- Home
- Entertainment
- Movie Reviews
- Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Srinivasa Mangapuram Review: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతూ నటించిన మూవీ `శ్రీనివాస మంగాపురం` నేడు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే?

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ
సూపర్ స్టార్ కృష్ణ రెండో తరం వారసుడిగా పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తనయుడు జై కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. `శ్రీనివాస మంగాపురం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ సి అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై జెమినీ(పి) కిరణ్ నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. నేడు గురువారం(జులై 30)న ఈ మూవీ విడుదలైంది. మరి జై కృష్ణ డెబ్యూ మూవీ ఎలా ఉంది? హిట్ కొట్టాడా? కృష్ణకి సరైన వారసుడు అనిపించుకున్నాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
శ్రీనివాస మంగాపురం మూవీ కథ
తిరుపతిలో పెద్దిరెడ్డి(శ్యామ్) అంటే అందరికి హడల్. తేడాలు వస్తే తలకాయలు తీసే బ్యాచ్. తమ మనుషుల అమ్మాయిని ప్రేమించాడని ఒకడిని చితకబాదుతారు. ఇది చూసి శ్రీను(జై కృష్ణ) షాక్ అవుతాడు. పెద్ది రెడ్డి ఎంత డేంజరో తెలుసుకుంటాడు. శ్రీవారి వేడుకలో ఆయన కూతురు మంగా(రాషా తడాని)ని చూసి ప్రేమలో పడతాడు. రోజూ ఆమె వెంటపడతాడు. ఆమె చిరాకు పడ్డా వదలడు. ఆమె థియేటర్స్ నేర్చుకుంటుంది. నాటకాల్లో మంగా సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోవడంతో శ్రీను హెల్ప్ చేస్తాడు. ఈ క్రమంలో ఆమెని ప్రేమలో పడేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాడు. కానీ అప్పటికే మంగాకి పెళ్లి కుదురుతుంది. ఎంగేజ్ మెంట్‌కి కూడా వెళ్తాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లి.. తన పుట్టిన రోజు తిరుపతి సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు శ్రీను. కానీ దీన్ని ఆమె తిరస్కరిస్తుంది. ఛీ కొడుతుంది. అయితే మంగని శ్రీను ఇబ్బంది పెట్టడాన్ని పెద్ది రెడ్డి తమ్ముడు చూస్తాడు. అతన్ని కొట్టి కారులో తీసుకొని వెళ్తుండగా, కొందరు ఎటాక్ చేస్తారు. ఆ దాడిలో పెద్ది రెడ్డి తమ్ముడిని శ్రీను కాపాడతాడు. దీంతో శ్రీనుని ఏం చేయకుండా వదిలేస్తారు. అయితే అప్పుడే పెద్ది రెడ్డి చెల్లి(వాసుకి)కి ఈ విషయం తెలుస్తుంది. దీంతో వెళ్లి శ్రీను బెదిరిస్తుంది. మంగాని వదిలేయమని చెబుతుంది. ఈ క్రమంలో శ్రీనుని వాసుబాబు అని పిలుస్తుంది. మరి వాసు బాబు శ్రీనుగా ఎలా మారాడు? ఇంతకి వాసుబాబు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వాసుబాబుకి భళ్లారి జిల్లాకే పెద్ద అయిన వెంకటప్పయ్య నాయుడు(మోహన్ బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? శ్రీను అసలు తిరుపతి ఎందుకు వచ్చాడు? మంగా, శ్రీను లైఫ్‌లో ఏం జరిగింది? చివరికి వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా.
