80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?
80s AI: సోషల్ మీడియాలో ఇప్పుడు 1980ల కాలాన్ని గుర్తు చేసే ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఆ కాలం నాటి ఫ్యాషన్, బ్యాగ్రౌండ్ ను AI సాయంతో రూపొందిస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి రాజకీయ నాయకులు చేరుతున్నారు.

80ల స్టైల్‌లో రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో 80ల నాటి వింటేజ్ లుక్‌లో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘Joining 80s Trend’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ చిత్రంలో ఆయన అప్పటి కాలానికి తగ్గట్టుగా కనిపించారు. బెల్‌బాటమ్ తరహా దుస్తులు, పాతకాలపు హెయిర్‌స్టైల్‌తో పాటు వెనుకవైపు యమహా బైక్, క్యాసెట్ రికార్డర్, పాత పోస్టర్లను పోలిన సెటప్ ఉండటం ఫొటోకు మరింత రెట్రో రూపాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం కనిపించే ఆయన రాజకీయ నాయకుడి లుక్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉండటంతో నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
Joining 80’s trend… pic.twitter.com/LpfG6CxpGA
— Revanth Reddy (@revanth_anumula) September 10, 2026
మోదీ ఫొటో కూడా
ఈ వైరల్ ట్రెండ్ రాజకీయ వర్గాల్లోనూ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన 80ల నాటి స్టైల్ ఫొటోను షేర్ చేసింది. ‘The OG in 80s’ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని పోస్టు చేసింది. అప్పటి కాలాన్ని ప్రతిబింబించే దుస్తులు, హెయిర్‌స్టైల్, ఫొటో కలర్ టోన్‌తో ఈ చిత్రం రూపొందింది. రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉండే నేతలు.. యువతలో ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ట్రెండ్స్‌లో భాగమవుతున్నారు.
AIతో పాతకాలాన్ని మళ్లీ తెరపైకి
80s ట్రెండ్ వెనుక ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది. ఒక సాధారణ ఫొటోను AI టూల్‌లో ఉపయోగించి దుస్తులు, జుట్టు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్, కలర్ టోన్ వంటి అంశాలను మార్చడం ద్వారా 1980ల నాటి వ్యక్తిలా కనిపించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ఆ కాలాన్ని ప్రత్యక్షంగా చూడని యువతకు కూడా అప్పటి ఫ్యాషన్, ఫొటో స్టైల్ ఎలా ఉండేదో డిజిటల్ రూపంలో చూసే అవకాశం లభిస్తోంది. టెక్నాలజీని కేవలం పని అవసరాలకు మాత్రమే కాకుండా వినోదం, సృజనాత్మకత కోసం కూడా ఉపయోగించవచ్చని ఈ ట్రెండ్ మరోసారి చూపిస్తోంది.
సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు
80s AI ట్రెండ్ ఇప్పటికే సినీ పరిశ్రమలోనూ విస్తృతంగా కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మీనా, అనిల్ రావిపూడి సహా పలువురు ప్రముఖుల ఫొటోలను 1980ల కాలానికి తగ్గట్టుగా మార్చిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పాత సినిమాలను తలపించే దుస్తులు, హెయిర్‌స్టైల్, కెమెరా టోన్, నేపథ్యాలతో రూపొందుతున్న ఈ ఫొటోలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. అదే సమయంలో తమ చిన్ననాటి లేదా ప్రస్తుత ఫొటోలను 80s స్టైల్‌లోకి మార్చుకోవడానికి సాధారణ నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో AI ఆధారిత ఫొటో ట్రెండ్స్‌లో మరో కొత్త అధ్యాయం మొదలైనట్టైంది.

