో చదువుకునేటప్పుడు శబరిమల రావడం వీలుపడలేదు.. అయితే తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత నుంచి ప్రతీ ఏటా శబరిమల వెళ్లడం తప్పనిసరి చేసుకున్నా. అలా ఈ ఏడాదితో 25వ సారి మాల ధరించి గురుస్వామిగా మారాను. భారీ వరదల కారణంగా ఆగస్టు/ సెప్టెంబర్ ‌నెలల్లో అయ్యప్పను దర్శించుకోలేకపోయాను. 

కేరళలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ వాటిలో దేనికీ లేని విశిష్టత, చరిత్ర, నియమ నిష్టలు శబరిమల ఆలయానికి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కేవలం మలయాళ మాసం ప్రారంభమైన మొదటి ఐదు రోజులు శబరిమల ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. అన్ని వయస్సులకు చెందిన పురుషులు ఆలయాన్ని దర్శించవచ్చు.. కానీ 50 ఏళ్ల లోపు మహిళలకు మాత్రం ఆలయ ప్రవేశం నిషిద్ధం. 

ఇన్ని సంవత్సరాల నుంచి కోట్లాది మంది అయ్యప్ప భక్తులతో కలిసి అయ్యప్ప నామాన్ని జపిస్తూ శబరిమల కొండల్లో అడుగుపెడుతున్నాను. వీరిలో పెద్దలు, పిన్నలు.. పేదలు-ధనికులు ఉన్నారు. వారి వేసే ప్రతి అడుగు అయ్యప్ప కోసమే.. ఇన్నాళ్ల నుంచి ప్రతి ఒక్కరి శబరిమల యాత్ర ఇలాగే సాగుతూ వస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం నా తల్లిని అయ్యప్ప దర్శనానికి తీసుకుని వచ్చి.. కొడుకుగా నా బాధ్యతను నెరవేర్చాను. 

అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హిందూ సమాజాన్ని రెండుగా విభజిస్తుండగా.. అందువల్ల జరుగుతున్న ఘర్షణలను చూస్తూ కేరళ ప్రభుత్వం ఆనందిస్తోంది. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ప్రజలు.. అందులోనూ మహిళలు తమ భవిష్యత్తు కోసం, వారసత్వాన్ని, మత విశ్వాసాలను కాపాడుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేపట్టారు. 

ఆచారాలను, సంస్కృతిని.... మహిళల పట్ల వివిక్షను అయ్యప్ప ఆలయంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇక్కడ చర్చ విశ్వాసానికి, రాజ్యాంగానికి మధ్యే. కాలమాన పరిస్థితుల బట్టి విశ్వాసాల్లోనూ మార్పులు రావాలనే ప్రశ్న తలెత్తడం సహజం.

దీనిలో భాగంగానే ట్రిపుల్ తలాక్, దర్గాలు, మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై సహజంగానే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మత విశ్వాసాలు, మహిళల పట్ల వివక్ష అన్న దానిపై రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. మహిళలను అన్ని విషయాల్లోనూ సమానంగా చూడబడటం ఆనందించదగ్గ విషయమే.. మరి అలాంటప్పుడు కేరళలో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది. 
 
సమాధానం సులభం.. ఇక్కడ చూడవలసింది సమానత్వం, వివక్ష కాదు.. ఇది అయ్యప్పను ఆరాధించే విషయంలో మహిళలు, పురుషులు పాటిస్తూ వస్తున్న నియమం. తరతరాలుగా హిందువుల ఆచారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, పూజా విధానాలను రాతపూర్వకంగా పొందుపరచలేదు..

కేవలం పెద్దల నుంచి మౌఖికంగానో లేదంటే.. వారిని చూస్తూ పెరగడం వల్లనో తెలుస్తూ వచ్చాయి. అదే ఇస్లాం, క్రైస్తవ మతాలతో పాటు కాలక్రమంలో పుట్టుకొచ్చిన ఇతర మతాల ఆచారాలను పుస్తక రూపంలో వివరంగా వ్రాసి వుంచారు. అలాగే ఒక్కో హిందూ దైవానికి ఒక్కో రకమైన పూజా విధానాన్ని మన పెద్దలు తెలిపారు. 