శ్రీనివాస మంగాపురం ఎలా ఉందంటే
సూపర్ స్టార్ కృష్ణ మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్. ఎన్టీఆర్ తర్వాత కమర్షియల్ మూవీస్‌తో టాలీవుడ్‌ని ఊపేశారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా అదే పంథాని ఫాలో అయ్యాడు. తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. కానీ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన తనయుడు జై కృష్ణ ఆ లోటుని తీర్చేందుకు వచ్చారని చెప్పొచ్చు. కటౌట్ పరంగా సాలిడ్‌గా ఉన్నారు. దీంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన `శ్రీనివాస మంగాపురం` మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన సినిమా కూడా మాస్ కమర్షియల్ అంశాలతోనే సాగింది. బేసిక్‌గా పెద్ద హీరోల వారసులు ఇలాంటి కమర్షియల్ చిత్రాలతోనే వస్తారు. మాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జై కృష్ణ కూడా అదే చేశారు. కాకపోతే ఇటీవల కాలంలో రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు ఆడటం లేదు. ఆ పరంగా ఈ సినిమా విషయంలో జై కృష్ణ సాహసమే చేశాడని చెప్పొచ్చు. కానీ ఆయన వెనకాల అశ్వినీదత్, జెమినీ కిరణ్, జై కృష్ణ చిన్నతాత ఆదిశేషగిరి రావులు ఉన్నారు. దీంతో ఈ మూవీని సాలిడ్ లవ్, అండ్ ఫ్యామిలీ మాస్ మసాలా కమర్షియల్ మూవీగా మలిచారు. జై కృష్ణకి మంచి డెబ్యూ మూవీని అందించారు. రెగ్యూలర్ కమర్షియల్ మూవీ కావడంతో కథ పరంగా కొత్తగా ఉండదు. ఒక ఇరవై ఏళ్లనాటి కథలనే పోలి ఉంటుంది. అదే స్టయిల్‌లో మూవీ సాగుతుంది. దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు. ప్రారంభంలో రెగ్యూలర్ లవ్ ట్రాక్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. విలన్‌ని పవర్‌ఫుల్‌గా చూపించడం కామనే. ఇందులోనూ అదే జరిగింది. ఆ తర్వాత హీరో.. హీరోయిన్ వెంటపడటం రొటీన్‌గానే వెళ్తుంది. కాకపోతే జై కృష్ణ ప్రజెన్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అతను తనదైన స్టయిల్‌లో చేసుకుంటూ వెళ్లారు. ఫస్టాఫ్ అంతా రెగ్యూలర్‌గానే సాగుతుంది. మధ్యలో సీనియర్ నటుడు నరేష్ పాత్ర కొంత కామెడీని పంచుతుంది. దీనికితోడు బాలుగా బ్రహ్మాజీ తనదైన కామెడీతో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. వీరికాంబినేషన్‌లో సీన్లు నవ్వించేలా ఉంటాయి. అలాగే నరేష్ పెళ్లిళ్ల స్టోరీ క్రేజీగా ఉంటుంది. తన రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది.
శ్రీనివాస మంగాపురం మూవీలో హైలైట్స్, మైనస్ లు
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సినిమాపై అది ఆసక్తిని పెంచుతుంది. హీరోహీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. వాసుబాబుకి, మంగాకి ఉన్న సంబంధం, వారి రిలేషన్, లవ్ స్టోరీ రివీల్ అవుతుంది. అందులోనే మోహన్‌బాబు ఎంట్రీ ఉంటుంది. ఆయన సన్నివేశాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. హీరోహీరోయిన్ల గతం, ప్రస్తుతానికి మారే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. క్లైమాక్స్ కూడా ఎమోషనల్‌గా ఉంటుంది. మంగా పెళ్లిలోని మలుపులు కొంత ఆసక్తికరంగా సాగుతాయి. అయితే ముగింపు మాత్రం రెగ్యూలర్‌గానే ఉంటుంది. సినిమా కథ రొటీన్‌గానే కాదు, కథనం కూడా రెగ్యూలర్‌గా ఉంటుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రేమలోనూ డెప్త్ లేదు, ఫీల్ లేదు. ఎమోషన్స్ అంతగా పండలేదు. దీంతో చాలా సీన్లు తేలిపోయిన ఫీలింగ్ కలుగుతాయి. కొన్ని ట్విస్ట్ లు, ఫ్యామిలీ డ్రామా, ఎలివేషన్లు సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. కాకపోతే ట్విస్ట్ లు మరింత బలంగా రాసుకోవాల్సింది. మోహన్ బాబు పాత్రని ఇంకా బలంగా డిజైన్ చేయాల్సింది. లవ్ స్టోరీ ట్విస్ట్ లతో ఫర్వాలేదనిపించినా, ఇంకా ఎమోషనల్‌గా డిజైన్ చేయాల్సింది. దర్శకుడు సినిమాని రొటీన్‌గా నడిపించడంతో వచ్చి పోతున్నా ఎన్నో సినిమాల్లో ఇదొకటి అనే ఫీలింగ్ ని తెప్పిస్తుంది. హీరో పాత్రకి సంబంధించిన సీన్లు కూడా ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. కాకపోతే జైకృష్ణకి మాస్ ఎంట్రీకి సెట్ అయిన సినిమాగా చెప్పొచ్చు.
