Fact Check: ఢిల్లీ నిరసనల్లో ప్రాణ నష్టంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Fact Check: నీట్ పరీక్ష నిర్వహణపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన కొన్ని పోస్టులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

వైరల్ పోస్టులపై కేంద్రం స్పందన..
ఆందోళనల సందర్భంగా విద్యార్థుల ప్రాణనష్టం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన పోస్టులు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం నిరసనల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ "ఎక్స్"లో వివరాలు వెల్లడిస్తూ, ప్రజలు ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ కోసం పంపించాలని కూడా సూచించింది.
సీజేపీ హెచ్చరికలు.. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన నిరసనలు కేవలం ప్రారంభమేనని, అవసరమైతే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యువతను ఢిల్లీకి తీసుకువస్తామని హెచ్చరించారు. గత నెల రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపట్టామని, అయితే పోలీసుల చర్యల వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆరోపించారు. నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల మద్ధతు అవసరం అని కూడా పిలుపునిచ్చారు.
🚨 Social media users are circulating a video alleging casualties during the protests in Delhi.#PIBFactCheck:
❌ This claim is #Fake.
✅ Delhi Police has confirmed that no casualties have been reported during the protests.
🔗 https://t.co/AGEqyIMdPm
⚠️ Stay alert and rely… pic.twitter.com/o0QWBgMFlY— PIB Fact Check (@PIBFactCheck) July 22, 2026
మెట్రో స్టేషన్లు మూసివేత.. భారీ భద్రతా ఏర్పాట్లు
నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ రాజధానిలో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాయి. జన్‌పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి వంటి ఆరోపణలతో పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 250కు పైగా సీసీటీవీ, వీడియో ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల దృష్ట్యా పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను ఢిల్లీకి తరలించారు. ఇదే సమయంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌కు విదేశాల్లో కూడా సంఘీభావం వ్యక్తమవుతుండటం ఈ అంశానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