ఇస్లాం, క్రైస్తవ మతాల్లో చర్చిలు, మసీదులను కేవలం ప్రార్థనా మందిరాలుగానే వ్యవహరించబడుతుండగా.. హిందూ మతంలో దేవాలయాన్ని భగవంతుడి నివాసంగా విశ్వసిస్తారు. చాలా ఆలయాల్లో మగవారి ప్రవేశంపై నిషేధం ఉంది. ఇక్కడ కేవలం ఆడవారికి మాత్రమే అనుమతి ఉంది. అంటే ఆ ఆలయంలో పూజలు అందుకుంటున్న దేవునికి ప్రత్యేకమైన పూజా విధానం ఉందని అర్థం చేసుకోవాలి. 

వేల ఏళ్ల చరిత్ర కలిగిన శబరిమల ఆలయంలో పితృస్వామ్య విధానం ఉందని.. మహిళల పట్ల వివిక్ష చూపిస్తారనడం తప్పు.. దురదృష్టవశాత్తూ ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలపై ప్రభావం చూపుతుంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎంతోమంది నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇది సహజంగానే ఢిల్లీ పెత్తనంగా తయారైంది. 

చివరికి ఇది కాస్తా ట్రిపుల్ తలాక్‌‌ విధానంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యతో పోల్చి చూస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించేలా అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను చూస్తే.. పిల్ వేసిన వారంతా లాయర్లు అయ్యప్ప భక్తులు కాదు.. వారు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైప్పటికీ.. వీరిలో కొందరిపై కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఉంది.

ఆ పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కేరళ ప్రభుత్వం కానీ.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డులు సైతం పిటిషనర్లకు మద్ధతు తెలుపుతూ.. న్యాయస్థానం సాక్షిగా శబరిమల ఆలయ ఆచారాలను ఉల్లంఘించాయి. అయ్యప్ప ఆలయ ఆచారాలపైనా.. మత విశ్వాసాలపైనా ఎవరైతే పోరాడుతున్నారో.. వారు లేవనెత్తిన ప్రశ్నలకు సదరు పిటిషనర్లు సమాధానం చెప్పడం లేదు.  

మతపరమైన అంశాల్లో హేతుబద్ధతను పరిగణనలోనికి తీసుకోరాదంటూ తీర్పును వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా . బలవంతపు ఆలయ ప్రవేశం హిందూ మతాచారాలను దెబ్బతీస్తుందని ఆమె సైతం అభిప్రాయపడ్డారు. 

కోర్టు తీర్పుతో కులాలకు అతీతంగా నరనరాన హిందూ మతాన్ని జీర్ణించుకున్న కేరళలోని హిందువులకు ఆగ్రహం తెప్పించింది. తరతరాలుగా పాటిస్తూ వస్తున్న మతాన్ని, ఆచారాలను, విశ్వాసాలు ప్రమాదంలో పడ్డాయని వారు భావించారు. వారి విశ్వాసాలను అర్థం చేసుకోకుండా కొందరు చేసిన సరిదిద్దుకోలేని తప్పు పరిస్థితిని అత్యంత క్లిష్టంగా మార్చేసింది. 

కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దకుండా.. ప్రజల మధ్య విభేదాలను సృష్టించడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తారని భావిస్తున్నా. 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విశ్వాసాలు, మత సంబంధమైన వాటిపై ఎలాంటి నమ్మకాలు లేని వారు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరికాదు. వివిక్షను ఎదుర్కొంటున్నారు కాబట్టి ముస్లిం మహిళలు వేసిన పిటిషన్‌ సరియైనదే.. అయితే ఒకవేళ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశంపై మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉన్నట్లయితే రెండింటి మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించాలి. 

తీర్పు వల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఊహించగలగాలి. ఒకవేళ ఇస్లాంలోని బైగామి, హిజాబ్ వంటి పద్ధతులపై హిందువులు కానీ ముస్లింలు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. లేదంటే క్రిస్టియన్ విధానాలపై హిందువులు కోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో పరిగణనలోనికి తీసుకోవాలి. శబరిమల తీర్పు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి పున:సమీక్ష చేసుకోవాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళలోని హిందువులకు, అయ్యప్ప భక్తులకు కూడా కావాల్సింది ఇదే.

స్వామియే శరణం అయ్యప్ప

ఇట్లు,
రాజీవ్ చంద్రశేఖర్
అయ్యప్ప భక్తులు, పార్లమెంట్ సభ్యులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios