Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
దేశ రాజధాని డిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇవాళ ఉదయం నుండి కురుస్తున్న వర్షాలతో వరదనీరు డిల్లి విమానాశ్రయంలోకి చేరుకుంది.. ఇలా పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానాలను దారిమళ్లిస్తున్నారు.

రాజధాని నగరంలో వర్షబీభత్సం
Heavy Rain Alert : అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్లుంది ప్రస్తుతం ఇండియాలో వాతావరణ పరిస్థితి. ఎల్ నినో ప్రభావంతో కొన్నిచోట్ల వర్షాలు కురవడంలేదు... మరికొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తగా తాజాగా దేశ రాజధాని డిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇవాళ (ఆగస్ట్ 24, సోమవారం) ఉదయం నుండి విరామం లేకుండా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. దీంతో డిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి... రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు.. ఉద్యోగులు ఆఫీసులకు, వ్యాపారులు తమ పనులపై బయటకు వెళ్లే సమయంలో జోరు వర్షం కురిసింది. ఇదే సమయంలో రోడ్లపై వర్షపునీరు చేరి వాహనాల రాకపోకలు నెమ్మదించాయి... దీంతో డిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు ఈ వర్షాల కారణంగా విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.
డిల్లీకి వెళ్లే విమానాలు దారిమళ్లింపు..
దేశ రాజధాని డిల్లీలో కురుస్తున్న వర్షాలు రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోడ్డు మార్గమే కాదు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆకాశ మార్గంలో కూడా అడ్డంకులు తప్పడంలేదు. భారీ వర్షాల కారణంగా డిల్లీలోని ఇందిరాగాందీ విమానాశ్రయంలో (IGI) విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షపునీరు ప్రయాణికులను ఇబ్బంది పెడుతుండగా... ఈదురుగాలులతో కూడిన వర్షం విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు అనుకూలించడంలేదు. దీంతో డిల్లీ విమానాశ్రయానికి వచ్చే విమానాలను ఇతర ఎయిర్ పోర్ట్స్ కు మళ్లిస్తున్నారు.
ఇప్పటికే డిల్లీ IGI ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సిన 14 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు అధికారులు. జైపూర్ ఎయిర్ పోర్టుకు 11 విమానాలు దారి మళ్లించారు... ఇక చండీగఢ్ ఎయిర్ పోర్టుకు 2, లక్నో ఎయిర్ పోర్టుకు ఓ విమానం దారి మళ్లించారు. మరికొన్ని విమానాలను కూడా దారిమళ్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాకే అంటే డిల్లీలో వర్షాలు తగ్గానే ఐజిఐ ఎయిర్ పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ సాధ్యం అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. విమానాల దారి మళ్లింపుతో డిల్లీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిల్లీలో రెడ్ అలర్ట్
ఇప్పటికే డిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... ఈ రోజంతా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... నగరవాసులు అవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి చెట్లు, కరెంట్ పోల్స్, పెద్దపెద్ద హోర్డింగ్స్ కు దూరంగా ఉండాలని డిల్లీ ప్రజలకు అధికారులు ముందుజాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ రోజంతా భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
డిల్లీలో హయ్యెస్ట్ వర్షపాతం ఇక్కడే..
డిల్లీలోని ఛతన్ పూర్ లో ఇవాళ ఉదయం నుండి అత్యధికంగా 28 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక లోదీ రోడ్డులో 24.6 మి.మీ, పీతంపురలో 18.5 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇది పెద్ద వర్షపాతం కాకపోయిన వానకు ఈదరుగాలులు తోడవడంతో ప్రమాదకరంగా మారింది. కాంక్రీట్ రోడ్లపై నీళ్లు ఇంకిపోయే అవకాశం లేదు... కాబట్టి చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వర్షపునీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. న్యూ అశోక్ నగర్, బురారీ, సీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది.
కేవలం డిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండ్రోజులు (ఆగస్ట్ 24,25) వర్షాలు కొనసాగుతాయని... నదులు, జలాశయాలు, వాగులు, చెరువుల్లో నీటిమట్టం పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ, అతిభారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయి... కాబట్టి ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.

