డైట్ చేస్తున్నామని, షుగర్ వచ్చిందని, బరువు తగ్గాలని చాలామంది చక్కెర తినడం మానేస్తున్నారు. కానీ చక్కెర పూర్తిగా మానేస్తే శరీరంలో వచ్చే మార్పులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర.. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర మన రోజువారీ తినే అనేక ఆహార పదార్థాల తయారీకి చాలా అవసరం. స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇలా చాలా వాటిలో చక్కెర ఉంటుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. అందుకే ఆహారంలో చక్కెర తీసుకోవడం తగ్గిస్తారు. లేదా పూర్తిగా మానేయడం చేస్తారు. కాని దీని వల్ల శరీరంలో వచ్చే మార్పులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందాం.
ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి
చక్కెర తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. దీనికి కారణం అది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందుకే నీరసంగా అనిపిస్తే వెంటనే ఏదైనా స్వీట్ లేదా చక్కెర తినమంటారు. కాని తర్వాత మళ్లీ రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి. దీన్ని షుగర్ క్రాష్ అంటారు. దీనివల్ల నీరసంగా ఉంటారు.
అందుకే చక్కెర పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. దీనివల్ల మీ ఎనర్జీలో హెచ్చుతగ్గులు తగ్గుతాయి. మీరు పగటిపూట ఎక్కువ ఉత్సాహంగా, అలసట లేకుండా ఉంటారు.
మూడ్, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడతాయి
చక్కెర మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల ఎక్కువ మంది చక్కెరకు అలవాటు పడతారు. ఇది మూడ్ స్వింగ్స్ కి దారితీస్తుంది.
చక్కెర మానేయడం వల్ల మెదడులో మంట తగ్గుతుంది. న్యూరోట్రాన్స్మిటర్లు సమతుల్యంగా ఉంటాయి. దీనివల్ల ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.
బరువు తగ్గుతారు
చక్కెరలో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం. చక్కెర మానేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇన్సులిన్ కొవ్వును నిల్వ చేసే హార్మోన్ కాబట్టి దాని స్థాయి తగ్గడం కొవ్వును తగ్గిస్తుంది. ఆకలి తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల చర్మంలో మంట కలుగుతుంది. ఇది మొటిమలు, ముడతలు, ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. చక్కెర మానేయడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.
దంతాల సమస్యలు తీరతాయి
నోటిలోని బ్యాక్టీరియాకు చక్కెరే ఆహారం. ఇది ఆమ్లాలను ఉత్పత్తి చేసి దంతాలను దెబ్బతీస్తుంది. ఇది దంతక్షయం, ఇతర దంత సమస్యలకు దారితీస్తుంది. చక్కెర మానేయడం వల్ల నోటిలో యాసిడ్ సమస్యలు తగ్గుతుంది. దీనివల్ల దంతక్షయం వచ్చే అవకాశం తగ్గుతుంది. చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులకు కారణం ఎక్కువ చక్కెర తీసుకోవడమే. చక్కెర మానేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
షుగర్ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది
ఎక్కువ చక్కెర తీసుకోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి దారితీస్తుంది, ఇది టైప్ 2 షుగర్ కి ప్రధాన కారణం. చక్కెర మానేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. టైప్ 2 షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది
చక్కెర పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, మంటకు దారితీస్తుంది. చక్కెర మానేయడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.