శ్రీనివాస మంగాపురంలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
శ్రీను అలియాస్ వాసుబాబుగా జై కృష్ణ బాగా చేశాడు. కొత్తవాడైనా ఈజ్‌తో చేశాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఫైట్లు బాగా చేశాడు. డాన్సులు కూడా ఇరగదీశాడు. సన్నివేశం ఏదైనా ఈజీగా చేసుకుంటూ వెళ్లాడు. అతనిలో మంచి కసి కనిపించింది. కాకపోతే ఆయనలో మహేష్ బాబు కనిపించాడు. బాబాయ్ స్టయిల్‌ని ఫాలో అయినట్టుగా ఉంది. లుక్ పరంగా బాగున్నాడు. కటౌట్ సాలిడ్‌గా ఉంది. మంచి హీరో మెటీరియల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా నలగాలి. ఎక్స్ ప్రెషన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇంకా కష్టపడాలి. డెబ్యూ మూవీకే ఈ మాత్రం చేశాడంటే అభినందించాల్సిందే. ఇక మంగా పాత్రలో రవీనా టండన్ కూతురు రాషా తడాని ఫర్వాలేదనిపించింది. ఆమెకి కూడా కొత్తనే కావడంతో నటన పరంగా, ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా బెటర్ కావాల్సి ఉంది. వెంకటప్పనాయుడుగా మోహన్ బాబు కనిపించేది తక్కువే, కానీ కనిపించినంత సేపు ఆయన తన నటనతో డామినేట్ చేశాడు. మెప్పించాడు. కాకపోతే ఆయన పాత్రని ఇంకా బలంగా, ఎక్కువ నిడివితో చూపించాల్సింది. ఆర్కేస్ట్రా బాలుగా బ్రహ్మాజీ నవ్వించే ప్రయత్నం చేశాడు. స్వతంత్రబాబుగా నరేష్ రెచ్చిపోయాడు. హీరోయిన్ అత్తగా వాసుకి పాత్రలో ఒదిగిపోయింది. నెగటివ్ రోల్‌లో అజయ్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
శ్రీనివాస మంగాపురం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
జీవీ ప్రకాష్ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క పాట ఫర్వాలేదు. మిగిలినవి, రెగ్యూలర్ కమర్షియల్ సాంగ్స్ గానే ఉన్నాయి. పాటలు సినిమాకి ప్లస్ కాలేకపోయాయి. జయకృష్ణ గుమ్మడి కెమెరా వర్క్ బాగుంది. లాంగ్ షాట్స్ బాగా చూపించాడు. విజువల్స్ గా కలర్‌ఫుల్‌గా ఉంది. తన క్రియేటివిటీ కనిపించింది. మాధవ్ కుమారు గల్లపల్లి ఎడిటింగ్ ఇంకా చేయాల్సింది. సినిమాని కొత్త కత్తిరించవచ్చు. కొన్ని సీన్లలు ఆర్డర్ మిస్ అయిన ఫీలింగ్ ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా తీశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. అన్ని లైవ్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఇది మరో హైలైట్‌గా చెప్పొచ్చు. దర్శకుడు అజయ్ భూపతి `ఆర్‌ఎక్స్ 100`, `మంగళవారం`తో మెప్పించాడు. కానీ ఈ సినిమా విషయంలో తన మార్క్ కనిపించలేదు. రొటీన్ కమర్షియల్ మూవీ చేశాడు. డిజప్పాయింట్ చేశాడు. ఏది ఇందులో బలంగా చూపించలేకపోయాడు. అన్నీ లైటర్‌వేలోనే టచ్ చేశాడు. అదే పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు.
ఫైనల్ నోట్, రేటింగ్
జైకృష్ణ మాస్ ఎంట్రీ బాగుంది. ఇదొక రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా నిలుస్తుంది.
రేటింగ్ 2.5

